ప్రధాని మోడీపై జగన్ ట్వీట్:అదే ట్వీటంటూ నెటిజన్ల స్పందన!
అమరావతి:పార్లమెంటు సమావేశాలు సక్రమంగా జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఒక్క రోజు నిరాహారదీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్ష పై వైసీపీ అధినేత జగన్ స్పందించి ప్రధాని మోడీ నుద్దేశించి ఒక ట్వీట్ చేశారు.
అయితే జగన్ చేసిన ట్వీట్ అలా ట్రెండింగ్ అయిుందో లేదో వెంటనే నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. జగన్ చేసిన ట్వీట్ నుద్దేశించి రకరకాల వ్యాఖ్యనాలు చేశారు. ఇంతకీ ప్రధాని మోడీ నుద్దేశించి జగన్ ఏమని ట్వీట్ చేశారంటే..."నరేంద్ర మోడీగారు...మీరు ఈ రోజు నిరాహార దీక్ష చేపట్టారు...ఏపీకి ప్రత్యేక హోదా రాని కారణంగా...6 రోజుల పాటు నిరాహారదీక్ష చేపట్టిన ఐదుగురు ఏపీ ఎంపీలు ఆసుపత్రిలో ఉన్నారు...ఐదు కోట్ల ఆంధ్రుల గొంతుకలను దయచేసి వినండి... పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చండి"...అంటూ జగన్ ట్వీట్ చేశారు.

అయితే జగన్ చేసిన ఈ ట్వీట్ ను పోస్ట్ చేస్తూ ఇది మోడీకి జగన్ భయపడుతూ చేసిన ట్వీట్ లాగా ఉందని, మీరు ఒకరోజు దీక్షే చేశారు...మావాళ్లు 6 రోజులు దీక్ష చేశారు మా పరిస్థితి చూడండని చెప్పటానికి కూడా జగన్ వణికిపోతున్నట్లుగా ఉందని కొందరు నెటిజన్లు ఎద్దేవా చేశారు. అందుకు స్పందించిన మరికొందరు
అంత భయపడుతూ ట్వీట్ చెయ్యకపోతే ఏమని...ఇప్పుడు మోడీ దీక్షపై ట్వీట్ చెయ్యమని జగన్ ను ఎవరడిగారని...ట్వీట్ చేస్తే ఉపయోగకరంగా ఉండాలని...కానీ జగన్ ట్వీట్ అతనికి...వారి పార్టీకి మరింత నష్టం చేసే విధంగా ఉందని విశ్లేషిస్తున్నారు.
అదెలాగంటే...ప్రధాని మోడీకి అంటే జగన్ కు వణుకు అని, ఆ పార్టీతో లాలూచీ రాజకీయాలు చేస్తోందని ఇప్పటికే ఎపిలో అధికార పార్టీ టిడిపి తీవ్రంగా విమర్శలతో దాడి చేస్తోందని జగన్, విజయసాయి రెడ్డి, చివరకు విజయమ్మ వ్యాఖ్యలు చూస్తే అదే నిజమనేలా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకించి తాజాగా ప్రధాని మోడీకి జగన్ చేసిన విజ్ఞప్తిలో ఏమత్రం ఔచిత్యం లేదంటున్నారు. జగన్ ఎవరినీ సంప్రదించకుండా ఇలా ఏకపక్షంగా ఒకే కోణంలో ఆలోచించి ట్వీట్లు చేస్తే టిడిపి ఆరోపణలే నిజమనే పరిస్థితి రావడం ఖాయమని మరికొందరు నెటిజన్ మేథావులు విశ్లేషిస్తున్నారు.