• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆ రంగానికే కేంద్రం ప్రాధాన్యం...అందులో ఎదగండి:ఎపికి వెంకయ్యనాయుడి సలహా

|

విశాఖపట్టణం: సరుకుల ఉత్పత్తి రంగానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, కాబట్టి ఆ రంగంలో రాష్ట్రం నంబర్ వన్ స్థానానికి ఎదగాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. విశాఖపట్టణంలో జరుగుతున్నకాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సిఐఐ) సదస్సులో పాల్గొన్న వెంకయ్యనాయుడు ఎపికి ఈ సలహా ఇచ్చారు.

విశాఖలో శనివారం కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సిఐఐ) సదస్సు శనివారం అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు 54 దేశాల నుంచి 2,500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సరుకుల ఉత్పత్తి పెరిగితే పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని, అభివృద్ధికి మంచి అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ రంగంలో కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.

ప్రధాని మోడీపై...వెంకయ్యనాయుడు ప్రశంసలు...

ప్రధాని మోడీపై...వెంకయ్యనాయుడు ప్రశంసలు...

నరేంద్రమోడీ ప్రధాని బాధ్యతలు చేపట్టాక ఆయన చేసిన అతిపెద్ద ఆర్థిక సంస్కరణ నోట్లరద్దని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు చెప్పారు. నల్లధనాన్ని బ్యాంకులకు చేర్చడమే దీని వెనుక ముఖ్య ఉద్దేశ్యమని, ఆ మేరకు ఆశించిన విధంగానే లక్ష్యాన్ని చేరుకోగలిగినట్లు చెప్పుకొచ్చారు. నోట్ల రద్దు కారణంగానే ప్రస్తుతం దేశమంతటా బ్యాంకులు వడ్డీరేట్లు గణనీయంగా 8.2 శాతానికి తగ్గించాయని వెంకయ్యనాయుడు తెలిపారు. అలాగే అన్ని పార్టీల అంగీకారంతోనే జిఎస్‌టి అమలులోకి వచ్చిందని తెలిపారు. ప్రధాని మోడీ సంస్కరణల కారణంగానే ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్నఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ దూసుకు పోతోందని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం కారణంగా అత్యల్ప వృద్ధిరేటు 3.2శాతం ఉండగా మన దేశంలో మాత్రం 2017లో 7.2 శాతం ఉండగా, 2018 సంవత్సరంలో 7.7 శాతం వృద్ధిరేటును సాధించిందని వెంకయ్యనాయుడు చెప్పారు.

ప్రపంచంలోనే...అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే...

ప్రపంచంలోనే...అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే...

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గ్లోబల్‌ మార్కెట్‌లో ముందుందని ఐఎంఎఫ్‌ తాజా నివేదిక తెలుపుతోందని వెంకయ్య నాయుడు గుర్తుచేశారు. అలాగే భారతదేశంలోని గుజరాత్‌, కర్నాటక, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడుదారుల సదస్సులకు పోటీపడుతున్నాయన్నారు. పారిశ్రామిక రంగంలో చక్కటి అవకాశాలకు ఆంధ్రప్రదేశ్‌ వేదికగా మారుతోందని చెప్పారు.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో...మనమే నంబర్ వన్:చంద్రబాబు

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో...మనమే నంబర్ వన్:చంద్రబాబు

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సిఐఐ సదస్సులో చెప్పారు. విశాఖలో మూడోసారి సిఐఐ ఒప్పంద భాగస్వామ్య సదస్సులు నిర్వహించుకోవడం సంతోషదాయకమన్నారు. ప్రతి ఏడాదీ భాగస్వామ్య సదస్సు విశాఖలోనే నిర్వహించాలని నిర్ణయించడంతో ఇన్వెస్టర్లంతా ఎంతో ఉత్సాహంతో ఇక్కడకు వస్తున్నారని సిఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫుడ్‌ప్రోసెసింగ్‌, టూరిజం, ఏరోస్పేస్‌, టెక్స్‌టైల్స్‌, రెన్యువబుల్‌ ఎనర్జీ, మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ తదితర రంగాల్లో ఈ సదస్సుల్లో ఎంఒయులు చేసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

మళ్లీ విద్యుత్‌ సంస్కరణలు...రేట్లు పెంచను

మళ్లీ విద్యుత్‌ సంస్కరణలు...రేట్లు పెంచను

1998లో తాను విద్యుత్‌ సంస్కరణలను చేపట్టానని, మళ్లీ రెండో విడతకు శ్రీకారం చుట్టానని సిఎం చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. అయితే ఈసారి విద్యుత్‌ ధరలు పెంచనని మీ అందరికీ మాట ఇస్తున్నానంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. విద్యుత్‌ ధరలు ఇంకా తగ్గించేందుకే ప్రయత్నిస్తానని చెప్పారు. ఒక్క ఫోన్‌ కాల్‌తో 21 రోజుల్లో పరిశ్రమలకు అన్నిఅనుమతులు ఇచ్చేస్తానన్నారు. రాష్ట్రంలో వ్యవసాయరంగంలో అద్భుత ఫలితాలు సాధించామని నేడు పరిశ్రమలు, సేవలరంగంపై దృష్టి సారించామని చెప్పారు.

జాతీయ పారిశ్రామిక విధానం సదస్సు...ఫెయిలా?

జాతీయ పారిశ్రామిక విధానం సదస్సు...ఫెయిలా?

నేషనల్‌ ఇండిస్టియల్‌ ప్రమోషన్‌ పాలసీపై ఒక విధాన పత్రం రూపొందించేందుకు సిఐఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సదస్సు కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ముగియడం ఆశ్చర్యపరిచింది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఎంతో ఆశతో ఈ సదస్సు గురించి ఎదురుచూడగా అరగంటలోపే ఎలాంటి జాతీయ పారిశ్రామిక విధాన పత్రాన్ని తయారు చేయకుండానే ఈ సదస్సు ముగిసిపోయింది. తొలుత కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్‌ప్రభు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ఇన్వెస్టర్లు, పారిశ్రామిక ఔత్సాహిక వేత్తలు, సిఐఐ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. అయితే ఆయన దీనికి గైర్హాజరు కావడంతో ఆయన స్థానంలో రాష్ట్ర మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఆంగ్లంలో ఒక ఉపన్యాస ప్రతిని చదివేసి ఆయన వెంటనే వెళ్లిపోవడంతో వేదిక మొత్తం ఖాళీ అయింది. దీంతో స్టేజీ మీద ముఖ్యులెవరూ మిగలలేదు. అనంతరం సిఐఐ మాజీ రాష్ట్ర అధ్యక్షులు జి.శివ్‌కుమార్‌ మాట్లాడుతూ, ప్రపంచంలో అమెరికా, ఆస్ట్రేలియా, సౌదీ తదిదర దేశాల్లో పరిశ్రమలకు, ఉపాధి అవకాశాలకు రక్షణ ఉంటుందని, నైపుణ్యంగల మానవ వనరులను సమకూర్చుతారని, మన దగ్గర ఈ పరిస్థితులు లేవన్నారు. ఈయన ప్రసంగం అనంతరం ఈ సదస్సు అనుకున్న సమయానికంటే చాలా ముందుగా అర్ధాంతరంగా ముగిసిపోవడంతో దీనికి హాజరైన పరిశ్రమలు, సంస్థలకు చెందిన ఔత్సాహికుల్లో ఉత్సాహం పూర్తిగా నీరుగారి పోయింది.

English summary
Visakhapatnam: India is poised to become one of the most vibrant economies of the world and Andhra Pradesh in particular will play a key role in the country's growth story, Vice-President M Venkaiah Naidu has said.He was speaking here on Saturday afternoon after inaugurating the annual three-day partnership summit of the Confederation of Indian Industry (CII).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X