మీరు రాష్ట్రానికి సీఎం ఎలాగో .. గ్రామానికి సర్పంచ్ అంతే; సీఎం జగన్ కు లోకేష్ మరో బహిరంగ లేఖ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో లేఖ రాశారు. ఇటీవల ఉభయ గోదావరి జిల్లాలలో వరద ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితిని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎం జగన్ కు లేఖ రాసిన నారా లోకేష్ మరోమారు సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. అయితే ఈసారి గ్రామ పంచాయతీల నిధులు దారి మళ్లుతున్నాయి అంటూ లేఖ ద్వారా ప్రభుత్వ తీరును ఆక్షేపించి గ్రామ పంచాయతీల నుండి మళ్లించిన నిధులు 1309 కోట్లు తక్షణమే పంచాయితీ ఖాతాలలో జమ చేయాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు.

ఇప్పుడు జగన్ నిధుల మీద పడ్డారన్న లోకేష్
ఇక నారా లోకేష్ పై సీఎం జగన్ కు రాసిన లేఖలో మీరు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మూడింటిపై ఆధారపడి పాలన సాగిస్తున్నారని ధ్వజ మెత్తారు. అప్పులు తేవడం, ఆస్తులను అమ్మేయడం, కనిపించిన చోటునల్లా తాకట్టు పెట్టడం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు నిధుల మళ్లింపు మీద పడ్డారన్న లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా 12,918 పంచాయతీల నుంచి మీ రెండున్నర ఏళ్ల పాలనలో 1309 కోట్ల రూపాయలకు పైగా నిధులు మళ్లించడంతో కనీసం పంచాయతీలు పారిశుద్ధ్య పనులు నిర్వహించడానికి కూడా రూపాయికి లేని దుస్థితిలో ఉన్నాయి అని లోకేష్ పేర్కొన్నారు.

ఆ నిధులు మళ్ళించటం రాజ్యాంగ విరుద్ధం
గ్రామాలలో రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు, శానిటేషన్, లైటింగ్ కోసం గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 14, 15 వ ఆర్థిక సంఘం ద్వారా కేటాయించిన నిధులను దారి దోపిడీ దారుల్లా దోచుకుపోవడం దారుణమని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మోసానికి గ్రామ పంచాయితీలు నిర్వీర్యమై పోయాయని మండిపడిన లోకేష్ పల్లెల్లో పారిశుద్ధ్య పరిస్థితి పూర్తిగా దిగజారిందని. పల్లె ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు నేరుగా ఇచ్చిన 1309 కోట్లను పంచాయతీ ఖాతాల నుండి మళ్ళించడం రాజ్యాంగ విరుద్ధమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పంచాయతీ ఖాతాల నుండి నిధుల మళ్లింపు మోసమే
సర్పంచ్, వార్డు సభ్యులకు తెలియకుండా, పంచాయితీ బోర్డ్ తీర్మానం లేకుండా ఆయా పంచాయతీ ఖాతాల నుంచి నిధులు మళ్లించడం స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రభుత్వ మోసం చేయడం కిందకే వస్తుందని పేర్కొన్నారు. ముందు రోజు పంచాయతీల ఖాతాలో ఉన్న సొమ్ము తెల్లారేసరికి మాయమై జీరో బ్యాలెన్స్ చూపడం అంటే సర్పంచులు, పంచాయితీ పాలకవర్గాలను వంచించటం అని లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సుమారు 4 నెలల క్రితం 14వ ఆర్థిక సంఘం నిధులు 344 కోట్ల రూపాయలను విద్యుత్ బకాయిల కింద జమ వేసుకున్నామని ప్రస్తుతం ఆర్థిక మంత్రి ప్రకటించటం బాధ్యతారాహిత్యం అని మండిపడ్డారు.

పాత విద్యుత్ బకాయిల పేరుతో తీసుకోవడం సర్కారు గూండాగిరి
1984వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఎటువంటి ఆదాయం లేని మైనర్ పంచాయతీలకు వీధి దీపాలకు ఉచిత విద్యుత్ ను అందించగా, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి దీనిని కొనసాగించారని, దశాబ్దాలుగా ఉచిత విద్యుత్ ప్రయోజనం అందుకుంటున్న పంచాయతీల నుండి పంచాయితీ కార్యవర్గాలకు తెలియకుండా 344 కోట్ల రూపాయలు పాత విద్యుత్ బకాయిల పేరుతో తీసుకోవడం సర్కారు గూండాగిరి కిందకే వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మళ్ళించటానికి వీల్లేని ఆర్ధిక సంఘం నిధులు కూడా వాడేశారు
మళ్లించడానికి వీలు లేని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులని వాడేశారు అంటే పూర్తిగా బరితెగించేశారని అర్థమవుతుందని లోకేష్ ద్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థ అయిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ కి జెన్కో, ట్రాన్స్ కో బాకీ పడిన రుణం తీర్చి మళ్లీ కొత్త అప్పు కోట్ల రూపాయలు కేంద్ర ఇంధన శాఖ నుండి తెచ్చేందుకు నిబంధనలు తుంగలో తొక్కి పంచాయతీలకు నిధులు తరలించుకు పోవడంపై మీరు సమాధానం ఇవ్వాలని లోకేష్ స్పష్టం చేశారు.

మీరు రాష్ట్రానికి సీఎం ఎలాగో .. గ్రామానికి సర్పంచ్ అంతే
గ్రామ పంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంటు, మైనింగ్ సెస్, వృత్తి పన్ను, తలసరి గ్రాంటు, నీటి తీరువా పన్ను, మైనింగ్ పై వచ్చే ఆదాయాలు వేలకోట్లు ఎగవేసి ఇప్పుడు కేంద్రం ఇచ్చిన నిధులు కూడా వాడేయడం చాలా దుర్మార్గమైన చర్య అని లోకేష్ అభిప్రాయపడ్డారు. మీరు రాష్ట్రానికి ఎలా ముఖ్యమంత్రో .... గ్రామానికి సర్పంచ్ కూడా అంతే అని పేర్కొన్న లోకేష్ అటువంటి సర్పంచులను మోసం చేసి, ఆట బొమ్మలను చేసి, పంచాయితీల నిధులు దారి దోపిడీ దొంగల మాదిరిగా ప్రభుత్వమే మాయం చేయడం చాలా అన్యాయం అంటూ లోకేష్ విమర్శించారు.

పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలు మానుకోవాలి
గ్రామ పంచాయతీల నుంచి మళ్లించిన నిధులను తక్షణమే పంచాయతీల ఖాతాలలో జమ చేయాలంటూ డిమాండ్ చేశారు. పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసే రాజ్యాంగేతర చర్యలు మానుకోవాలని హితవు పలికారు. రాజకీయ ఆధిపత్యం కోసం ప్రకటించిన ఏకగ్రీవ పారితోషకం గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు . పల్లెల్లో దిగజారిన పరిస్థితులు చక్కదిద్దడం కోసం మళ్లించిన నిధులు, ఎగ్గొట్టిన బకాయిలు ప్రభుత్వం విడుదల చేయాలని లోకేష్ తెలిపారు.