వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సామాన్యుడికీ విమానయానం: గం.కు కేవలం రూ.2500!‘విమానయానంలో ఏపీ టాప్’

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పౌర విమాన యాన రంగాన్ని అభివృద్ధికి ఊతాన్నిచ్చే కొత్త ఏవియేషన్ పాలసీని కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. దేశంలో అతిపెద్ద రంగంలో ప్రణాళికాబద్ధ విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇప్పటివరకూ వైమానిక అనుసంధానత లేని విమానాశ్రయాల నుంచి గంట దూరం ప్రయాణానికి గరిష్ఠ టికెట్‌ ధరను రూ.2500గా నిర్ణయించడం ఇందులో అత్యంత ప్రధాన అంశం.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు విమానాలు నడవని చోట్లకు ఆ సేవల్ని ప్రవేశపెట్టేవారికి పన్ను రాయితీలు కల్పిస్తారు. ప్రాంతీయ అనుసంధానతకు కొత్త విధానం పెద్దపీట వేస్తుంది. ప్రాంతీయ అనుసంధాన నిధికి విమానయాన సంస్థలు అదనపు లెవీ చెల్లించాల్సి ఉంటుంది.

ashok

విదేశాలకు విమానాలు నడపాలంటే విమానయాన సంస్థలకు ఐదేళ్ల అనుభవం, కనీసం 20విమానాలు ఉండాలనే వివాదాస్పదమైన (5/20) నిబంధనను రద్దు చేశారు. 20విమానాలు, లేదా మొత్తం విమానాల్లో 20 శాతాన్ని దేశీయ కార్యకలాపాలకు వినియోగించే ఏ విమానయాన సంస్థలైనా విదేశాలకు విమానాలు నడుపుకోవచ్చు.

అలాగే నిపుణుల సేవల్ని మరికొంత కాలం ఉపయోగించుకునే లక్ష్యంతో సిజిహెచ్ వైద్యుల పదవీ కాలాన్ని 62నుంచి 65 సంవత్సరాలకు పెంచడంతో పాటు పలు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.
కొత్త విధానంలో భాగంగా కొత్త విమానాశ్రయాలను నిర్మించడంతో పాటు హెలికాప్టర్ల కోసం కొత్త నిబంధనలనూ అమలులోకి తీసుకొస్తారు. ప్రాంతీయంగా అన్ని ప్రాంతాలకూ విమాన సౌకర్యాలను విస్తరించాలన్న నిర్ణయాన్ని సెప్టెంబర్ లోగా అమలుచేసే అవకాశం ఉంది.

అన్ని వర్గాల ప్రజలకు విమానయానాన్ని అందుబాటులోకి తేవడమే ఈ కొత్త విధాన లక్ష్యమని పౌర విమానయాన కార్యదర్శి ఆర్ ఎన్ చౌబే తెలిపారు. స్థానిక కనెక్టివిటీ నిధి కింద ప్రయాణికులపై విధించే లెవీ మొత్తం అతి స్వల్పంగానే ఉంటుందని అన్నారు. ఐదు సంవత్సరాల అనుభవం 20 విమానాలు కలిగిన సంస్థలు మాత్రమే విదేశీ సర్వీసులు నిర్వహించాలన్న నిబంధనను యూపీఏ తీసుకొచ్చిందని, అందుకే దాన్ని రద్దు చేశామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

విమానయాన రంగంలో మార్పులు: అశోక్ గజపతి రాజు

నూతన విధానం వల్ల విమానయాన రంగం సమూలంగా మారిపోతుందని కేబినెట్‌ సమావేశానంతరం పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు ట్వీట్‌ చేశారు. 2022 నాటికి భారతదేశ విమానయాన రంగం ప్రపంచంలోనే మూడో అతిపెద్దది అవుతుందని వివరించారు. ప్రస్తుతం ఉన్న 75 విమానాశ్రయాల మధ్య కాకుండా, పాత-కొత్త విమానాశ్రయాల మధ్య సర్వీసులు నడిపే విమానయాన సంస్థలకు కొత్త విధానం వర్తిస్తుందని కేంద్రమంత్రి అశోక్‌గజపతి రాజు ప్రకటించారు.

విమానయాన వృద్ధిలో అగ్రస్థానాన ఏపీ

విమానయాన రంగం అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో మొదటి స్థానంలో ఉన్నట్లు అశోక్‌గజపతిరాజు వెల్లడించారు. విమానయాన రంగం అవసరాలు తెలుసుకొని ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం విమాన ఇంధనంపై పన్నును 1 శాతానికి తగ్గించడంవల్ల ఏపీలో వృద్ధిరేటు దాదాపు 60% ఉందని, దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో లేదనీ చెప్పారు. కొత్త విధానం వల్ల కడప విమానాశ్రయం మళ్లీ మనుగడలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పారు. అతి త్వరలో తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తామన్నారు.

విజయవాడ, విశాఖ, హైదరాబాద్‌ల మధ్య 'గంట' నిబంధన వర్తించదు

గంట ప్రయాణానికి రూ.2500 టికెట్‌ ధర ఇప్పుడున్న విమానాశ్రయాల మధ్య తిరిగే సర్వీసులకు వర్తించదు. విజయవాడ, విశాఖ, హైదరాబాద్‌లాంటివి ఇప్పటికే అభివృద్ధి చెందిన విమానాశ్రయాలు.

కడప, పుట్టపర్తిలాంటి విమానాశ్రయాల నుంచి హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలకు నడిపే సర్వీసులకు రూ.2,500 ధర వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. ఒకవేళ విశాఖ, హైదరాబాద్‌, విజయవాడ, బెంగుళూరుల మధ్య విమానయాన సంస్థలు రూ.2,500 కంటే తక్కువ ధరకే సేవలు అందించాలనుకుంటే పౌర విమానయానశాఖకు ఎలాంటి అభ్యంతరం ఉండదు.

విమానయాన విధానంలో ముఖ్యాంశాలు

- ఇప్పటివరకు విమానాలు నడవని విమానాశ్రయాల నుంచి ఇకమీదట కొత్త సర్వీసులు నిర్వహించే వారికి కేంద్ర ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేయనుంది.

- ప్రాంతీయ విమానాశ్రయాల మధ్య గంట ప్రయాణ కాలానికి గరిష్ఠ టికెట్‌ ధరను రూ.2,500గా నిర్ణయించారు. ఇందులో 1.2% సేవాపన్ను తప్ప ఇంకెలాంటి పన్నులూ విధించరు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టికెట్‌ ధర రూ.2,500కి మించకూడదు. అంతకంటే తక్కువ ధరకు ఎవరైనా సేవలు అందించవచ్చు.

- రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు, పీపీపీ పద్ధతిలో విమానాశ్రయాల అభివృద్ధిని ఇకమీదట కూడా ప్రోత్సహిస్తారు. పౌరవిమానయానశాఖ కేవలం నియంత్రణాధికార పాత్ర పోషిస్తుంది.

- సార్క్‌ దేశాలు, దిల్లీకి 5వేల కిలోమీటర్లకు మించి దూరం ఉన్న దేశాలతో కేంద్ర ప్రభుత్వం 'ఓపెన్‌స్కై' ఒప్పందం చేసుకుంటుంది.

- 4 హెలీహబ్స్‌ అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తొలుత చేయూతనిస్తుంది. హెలికాప్టర్‌ ద్వారా అత్యవసర వైద్యసేవలు అందించే అంశంపై పౌరవిమానయానశాఖ వివిధ ప్రభుత్వ సంస్థలు, హెలికాప్టర్‌ నిర్వాహకుల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తుంది.

- నిషేధిత, నియంత్రిత ప్రాంతాలను మినహాయించి 5వేల అడుగులలోపు ఎత్తున ఒకప్రాంతం నుంచి మరోప్రాంతానికి హెలికాప్టర్లు ఏటీసీ ముందస్తు అనుమతి లేకుండానే ప్రయాణం చేయొచ్చు.

- భారత్‌ను విమాన నిర్వహణ, మరమ్మతుల (ఎంఆర్‌ఓ) కేంద్రంగా మలచాలని పౌరవిమానయానశాఖ లక్ష్యంగా పెట్టుకొంది. ప్రస్తుతం మరమ్మతులకోసం 90% విమానాలు విదేశాలపై ఆధారపడుతున్నాయి. దీనివల్ల ఏటా రూ.5వేల కోట్ల వ్యాపారం బయటికిపోతోంది.

- 2025 నాటికి భారత పౌరవిమానయాన రంగంలో 3.3 లక్షల మంది అదనపు ఉద్యోగులు అవసరం అవుతారు. అందుకోసం ఇప్పటినుంచే నైపుణ్యాభివృద్ధి సంస్థలకు పౌరవిమానయానశాఖ పూర్తిస్థాయిలో చేయూతనందించనుంది.

English summary
Airlines will soon charge only Rs 2,500 for one hour flights and will get tax incentives for operating on unserved routes even as fliers will have to pay additional levy towards regional connectivity fund under the civil aviation policy unveiled on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X