
2024లో ఏపీ కాంగ్రెస్ పొత్తులపై తేల్చేసిన కొత్త పీసీసీ ఛీఫ్-రేపు ఏఐసీసీ ఛీఫ్ ఖర్గేతో భేటీ !
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు క్రమంగా ఏకమవుతున్న వేళ కొత్త పీసీసీ ఛీఫ్ గా బాధ్యతలు చేపట్టిన గిడుగు రుద్రరాజు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. ఇవాళ అక్కడే మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ పొత్తులతో పాటు పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాలు స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఏపీలో పొత్తులపై గిడుగు రుద్రరాజు స్పందించారు. 2024 ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ మరే ఇతర పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు గిడుగు స్పష్టం చేశారు. విపక్షాలను ఏకం చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విడిగానే పోటీ చేస్తుందని గిడుగు సంకేతాలు ఇచ్చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంటుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. చంద్రబాబు, జగన్ పాలన చూసిన ప్రజలు కాంగ్రెస్ పార్టీనే తమకు మేలు చేస్తుందని నమ్ముతున్నారని గిడుగు చెప్పుకొచ్చారు.

మరోవైపు ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు గిడుగు రుద్రరాజు రేపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ఏపీసీసీకి చెందిన పలువురు కీలక నేతలు కూడా పాల్గొంటున్నారు. ఈ భేటీలో కాంగ్రెస్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్టానానికి గిడుగు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తాను కార్యకర్తలా పనిచేస్తానని గిడుగు వెల్లడించారు.