నిమ్మగడ్డ అరెస్టుకు వైసీపీ డిమాండ్.. జగన్ సర్కారు సుమోటోగా.. కమలవనంలో పచ్చ పుష్పాలన్న అంబటి..
'పార్క్ హయత్ లీక్స్' వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి చేపట్టే విషయమై సుప్రీంకోర్టు, హైకోర్టులో న్యాయపోరాటం చేస్తోన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, సీనియర్ నేత కామినేని శ్రీనివాస్ తో రహస్యంగా భేటీ కావడాన్ని అధికార వైసీపీ తప్పుపట్టింది. ఈనెల 13న హైదరాబాద్ లోని ప్రఖ్యాత పార్క్ హయాత్ హోటల్ లో ఆ ముగ్గురూ కలుసుకున్నప్పటి సీసీటీవీ ఫుటేజీల వీడియో వైరల్ అయింది.
చౌకీదార్ చైనీస్ హై: మోదీపై కొత్త అస్త్రం.. జవాన్లు చనిపోతే ప్రధానికి చైనా ప్రశంసలా?.. కాంగ్రెస్ ఫైర్

సుమోటోగా తీసుకుని..
కేసులు కీలక దశలో ఉన్న వేళ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ రహస్యంగా నేతలను కలవడం వెనుక పెద్ద కుట్ర దాగుందని, ఈ వ్యవహారాన్ని ప్రభుత్వమే సుమోటోగా విచారణకు తీసుకోవాలని, నిజానిజాల్ని రాబట్టడానికి నిమ్మగడ్డను వెంటనే అరెస్టు చేయాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఆయన స్పష్టం చేశారు.
చైనా దురాగతం.. భారతీయ విద్యార్థులకు బెదిరింపులు.. బలవంతపు క్షమాపణలు.. అది ఆత్మహత్యేనంటూ..

భేటీ వెనుక బాబు..
ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రలో భాగంగానే నిమ్మగడ్డ, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లు రహస్యంగా భేటీ అయ్యారని, దీని వెనుక చంద్రబాబు ఉన్నారని, ఐఏఎస్ అధికారిగా పని చేసిన నిమ్మగడ్డ.. తన కేసుల్ని వాదించడానికి ఖరీదైన లాయర్లను పెట్టుకున్నారని, ఆ డబ్బును చంద్రబాబే సమకూర్చుతున్నారని అంబటి ఆరోపించారు. మంగళవారం వెలుగులోకి వచ్చిన సీక్రెట్ వీడియోలు వైరలైన కాసేపటికే అంబటి మీడియాతో మాట్లాడారు.

ఎంత దూరమైనా వెళతాం..
ఎన్నికల సంఘం అనే రాజ్యాంగ వ్యవస్థను రమేశ్ కుమార్ ఓ తోలు బొమ్మలా తయారు చేశారని, సీక్రెట్ మీటింగ్ వ్యవహారంతో ఆయన దుర్మార్గం మరోసారి బయటపడిందన్న ఎమ్మెల్యే రాంబాబు విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో ఉంటూ రాజకీయ కుట్రలు చేస్తున్నరమేశ్ కుమార్ ను ఉపేక్షించబోమని, ఈ వ్యవహారంలో ఎంతదూరమైనా వెళతామని అన్నారు. గతంలో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఆఫీసు నుంచే లేఖ రాయించిన నిమ్మగడ్డ అడ్డంగా దొరికిపోయారని, ఏమాత్రం నైతికత ఉన్నా పదవులు దూరంగా ఉడాలని అంబటి అన్నారు.

కమల వనంలో పచ్చ పుష్పాలు..
‘‘సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లు బీజేపీలో ఉంటూ టీడీపీ కోసం పనిచేస్తుంటారు. అంటే కమల వనంలో పచ్చ పుష్పాలు అన్నమాట. వాళ్లిద్దరూ చంద్రబాబుతో నిత్యం టల్ లో ఉంటూ, బాబును కాపాడుకోవడమే పనిగా వ్యవహరిస్తుంటారు. నిజానికి నిమ్మగడ్డ కోసమే కామినేని శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. కుట్రలు బయటపడ్డ తర్వాత అందరూ తేలు కుట్టిన దొంగల్లా సైలైంట్ అయిపోయారు''అని అంబటి ఫైరయ్యారు.

ఫుటేజీలు బయటికి ఎలా?
బీజేపీ నేతలతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రహస్య భేటీకి సంబందించిన వీడియోలు పెనుదుమారం రేపుతున్నాయి. ఈనెల 13న హైదరాబాద్ లోని పార్క్ హయాత్ హోటల్ లో చోటుచేసుకున్న ఈ భేటీ తాలూకు సీసీటీవీ ఫుటేజీలు ఎలా బయటికొచ్చాయనేది చర్చనీయాంశమైంది. నిమ్మగడ్డ వ్యవహారంలో సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఏపీ సర్కారుకు చుక్కెదురైన నేపథ్యంలో తాజా వీడియోల వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తిగా మారింది. నిమ్మగడ్డ కదలికలపై ఎవరైనా నిఘా పెట్టారా? వాళ్ల ద్వారానే ఈ ఫుటేజీలు బయటపడ్డాయా? ఇతరులు కూడా కనిపించే ఇంకొన్ని వీడియోలు కూడా బయటపడనున్నాయా? అని సర్వత్రా చర్చ జరుగుతున్నది.