రివర్స్: పవన్ కళ్యాణ్ అలా, నాగబాబు ఇలా, చిరంజీవికి ఝలక్!
రూ.500, రూ.1000 రద్దు అంశంపై మెగా సోదరులు స్పందించారు. నాగబాబు ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించారు. పవన్ స్వాగతించినప్పటికీ ప్రజల ఇబ్బందులను ప్రశ్నించారు.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు అంశం పైన మెగా సోదరులు ఒకింత భిన్నంగా స్పందించారు! నోట్ల రద్దును నాగబాబు స్వాగతించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సమర్థించారు. అయితే, ఆదివారం మాత్రం జనాల ఇబ్బందులపై ముందు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు.
ఇక చిరంజీవి నేరుగా స్పందించలేదు. కానీ ఆయన ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం నోట్ల రద్దును ప్రశ్నిస్తోంది. రూ.500, రూ.1000 రద్దుతో పెద్దలకే లాభం చేకూర్చేలా మోడీ చేశారని, పేదలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ప్రధాని మోడీ నవంబర్ 8వ తేదీన రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో ఆయన నోట్ల రద్దును ప్రకటించారు. ఆ తర్వాత నవంబర్ 11వ తేదీన అనంతపురంలో పవన్ కళ్యాణ్ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నోట్ల రద్దును ఆయన స్వాగతించారు.

అయితే, పన్నెండు రోజులుగా ప్రజలు ఇబ్బంది పడటాన్ని గుర్తించిన పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు ట్విట్టర్‌లో స్పందించారు. నోట్ల రద్దు వల్ల జరిగే ఇబ్బందులపై కేంద్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు.
అదే సమయంలో నాగబాబు మాత్రం నోట్ల రద్దును పూర్తిగా సమర్థించారు. ప్రజల ఇబ్బందులను కూడా ఆయన ప్రస్తావించారు. దేశం కోసం ఇలాంటి మేజర్ మంచి సంస్కరణలు జరిగినప్పుడు ఇబ్బందులు తప్పవని, మోడీ కూడా 50 రోజులు ఇబ్బంది ఉంటుందని ముందే చెప్పారని ఓ వీడియోలో చెప్పారు.
అంతేకాదు, తాను మోడీ అభిమానిని కాదని, అంతకుమించి బీజేపీ వ్యక్తిని కాదని, తన సోదరుడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడే తాను కాంగ్రెస్ వ్యక్తిని అయ్యానని, కానీ మంచి చేసినప్పుడు పార్టీలకు అతీతంగా ప్రశంసించాలన్నారు. అందుకే మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
గత డెబ్బై ఏళ్లలో ఇలాంటీ దమ్మున్న ప్రధానమంత్రిని చూడలేదని పేర్కొన్నారు. నోట్ల రద్దు పైన చాలామంది విమర్శలు చేస్తున్నారని, కానీ విమర్శలను, తిట్లను ఆయన పట్టించుకునే నాయకుడు కాదని చెప్పారు. మంచి చేయాలనుకున్నప్పుడు స్వాగతిద్దామన్నారు. నోట్ల రద్దు వల్ల నాకు కూడా కొంత ఇబ్బంది కలుగుతోందని, తమ సినిమాలకు నష్టం జరుగుతోందని, కానీ దేశం కోసం భరించాలని అభిప్రాయపడ్డారు.
చిరంజీవికి, కాంగ్రెస్‌కు షాక్
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడు నాగబాబు ఆయన వెంటే ఉన్నారు. పవన్ జనసేన స్థాపించినప్పుడు కూడా నాగబాబు ఏ వైపు అనే చర్చ జరిగింది. తాను అన్నయ్య వెంటే ఉంటానని నాగబాబు స్పష్టం చేశారు. అయితే, నోట్ల రద్దు విషయంలో ఓ వైపు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తుంటే, నాగబాబు మాత్రం ఇలాంటివి సహజమని చెప్పి కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారని, ఇది చిరంజీవికి కూడా ఇబ్బందికరమేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications