సాహోకు ,ప్రభాస్ కు వ్యతిరేకంగా టీడీపీ ప్రచారం వార్తలపై లోకేష్ ఫైర్ ..మీకు మనస్సాక్షి లేదా అని ప్రశ్న
సాహో పై, అలాగే ప్రభాస్ పై టిడిపి శ్రేణులు నెగిటివ్ ప్రచారం చేస్తున్న వార్తల్లో వాస్తవం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు ఊహించుకొని కథనాలు రాస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ ప్రభాస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది అన్న వార్తలు తప్పు అని ఆయన పేర్కొన్నారు.

జగన్ కు అనుకూలంగా మాట్లాడారని ప్రభాస్ ను టీడీపీ టార్గెట్ చేసిందని ప్రచారం
ఇటీవల ప్రభాస్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి జగన్ పైన ఆయన వ్యాఖ్యలు చేశారు. జగన్ యువకుడని, ఆయన పాలనను మెచ్చుకున్నారు ప్రభాస్. ఇక ఏపీలో సీఎం అయిన జగన్ మంచి పాలన అందిస్తారని తాను ఆశిస్తున్నట్లు గా వ్యాఖ్యానించారు. తనకు రాజకీయాలు పెద్దగా తెలియవని చెప్పిన ప్రభాస్ ఏపీ ఎంతో సుందరమైన ప్రదేశం అంటూ పేర్కొన్నారు.
ఇక జగన్ కు అనుకూలంగా ప్రభాస్ మాట్లాడడంతో టిడిపి అభిమానుల్లో కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ప్రభాస్ ను టార్గెట్ చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇదంతా కేవలం ఓ మీడియా కావాలని చేస్తున్న ప్రచారమని నారా లోకేష్ మండిపడ్డారు.

టిడిపి ప్రభాస్ కు వ్యతిరేకంగా, సాహో సినిమా కి వ్యతిరేకంగా ప్రచారం వార్తలను ఖండించినలోకేష్
టిడిపి ప్రభాస్ కు వ్యతిరేకంగా, సాహో సినిమా కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ అబద్ధాలు రాసిన కుహనా జర్నలిస్టు సిగ్గుపడాలని పేర్కొన్నారు నారా లోకేష్.కుల విభజన, విద్వేష వ్యాప్తితో సంపాదించిన సొమ్ముతో తిండి ఎలా తింటున్నారు? అంటూ లోకేష్ నిప్పులు చెరిగారు. మీకు మనస్సాక్షి అనేదే లేదా? అంటూ నిలదీశారు.ఇక అంతే కాదు ప్రభాస్ పైన తనకున్న అభిమానాన్ని తెలియజేశారు నారా లోకేష్.

ప్రభాస్ ఫ్యాన్స్ లాగా నేను సాహో కోసం ఎదురు చూస్తున్నా .. బ్లాక్ బ్లస్టర్ అవ్వాలని కోరుతున్నా అన్న లోకేష్
ఇదే విషయాన్ని ట్వీట్ చేసిన లోకేష్ "అయినా సాహో ఓ భారీ బడ్జెట్ చిత్రం. ఈ అద్భుతమైన సినిమాను చూడ్డానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ లాగా నేను కూడా ఉవ్విళ్లూరుతున్నాను. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అంటూ ప్రభాస్ పట్ల తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని తేల్చి చెప్పేశారు. సాహో చిత్రాన్ని ప్రభాస్ ఫ్యాన్సే కాదు, టీడీపీ మద్దతుదారులు కూడా వీక్షించి ఆ పనికిమాలిన కథనాన్ని విసిరికొట్టండి" అంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్.
ఏదేమైనా టిడిపి శ్రేణులు జగన్ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ పై గరంగరం గానే ఉన్నారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ పోస్టుతో టిడిపి శ్రేణులకు ఒక స్పష్టమైన సంకేతాన్ని లోకేష్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ప్రభాస్ పైన తమకెలాంటి వ్యతిరేకత లేదనే విషయాన్ని ఆయన సోషల్ మీడియా ముఖంగా చెప్పి ఇక ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.