మాట మార్చుడు.. మడమ తిప్పుడుకి సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్: నారా లోకేష్
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు తెలుగుదేశం పార్టీ నేతలకు ఆయుధంగా మారుతున్నాయి. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాడు ఉద్యోగుల ఓట్ల కోసం అడ్డగోలు హామీ ఇచ్చారని, నేడు ఆ హామీలు నిలబెట్టుకోకుండా మాట తప్పారని మండిపడుతున్నారు.
అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానన్న జగన్ .. లోకేష్ ఫైర్
జగన్మోహన్ రెడ్డి ఏపీలో రెండున్నరేళ్ల క్రితం అధికారంలోకి రావడానికి ఉద్యోగులకు పలు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని నెరవేర్చాలని ఉద్యోగులు జగన్మోహన్రెడ్డిని కోరగా అధ్యయనానికి కమిటీలను వేశారు . జగన్ వేసిన కమిటీలు పీఆర్సీ పై, సిపిఎస్ రద్దుపై ఎటూ తేల్చకపోవడంతో ఉద్యోగులు పోరుబాట పట్టారు. ఈ క్రమంలో తాజాగా జగన్ ను టార్గెట్ చేసిన నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు. నాడు ఉద్యోగుల ఓట్ల కోసం సి పి ఎస్ రద్దు గురించి అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో రద్దు చేస్తానని జగన్ ఇచ్చిన హామీ వీడియోను పోస్ట్ చేసి, నేడు సిపిఎస్ రద్దు పై సజ్జల రామకృష్ణారెడ్డి నాడు జగన్ అవగాహన లేక సిపిఎస్ హామీ ఇచ్చారని మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసి, మాట తప్పటం, మడమ తిప్పటం జగన్ కు అలవాటు అని వ్యాఖ్యానించారు.

ఉద్యోగుల ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిన జగన్ దారుణ మోసం
నాడు ఉద్యోగుల ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చారు జగన్. నేడు మాట మార్చుడు, మడమ తిప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు వైయస్ జగన్ అంటూ పేర్కొన్న నారా లోకేష్ వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్న మాటకి రెండున్నరేళ్ళు అయినా దిక్కు లేదు .. పైగా జగన్ కు అవగాహన లేకే సిపిఎస్ రద్దు చేస్తామనే హామీ ఇచ్చారంటూ స్వయంగా సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడం ఉద్యోగులని దారుణంగా మోసగించడమే అని వ్యాఖ్యానించారు.

జగన్ రెడ్డి ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి
నెరవేర్చని హామీలిచ్చివంచించిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఉద్యోగులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు న్యాయమైన డిమాండ్ల సాధనకు ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని వెల్లడించారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలన్న బాధ్యత ప్రభుత్వానిదే అని నారా లోకేష్ పేర్కొన్నారు . ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తెలిపారు.

ఉద్యోగ సంఘాలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్న సజ్జల
ఇదిలా ఉంటే ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కలిశారు. సిఎస్ నివేదికపై తమ అభిప్రాయాలు చెప్పిన సంఘాలకు ఉద్యోగుల విషయంలో జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని సీఎం వారితో సమావేశమై సానుకూలంగా స్పందిస్తారని, పరిస్థితిని అర్థం చేసుకొని అందరూ సహకరించాలని సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ రెండేళ్లలో కోవిడ్ కారణంగా 22 వేల కోట్ల మేర ఆదాయం తగ్గిందని, కోవిడ్ నియంత్రణ, నివారణ కోసం 8 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని మొత్తంగా 30 వేల కోట్ల రూపాయల భారం పడినా ఆరంభం నుండే ఐఆర్ అమలు చేశామని సజ్జల వెల్లడించారు.

సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారన్న సజ్జల ... కమిటీల సిఫార్సులపై ఉద్యోగుల అసంతృప్తి
ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకోవాలని త్వరలో సీఎం ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యి వారి సమస్యలపై సానుకూలంగా స్పందిస్తారని చెప్పారు. అయితే మెజారిటీ ఉద్యోగులు అధికారుల కమిటీల సిఫార్సులను ఆశించిన రీతిలో లేవని అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం. మరి ఈ వ్యవహారాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా డీల్ చేస్తారనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఉద్యోగుల ఆందోళన తెలుగుదేశం పార్టీకి అస్త్రంగా మారింది.