సినీ టికెట్ల నుంచి పీఆర్సీకి-ఈసారి కొత్త జిల్లాలతో-జగన్ రాజకీయమా మజాకా ? సర్వత్రా చర్చ
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకున్న సీఎం జగన్ ను ఎలాగైనా ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్షాలు ఓవైపు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా... వాటి నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు జగన్ కూడా అంతే వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గతంలో సినిమా టికెట్ల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిన జగన్.. దాన్నుంచి డైవర్ట్ చేసేందుకు పీఆర్సీ వ్యవహారాన్ని, ఇప్పుడు కొత్త జిల్లాల్ని తెరపైకి తెచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

జగన్ ఒంటరి పోరు
ఏపీలో తాజాగా రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ కు గత పదేళ్లతో పోలిస్తే అధికారం చేపట్టిన తర్వాతే రాజకీయాలు ఎక్కువగా అర్దమైనట్లు తెలుస్తోంది. గతంలో ప్రత్యర్ధులతో పోరులో సానుభూతి అస్త్రాన్ని పదే పదే తెరపైకి తెచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక దాన్ని వాడుకోవడానికి వీల్లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు ప్రత్యర్ధులతో మరోసారి ఒంటరిపోరు కోసం కొత్త అస్త్రాలు వెతుక్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా విపక్షాల కంటే ఇతర రూపాల్లో జగన్ కు సవాళ్లు పెరుగుతున్నాయి.

సినీ టికెట్లతో మొదలు
ఏపీలో రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకున్న జగన్ ను టార్గెట్ చేసేందుకు విపక్షాలు ఏకమై అమరావతి అంశాన్ని బలంగా తెరపైకి తెచ్చాయి. ముఖ్యంగా తిరుపతికి పాదయాత్ర, అక్కడ బహిరంగసభ ఏర్పాటు చేసి మూడు రాజధానులపై జగన్ కు సవాల్ విసిరాయి. ఆ సవాల్ ను తిప్పికొట్టేందుకు ఓ దశ వరకూ ప్రయత్నించిన వైసీపీ సర్కార్.. చివరికి దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సినీ టికెట్ల ధరల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిందన్న ప్రచారం జరిగింది. సినిమాలపై ప్రభావం పడే సరికి సామాన్యుల నుంచి వీఐపీల వరకూ వినోదాన్ని కోరుకునే ప్రతీ ఒక్కరూ దీనిపై చర్చించుకోవడం మొదలుపెట్టారు. దీంతో అమరావతి వ్యవహారం ఎటో పోయింది.

సినీ టికెట్ల నుంచి పీఆర్సీకి
ఓ దశలో సినిమా టికెట్ల వ్యవహారం కూడా తలనొప్పిగా మారిపోయింది. టాలీవుడ్ వర్సెస్ వైసీపీ సర్కార్ గా మారి పోయిన ఈ వ్యవహారాన్ని ముగించేందుకు జగన్ అదే సమయంలో ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. అప్పటికే ఉద్యోగులు పీఆర్సీపై పోరుకు సిద్ధమవుతున్న తరుణంలో వారిని చర్చలకు ఆహ్వానించి ఫిట్ మెంట్ శాతంపై చర్చించడం మొదలుపెట్టే సరికి ఉద్యోగుల వ్యవహారం చర్చనీయాంశమైంది. వారితో చర్చల సందర్భంగా పీఆర్సీ శాతాన్ని తగ్గించినా అంతిమంగా మేలు చేస్తామని చెప్పి పంపే సరికి పీఆర్సీ వ్యవహారం సద్దుమణిగినట్లు కనిపించింది. కానీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలతో మళ్లీ మొదటికొచ్చింది.

ఉద్యోగుల సమ్మెతో కొత్త జిల్లాలకు
పీఆర్సీ వ్యవహారం బెడిసికొట్టి ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 6 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు నిన్న ప్రభుత్వానికి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఉద్యోగుల జీతభత్యాల వ్యవహారంపై ప్రజల్లో ప్రభుత్వం చర్చ పెట్టింది. అదే సమయంలో ఉద్యోగులు సమ్మె చేస్తే ప్రజలపై పడే ప్రభావం తీవ్రంగా ఉంటుంది కాబట్టి ప్రజల్లో అంతకు మించిన అంశాన్ని చర్చకు తీసుకురావాలనే ఉద్దేశంతో కొత్త జిల్లాల వ్యవహారాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.
రేపో మాపో ప్రభుత్వం కొత్త జిల్లాలపై ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. అటు కేంద్రం జనాభా లెక్కలు పూర్తికాకుండా జిల్లాల హద్దులు మార్చొద్దని చెప్తున్నా ఈ సమయంలో జిల్లాల విభజనకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయిపోతోంది.

పతాకస్ధాయికి జగన్ పాలిటిక్స్
ఓ వ్యవహారం నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు అంతకంటే పెద్దదైన మరో వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్న సీఎం జగన్. ఆ తర్వాత మరింత పెద్ద వ్యవహారాన్ని జనంపైకి వదులుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. తద్వారా ఏ సమస్యపైనైనా జనం ఎక్కువ రోజులు చర్చించుకోకుండా విభిన్న వ్యవహారాల్ని జగన్ తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గతంలో విపక్షాలు లేవనెత్తిన అమరావతి వ్యవహారమైనా, ఆ తర్వాత వచ్చిన సినిమా టికెట్ల ధరల అంశమైనా రాష్ట్రవ్యాప్తంగా జనం చర్చించుకోవడం లేదు.
ఇదే క్రమంలో జిల్లాల విభజన తెరపైకి వస్తే ఇక పీఆర్సీ, ఉద్యోగుల సమ్మె కూడా మరుగున పడటం ఖాయమనే అంచనాల్లో ప్రభుత్వం ఉన్నట్లు అర్ధమవుతోంది. దీంతో జగన్ రాజకీయాలు విపక్షాలకు సైతం అంతుబట్టడం లేదు.