నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి ఫిట్స్: అస్వస్థత, హైదరాబాద్‌కు తరలింపు
హైదరాబాద్: నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి రక్తపోటు అధికం కావడంతో ఆయనకు ఫిట్స్ వచ్చాయి. దీంతో ఆయన అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో వెంటనే ఆయన్ని స్థానిక సురక్ష ఎమర్జెన్సీ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు.
అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఇటీవలే కోలుకుని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవలే కర్నూలు జిల్లాలోని గడివేముల మండలం ఉండుట్ల గ్రామంలో 30 ఏళ్ల తర్వాత బుధవారం జరిగిన జాతరలో కూడా పాల్గొన్నారు.

జాతర అనంతరం ఇంటికి చేరుకున్నారు. అయితే ఎండలో ఎక్కవసేపు ఉండటంతో రక్తపోటు అధికమై అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు న్యూరాలజిస్ట్ వరదరాజు, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ హరినాథరెడ్డి వెళ్లి ఆయనకు చికిత్స చేశారు.
అయితే ఈ సమయంలో ఆయనకు ఫిట్స్ వచ్చి శ్వాస తీసుకోవడం కాస్త ఇబ్బందిగా మారడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో రాత్రి 7.30 గంటల సమయంలో నంద్యాలలోని సురక్ష ఎమర్జెన్సీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత హుటాహుటిన అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.