TDP: ఇంతకీ.. నందమూరి తారక రామారావు ఏ పార్టీయో??
స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులుగా అందరికీ తెలిసిందే. మే 28వ తేదీ ఆయన జయంతి. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్వద్ద ఆయన కుటుంబ సభ్యులతోపాటు తెలుగుదేశం పార్టీ నేతలంతా ఘనంగా నివాళులర్పిస్తారు. మహానాడు కూడా ఆయన జయంతిరోజే జరుగుతుంది. కాలానుగుణంగా రాజకీయాలు మారుతున్నాయి. ప్రజాదరణ ఉన్న నేతను తమవాడుగా చెప్పుకోవడానికి, నాలుగు ఓట్లు రాబట్టుకోవడానికి రాజకీయ పార్టీలన్నీ విన్యాసాలు చేస్తున్నాయి.

వైసీపీ పోస్టర్లలో ఎన్టీఆర్
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్టీఆర్ను తమవాడిగా చెపుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్ వెలిశారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీతోపాటు వైసీపీ నేతలు కూడా పోటీపోటీగా ఎన్టీ ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. పోస్టర్లు ముద్రించారు. అన్నదానం చేశారు. దీనివెనక ఒక రాజకీయ వ్యూహం దాగివుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎన్టీఆర్ అభిమానులు అన్ని పార్టీల్లోను ఉన్నారు. అయితే ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడంతోపాటు తమ నేతగా చెప్పుకుంటుండటంతో తమ పార్టీవైపు మొగ్గుచూపుతారనే వ్యూహం దాగివుందంటున్నారు. మరి ఈసారి ఎన్నికలకు ఆ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో వేచిచూడాలి మరి..!!

తెలంగాణలో అన్ని పార్టీలు తమవాడే అంటున్నాయి!!
తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి నేతల్లో సగం మంది ముఖ్యమంత్రితో సహా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినవారే. రాష్ట్ర విభజన ఉద్యమ సమయంలో ఆయన పేరు కూడా తలవని టీఆర్ ఎస్ నేతలు తెలంగాణ వ్యాప్తంగా ఎన్టీఆర్ తమవాడే అంటున్నారు. తెలంగాణలో తెలుగుదేశం బలహీనంగా ఉండటంతో ఆయన అభిమానులను తమ ఓటర్లుగా మలచుకునే టీఆర్ ఎస్ వ్యూహమని భావిస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో ఆయనకు నివాళులర్పించారు. మరికొన్ని ప్రాంతాల్లో అన్నదానాలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దే కాదు కొత్తగా ఎన్టీఆర్ విగ్రహాలను కూడా ఆవిష్కరించి పూలమాలలు వేశారు. వీరిలో ఒక్క టీఆర్ ఎస్ వారే కాదు.. కాంగ్రెస్ పార్టీ నేతలున్నారు.. భారతీయ జనతాపార్టీ నేతలున్నారు. ఏపీలోని భారతీయ జనతాపార్టీ నేతలు కూడా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. మరికొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న కార్యక్రమాలు నిర్వహించారు.

ఎన్టీఆర్ అందరివాడంటున్న టీడీపీ
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోషల్ మీడియా ద్వారా ఆయన జన్మదిన వేడుకలను గుర్తుచేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్టీఆర్ అందరివాడు అని చెబుతోంది. ఎన్టీఆర్ ను అభిమానించేవారు అన్ని పార్టీల్లోను ఉండేవారు. కానీ ఆయన తెలుగుదేశం వ్యక్తి కావడంతో తమ అభిమానాన్ని పైకి చూపించలేకపోయారు. ఆ మొహమాటాలు ఇప్పుడు అందరూ పక్కన పెడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, టీఆర్ ఎస్తోపాటు చిన్న చిన్న పార్టీలు కూడా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా, వర్థంతి సందర్భంగా గుర్తుచేసుకోవడమే కాకుండా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. మొత్తానికి ఎన్టీఆర్ ఇప్పడు అందరిపార్టీలవారయ్యారు. ఇక ఏ పార్టీకి ఎన్టీ ఆర్ తరఫున ఎక్కువ ఓట్లు పడతాయో ఆయనకే తెలియాలి..!!