tirupati vishakhapatnam vijayawada officials collectors municipal elections తిరుపతి విశాఖపట్నం విజయవాడ అధికారులు కలెక్టర్లు
తిరుపతిలో నిమ్మగడ్డ సమావేశం .. మున్సిపోల్స్ కు స్పీడ్ పెంచిన ఎస్ఈసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తరువాత, మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై ఇప్పటికే ఫోకస్ పెట్టిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రాంతాలవారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. నేడు, రేపు, ఎల్లుండి మూడు రోజులపాటు వివిధ జిల్లాల ఉన్నతాధికారులతో, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు.

ఈరోజు తిరుపతిలో అధికారులతో నిమ్మగడ్డ సమావేశం
మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో స్పీడ్ పెంచిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈరోజు తిరుపతిలో 3:00 కు సమావేశం నిర్వహించనున్నారు. కడప, చిత్తూరు ,అనంతపురం, కర్నూలు జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడం కోసం ఆయన అధికారులకు తగిన సూచనలు సలహాలు ఇవ్వనున్నారు. అలాగే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలు జరపడం కోసం నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయ పార్టీల నేతల అభిప్రాయాలు తీసుకోనున్నారు.

ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్ లో సమావేశానికి ఏర్పాట్లు
ఈ మేరకు ఈరోజు సమావేశానికి కావలసిన ఏర్పాట్లను చిత్తూరు జిల్లా అధికారులు చూస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలలో అధికారులు పని చేసిన విధానాన్ని కొనియాడిన నిమ్మగడ్డ రమేష్ కుమార్, అదే తరహాలో మున్సిపల్ ఎన్నికలను విజయవంతం చేయాలని సూచించనున్నారు. ఈసారి ఎన్నికలలో కూడా వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నారు. ఈరోజు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో సమావేశం నిర్వహిస్తామని పేర్కొంది.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నేడు నిమ్మగడ్డ షెడ్యూల్ ఇదే
మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులను సమాయత్తం చేయడానికి రంగంలోకి దిగిన నిమ్మగడ్డ ఈరోజు మధ్యాహ్నం 1. 15 నిమిషాలకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకుని మధ్యాహ్నం 2.15 నిమిషాలకు తిరుపతి చేరుకుంటారు. అనంతరం 3.15 నిమిషాల నుండి 5.30 నిమిషాల వరకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. ఆ తరువాత సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు రాజకీయ పార్టీల నాయకులతో గంటపాటు సమావేశమవుతారు.