హెరిటేజ్ కోసం డెయిరీల ఉసురు తీసిన చంద్రబాబు- ఎలాగో చెప్పిన సీఎం జగన్
ఏపీ ప్రభుత్వం తాజాగా గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్ధతో డెయిరీ రంగం బలోపేతం కోసం ఓ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.6551 కోట్ల రూపాయల ఖర్చుతో అమూల్ సంస్ధ ఏపీలో పాల డెయిరీలను బలోపేతం చేసేందుకు అవసరమైన టెక్నాలజీ అందించడంతో పాటు మార్కెటింగ్ అవకాశాలను కూడా పెంచబోతోంది. దీనిపై ఇవాళ అసెంబ్లీలో జరిగిన చర్చలో చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ ను టార్గెట్ చేసేందుకే అమూల్‌ను తీసుకొస్తున్నారన్న ఆరోపణలపై సీఎం జగన్ స్పందించారు.
అమూల్ రైతులే యజమానులుగా కలిగిన ఓ సహకార సంస్ధగా జగన్ పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో పోటీపడటంతో పాటు ప్రపంచంలోనే 8వ స్ధానంలో అమూల్ ఉందన్నారు. 50 దేశాల్లో ప్రస్తుతం అమూల్ పనిచేస్తోందన్నారు. దేశంలోనే ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అతిపెద్ద సహకార రంగ సంస్ధగా కూడా అమూల్ ఉందన్నారు. ఆ సంస్ధలో వచ్చే లాభాలు తీసుకునేది కూడా రైతులే అని జగన్ తెలిపారు. ఏపీలో సేకరించే పాలకు కూడా అమూల్ అత్యధిక ధరలు చెల్లించడమే కాకుండా లాభాలను సైతం ఏడాదికి రెండుసార్లు రైతులకు ఇస్తుందన్నారు.

అమూల్ సంస్ధను ఏపీకి తీసుకురావడానికి దారితీసిన కారణాలపై సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడారు. చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీ కోసం ప్రభుత్వ డెయిరీలను ఎలా నాశనం చేశారన్న దానిపై జగన్ గత వివరాలను బయటపెట్టారు. రాష్ట్రంలో ఓ పద్ధతి ప్రకారం పాల రైతులకు మంచి ధర రానివ్వకుండా చేశారని, సహకార రంగాన్ని చంపేశారని జగన్ ఆరోపించారు. సహకార రంగం లేకపోవడంతో ప్రైవేటు డెయిరీలు ఒక్కటై ధర నిర్ణయించే పరిస్ధితి వచ్చిందన్నారు. గత్యంతరం లేక వారికే పాలు పోయాలని, లేదా పాడి పశువులు అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీ కోసం చేసిన కుట్ర వల్ల ఇదంతా జరిగిందన్నారు. 1974 వరకూ డెయిరీలు ప్రభుత్వ రంగంలో ఉండేవని, 81లో ఈ రంగంలో మూడంచెల సహకార వ్యవస్ధ ఏర్పడిందన్నారు. 1992లో హెరిటేజ్ స్ధాపించిన చంద్రబాబు ... 1995లో పరస్పర సహాయ సహకార సంఘాల చట్టం (మాక్స్) ను తెరపైకి తెచ్చారని, అనంతరం విశాఖ డెయిరీని 1999లో, కృష్ణా డెయిరీని 2001లో, గుంటూరు డెయిరీని 1997లో, ప్రకాశం డెయిరీని 2002లో, నెల్లూరు డెయిరీని 2002లో, కర్నూలు డెయిరీని 2002లో.. మ్యాక్స్ చట్టం పరిధిలోకి తెచ్చారని తెలిపారు. మ్యాక్స్ చట్టం నిబంధనలను ఉల్లంఘించి మరీ వీటిని దీని పరిధిలోకి తెచ్చారన్నారు.
ఆ తర్వాత కంపెనీల చట్టంలో అవకాశం లేకపోయినా విశాఖ జిల్లా సహకార సంఘాన్ని 2006లోనూ, గుంటూరు, ప్రకాశం జిల్లాల సహకార సంఘాలను 2013లో ప్రొడ్యూసర్ కంపెనీల కింద మార్చేశారన్నారు. ఇవాళ ఉభయ గోదావరి, కడప, చిత్తూరు, అనంతపురం డెయిరీలు ఏపీ సహకార సంఘాల పరిధిలో ఉంటే, కృష్ణా, నెల్లూరు, కర్నూలు డెయిరీలు మ్యాక్స్ చట్టం కింద, గుంటూరు, ప్రకాశం, విశాఖ డెయిరీలు కంపెనీల చట్టం పరిధిలో ఉన్నాయి.
అంటే ఒక పద్ధతి ప్రకారం డెయిరీలను నిర్వీర్యం చేశారని జగన్ ఆరోపించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్రకు చెందిన సంగం డెయిరీని ఎవరైనా సహకార డెయిరీ అని చెబుతారా అని జగన్ ప్రశ్నించారు.
చంద్రబాబు హయాంలో ఆయన సొంత సంస్ధ హెరిటేజ్‌తో పోటీపడుతున్న చిత్తూరు డెయిరీని మూయించేశారని జగన్ గుర్తుచేశారు. ఈ పని చేసినందుకు చంద్రబాబు సొంత మనిషి, అప్పటి చిత్తూరు డెయిరీ ఛైర్మన్‌గా ఉన్న దొరబాబును ఎమ్మెల్సీ కూడా చేశారన్నారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు హెరిటేజ్ లాభాలు, షేర్ విలువ పెరుగుతాయి. ఆయన దిగిపోతే తగ్గిపోతాయని జగన్ తెలిపారు. ఇందుకు ఉదాహరణలు కూడా చెప్పారు. 1999 నుంచి నిఫ్టీ సూచీ ప్రకారం హెరిటేజ్ షేర్ ధర చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 1999 జనవరి,1న రూ.2.89 ఉండగా, అది డిసెంబరు 12, 2003 నాటికి ఏకంగా రూ.26.90 అయింది.
ఆ తర్వాత 2009 ఎన్నికల ముందు, చంద్రబాబు అధికారంలో లేనప్పుడు ఏప్రిల్ 9. 2009 నాటికి షేర్ ధర రూ.16.35కు పడిపోయింది.
మళ్లీ సైకిల్ కాంగ్రెస్ ప్రభుత్వం (కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు) సమయంలో రూ.35 నుంచి రూ.100కు పెరిగిందన్నారు.
2014లో మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాక రికార్డు స్థాయిలో రూ.100 షేర్ 2017 డిసెంబరు నాటికి రికార్డు స్థాయిలో రూ.827కు పెరిగిందన్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు షేర్ విలువ ఆ స్థాయిలో పెరిగితే ఏమనాలి? అధికారం దిగిపోయిన తర్వాత 2020 మార్చి నాటికి హెరిటేజ్ షేర్ ధర మళ్లీ రూ.205కు తగ్గిందని గుర్తుచేశారు.