వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యధేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా: బాబు ఆదేశాలు డోంట్ కేర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అక్రమార్కులకు కల్పతరువుగా మారాయి. ఏపీ ప్రభుత్వం 2016 మార్చి నుంచి ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశ పెట్టింది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అమరావతి‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అక్రమార్కులకు కల్పతరువుగా మారాయి. ఏపీ ప్రభుత్వం 2016 మార్చి నుంచి ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశ పెట్టింది. ప్రభుత్వ పథకాలకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని జారీచేసిన జీవోను అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

2015లో పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఇసుక మాఫియాను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షి పట్ల ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహరించిన తీరు, ఇటీవల చిత్తూరులో ఇసుక లారీ ఢీ కొట్టి సామాన్యులు మరణించిన ఘటన వెలుగు చూశాయి. ప్రభుత్వం ఇసుక విధానంపై కొత్త జీవో తీసుకురావడంతో పాటు ధరల ఖరారుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తోంది. జిల్లా కమిటీల ఆదేశాల మేరకు దూసి ఇసుక ర్యాంపు మూసివేసి, కొత్తగా ర్యాంపులను ఏర్పాటు చేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం.

అంతే కాదు ఉచిత ఇసుకను సైతం సొంత సొత్తులా అమ్మేసుకుంటున్న అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం చర్యలకు పూనుకొంది. ఇసుకాసురుల కారణంగా ప్రస్తుతం మార్కెట్లో 3 క్యూబిక్‌ మీటర్ల ట్రాక్టరు ఇసుక (ఒక యూనిట్‌) ధర రూ.2500 నుంచి రూ.3500 వరకూ పెరిగింది. ఇసుక ఉచితంగా ఇస్తున్నా ఈ ధరలు తగ్గక పోవడానికి దళారులే కారణమని గుర్తించిన ప్రభుత్వం జిల్లాల వారీ ధరలు నిర్ణయించాలని ఆదేశించింది. కానీ ఇటు గుంటూరు జిల్లా మొదలు కర్నూల్ వరకు.. ఉభయ గోదావరి జిల్లాలు మొదలు ఉత్తరాంధ్ర ప్రాంతం వరకు అక్రమార్కులదే ఇష్టారాజ్యంగా మారింది. అందునా అధికార తెలుగుదేశం పార్టీ నేతలు, వారి అండదండలున్న వారికి అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది.

కలెక్టర్ రాకతో ట్రాక్టర్లు, ఇతర యంత్రాలు మాయం

కలెక్టర్ రాకతో ట్రాక్టర్లు, ఇతర యంత్రాలు మాయం

శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం దూసి గ్రామ సమీప నాగావళి నదిలో పొందూరు మండలం సింగూరు ఇసుక ర్యాంపు పేరుతో నడుస్తున్న ర్యాంపును కలెక్టర్‌ ఇటీవల ఆకస్మికంగా పరిశీలించారు. కలెక్టర్ రాక సమాచారం అందుకున్న కాంట్రాక్టర్లు దీంతో అప్పటి వరకు లోడింగ్‌ చేసే యంత్రాలు, ట్రాక్టర్లు మాయం చేసేశారు. ప్రతిరోజూ వందల లారీలకు ఇసుక తరలించే ముఠా.. అధికారుల రాకను గమనించి సమీప తోటల్లో దాక్కొంది. జిల్లా కలెక్టర్, మైన్స్‌ అధికారులు ర్యాంపు పరిశీలనకు వస్తున్నారన్న సంగతి మండల రెవెన్యూ అధికారులకే సమాచారం లేదు. ఇసుక ముఠాకు మాత్రం రెండు గంటల ముందే సమాచారం అందింది. దీంతో ఉదయం నుంచి ఇసుక లోడింగ్‌ చేసే మూడు పొక్లెయిన్‌లు, 20 ఇసుక ట్రాక్టర్లను సమీప తోటల్లో దాచిపెట్టారు.

Recommended Video

Sand Artist Sudarshan Pattnaik Giving Best Wishes To Teams | Oneindia Telugu
ధరలు పెంచేసి సొమ్ము చేసుకుంటున్న నిల్వదారులు

ధరలు పెంచేసి సొమ్ము చేసుకుంటున్న నిల్వదారులు

ఒకవైపు తూర్పు గోదావరి జిల్లా పరిధిలో గోదావరిలో వరద... మరోవైపు జిల్లాలో ఒకటి రెండు ర్యాంపులకు మాత్రమే అనుమతి... ఇంకొక వైపు భారీగా నిర్మాణాలకు శంకుస్థాపనలు జరగడంతో ఇసుకకు ఎనలేని డిమాండ్‌ ఏర్పడింది. ఇదే అక్రమ నిల్వదారులకు కాసులు పంట పండిస్తోంది. యూనిట్‌ ధర రూ.2,500ల నుంచి రూ.3 వేలు పెంచి అక్రమ నిల్వదారులు దొడ్డిదారిన ఇసుక అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం ప్రకారం ర్యాంపు బాట నిర్వహణ, కూలీలకు యూనిట్‌కు రూ.425 మాత్రమే వసూలుకు అనుమతి ఉంది. జిల్లావ్యాప్తంగా ఇసుక ర్యాంపులకు అనుమతి ఉన్నప్పుడే ఈ నిబంధన అమలు కాలేదు. ర్యాంపు ఎగుమతి, బాట నిర్వహణకు వసూలు చేయడమే కాక యూనిట్‌కు అదనంగా రూ.500 చొప్పున వసూలు చేసేవారు. గడువు పూర్తికావడంతోపాటు, వరద పోటెత్తడంతో ర్యాంపులు మూతపడ్డాయి. కడియం మండలం వేమగిరి, పి.గన్నవరం మండలంలో ఒక ర్యాంపు వద్ద తవ్వకాలు సాగాయి. దీనిని ముందే గుర్తించి ఇసుక అక్రమ వ్యాపారులు భారీగా ఇసుకను నిల్వ చేశారు. డిమాండ్‌ ఏర్పడడంతో అదను చూసి ధర పెంచి అమ్మకాలు చేస్తున్నారు. వినియోగదారులు సైతం ఎంత ధరైనా వెచ్చించి కొనుగోలు చేస్తుండడంతో అక్రమార్కులకు కాసుల వర్షం కురుస్తోంది.

విశాఖ, విజయనగరం జిల్లాలకు జోరుగా ఎగుమతి

విశాఖ, విజయనగరం జిల్లాలకు జోరుగా ఎగుమతి

జిల్లాలోనే కాక విశాఖ, విజయనగరం వంటి ప్రాంతాలకు ఎగుమతి జోరుగా సాగుతుండడం కూడా ధర పెరుగుదలకు కారణమైంది. లారీ కిరాయి కూడా పెంచేయడంతో రావులపాలెం నుంచి రెండు యూనిట్ల లారీ అమలాపురం తరలిస్తే ఇసుకకు రూ.ఆరు వేలు, కిరాయి మరో రూ.ఆరు వేల చొప్పున రూ.12 వేలు అవుతోందని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. అదే కాకినాడ వంటి ప్రాంతాలకు మరో రూ.మూడు వేలు రవాణా ఖర్చులవుతున్నాయి. ఇసుక అక్రమ వ్యాపారులు గతంలో రహస్య ప్రాంతాల్లో నిల్వలు చేసేవారు. వీటిమీద మైన్స్, రెవెన్యూ శాఖల నిఘా ఉండడంతో అక్రమార్కులు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాల సమీపంలో భారీ ఎత్తున ఇసుక నిల్వ చేస్తున్నారు.

అధికారుల సహకారం ఇలా పుష్కలం

అధికారుల సహకారం ఇలా పుష్కలం

చిత్తూరు జిల్లాలో జీవనాధారమైన స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ వ్యాపారాన్ని అరికట్టి తమకు న్యాయం చేయండంటూ న్యాయ పోరాటం చేస్తూ ఒకే గ్రామానికి చెందిన అధిక సంఖ్యలో అన్నదాతలు ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరి కొందరు అవయవాలను పొగొట్టుకుని శాశ్వత వికలాంగులుగా జీవనం సాగిస్తున్నారు.

ఈ విషాద ఘటన నుంచి తేరుకోక మునుపే ఇసుకాసురులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారం పుష్కలంగా ఉండటంతో వారికి ఎదురే లేదు. రెండేళ్లుగా వర్షం లేకున్నా స్వర్ణముఖి నదిలోని వూట బావుల సాయంతో బంగారు పంటలు పండించే ప్రాంతాలు ఇసుక అక్రమ వ్యాపార గ్రహణంతో నేడు విలవిల లాడుతున్నాయి. కొందరు నేతలు తమ పలుకబడితో బోరు బావులు, వ్యవసాయ పొలాలు, వంతెనలేమైనా లెక్క పెట్టకుండా అందినంతలోతు వరకు ఇసుకను తవ్వేస్తూ అక్రమ సంపాదనే లక్ష్యంగా సాగిస్తుండటంతో నదిలోని భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో అడుగంటాయి.

పెద్ద నుంచి చిన్నకారు రైతు వరకు వ్యవసాయ భూములన్ని బీడులుగా మార్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఏర్పేడు మండలం ముసలిపేడు సమీపంలో స్వర్ణ ముఖినదిలో ప్రభుత్వం అధికారికంగా ఇసుకరేవును గుర్తించినా అనధికారికంగా కొత్తవీరాపురం, కోబాక, వికృతమాల, చెల్లూరు, పాపానాయుడుపేట, బండారుపల్లి పరిసర ప్రాంతాల్లో ఇసుక వ్యాపారం నిత్యాకృతమవుతోంది. రోజుకు వంద ట్రాక్టర్లుకు పైగా జేసీబీ యంత్రాలతో స్వర్ణముఖినదిలో ఇసుకను తవ్వేస్తూ భారీగా నిల్వలు చేస్తున్నారు. ఒక ట్రాక్టరు ఇసుక రూ. మూడు వేలు నుంచి రూ.ఐదువేలు వరకు తిరుపతి పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గతంలో కేవలం 25 అడుగుల నుంచి 50 అడుగుల లోతులో పుష్కలంగా లభించే నీరు నేడు వందల అడుగుల్లోనైనా చుక్కనీరు రాని దుస్థితి ఏర్పడింది.

ఇతర ప్రాంతాలకు అనధికారికంగా సరఫరా

ఇతర ప్రాంతాలకు అనధికారికంగా సరఫరా

కడప జిల్లాలో ఇసుక లోడింగ్‌, రవాణాకు నిర్ణీత ధరల్ని నిర్ణయించారు. ఇంతకంటే మించి వసూలు చేసినా, ఇసుకను అక్రమంగా నిల్వ చేసినా క్రిమినల్‌ కేసులు పెట్టి జైలుకు పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నిర్ణయం అమలైతే ప్రజలకు ఇసుక అందుబాటు ధరలోకి వస్తుంది. కానీ ప్రభుత్వం ఉచిత ఇసుక పథకం ప్రవేశపెట్టినా జిల్లాలో మాత్రం రీచ్‌(రేవు)ల్లో కొందరు ఇష్టానుసారంగా అమ్మేసుకుంటున్నారు. సామాన్యులు నేరుగా వెళ్లి ఇసుక తెచ్చుకునే అవకాశం లేదు. నాయకులు, వారి అనుచరులు రీచ్‌లను కబ్జా చేశారు.

ట్రాక్టరు లోడుకు రూ.500 నుంచి రూ.800 వరకూ చెల్లించాలని కొన్నిచోట్ల అక్రమంగా వసూళ్లకు దిగారు. అధికార బలంతో రీచ్‌ల్లో ఇష్టారీతిన తవ్వకాలు చేసేసి నిత్యం వందల లోడ్లు ఇతర ప్రాంతాలకు తరలించి పెద్దఎత్తున వెనకేసుకున్నారు. అనుమతి లేని రీచ్‌ల నుంచి కూడా తవ్వకాలు చేసేసి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. కడప, రాజంపేట, జమ్మలమడుగు, రాయచోటి, చిన్నమండెం, వీరబల్లి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ పరిస్థితి ఉంది. ట్రాక్టరు ఇసుకను రూ.2500 నుంచి రూ.3500 వరకూ అమ్మారు. ప్రభుత్వ పనులకు సైతం ఇసుక కొరత ఎదురయింది. రెండేళ్ల కిందట ప్రభుత్వ పనులకు ఇసుక దొరకనప్పుడు నేరుగా కలెక్టరు కలగజేసుకుని స్థానిక తహసీల్దార్లకు గట్టిగా ఆదేశాలిచ్చి తెప్పించుకోవాల్పిన పరిస్థితి దాపురించింది.

నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా

నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా

ప్రభుత్వ పథకాలకు 1,000 క్యూబిక్‌ మీటర్ల ఇసుక అవసరమైనప్పుడు మండల స్థాయిలో ఉన్న కమిటీకి (తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎస్‌హెచ్‌వో) సంబంధిత శాఖ ఇంజినీరు దరఖాస్తు చేస్తే తేదీ, సమయం, ఎంతమేర తీసుకోవచ్చు, ఏ రీచ్‌కి వెళ్లాలో అనుమతి పత్రం ఇస్తారు. ఆయా పనుల గుత్తేదారు అక్కడకి వెళ్లి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇసుక తెచ్చుకోవచ్చు. అదే బయటివారికి ఇసుక కావాలంటే రీచ్‌కి రానుపోను ఇసుకను రవాణా చేసే వాహనాల రవాణా ఛార్జీ మొదటి 5 కి.మీ. రూ.400, తర్వాత 10 కి.మీ. వరకు రూ.600, ఆ తర్వాత 10 కి.మీ. దాటిన ప్రతి 1 కి.మీ.నకు రూ.28 వసూలు చేయాలి.

జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా సరే ట్రాక్టర్‌కు లోడింగ్‌ చేసినదానికి రూ.300 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. రానుపోను 10 కి.మీ. దూరంలో ఉన్న రీచ్‌ నుంచి ఎవరైనా ఇసుక తీసుకొచ్చి వేస్తే వినియోగదారుడు రూ.900 చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ జిల్లాలో పారిశ్రామికవేత్తలు, బడా బిల్డర్లకు ఎక్కువమొత్తంలో ఇసుక అవసరమైతే నేరుగా జల్లా గనులశాఖ ఏడీకి దరఖాస్తు చేసుకోవాల్సిందే. జిల్లా వ్యాప్తంగా ఏ రీచ్‌లోనైనా సరే ట్రాక్టరుతో తప్ప ఇతర పెద్ద వాహనాలతో రవాణా చేయడానికి వీల్లేదు. ప్రస్తుతం కడప జిల్లాలో 26 రీచ్‌ల నుంచి ఇసుక తెచ్చుకోవచ్చు.

ఇసుక ధరలను నిర్ణయించారు. ఒక యూనిట్‌ అంటే ట్రాక్టర్‌ మొత్తం ఇసుక లోడింగ్‌కు రూ.300 తీసుకోవాలి. మొదటి 5 కి.మీ. రవాణాకు రూ.400, 10 కి.మీ. వరకు 600 రూపాయలు, ఆ తర్వాత ప్రతి కి.మీ.కు రూ.28 చొప్పున తీసుకోవచ్చు.‘ ఇసుకను అనధికారికంగా అమ్మినా, నిల్వచేసినా వారిపై జీవో నెం.42 ప్రకారం క్రిమినల్‌ కేసులు పెట్టాలని నిర్ణయించాం. కొత్త నిబంధనల ప్రకారం వారికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా పడే అవకాశాలున్నాయి. ఎవరైనా అతిక్రమిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చిన వెంటనే చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటాం. ఎక్కువ వసూలు చేస్తే మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్‌ అధికారుల్లో ఎవరికైనా ఫిర్యాదు చేయవచ్చు' జిల్లా అధికార యంత్రాంగం చెబుతోంది.

English summary
Perception of the people on the government policies and programmes, including sand, liquor and the Anna Amrutha Hastham. The government is apparently in a fix over its free sand policy if the IVRS survey results presented by Chief Minister N. Chandrababu Naidu are any indication. As per the survey, 52% people are not happy with the policy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X