వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెసి మాటేమిటి, రంగాను బాబు చంపించాడు: అవిశ్వాసం ఎందుకో చెప్పిన జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం పైన ఏపీ శాసన సభలో సోమవారం మధ్యాహ్నం చర్చ ప్రారంభమైంది. చర్చ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. తాను అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టానో స్పష్టం చేశారు.

టిడిపిలో చేరిన తమ ఎమ్మెల్యేల డిస్ క్వాలిఫై లక్ష్యంగా అవిశ్వాసం పెట్టామన్నారు. అలాగే, పరిటాల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేసీ సోదరులను టిడిపిలో ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. వంగవీటి రంగా హత్య కేసులో చంద్రబాబు పాత్ర ఉందని హరిరామ జోగయ్య పుస్తకం రాశారని గుర్తు చేశారు.

తన పైన అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారన్నారు. పరిటాల రవి హత్య విషయంలో తనపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. తన పైన విమర్శలు చేస్తున్న టిడిపి నేతలు జేసీ దివాకర్ రెడ్డి గురించి ఏం చెబుతారన్నారు. పరిటాల కేసులో ఆరోపణలు ఉన్న జేసీని ఎందుకు టిడిపిలో చేర్చుకున్నారన్నారు.

No Confidence Motion: YS Jagan blames Chandrababu for Ranga murder

హరిరామజోగయ్య ఓ పుస్తకం రాశారని, అందులో వంగవీటి రంగా హత్య, అందులో చంద్రబాబు హస్తం గురించి రాశారని చెప్పారు. రంగా హత్య కేసులో మంత్రులకు సంబంధముందని జగన్ అభిప్రాయపడ్డారు.

టిడిపి సభ్యుడు కళా వెంకట్రావు మాట్లాడుతూ.. రంగా హత్య జరిగినప్పుడు జగన్ వయస్సు ఎంత అని ప్రశ్నించారు. తనకు ఉన్న మనస్తత్వాన్ని జగన్ ఇతరులకు ఆపాదించడం సరికాదన్నారు. రంగా హత్య సమయంలో తాను హోంమంత్రిగా ఉన్నానని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే జగన్ తన పైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.

మంత్రి దేవినేని మాట్లాడుతూ.. రంగా హత్య కేసులో మంత్రుల హస్తం ఉందని జగన్ చెప్పడం విడ్డూరమన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏదో రకంగా కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. రంగా హత్య విషయంలో మంత్రులకు సంబంధమని చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు.

జగన్ మాట్లాడుతూ.. నోరు తెరిస్తే చంద్రబాబు నుంచి మంత్రుల వరకు అబద్దాలు ఆడుతున్నారన్నారు. అబద్దాలు చెప్పేందుకు సిగ్గుండాలన్నారు. రంగా హత్య విషయమై తాను చెప్పలేదని, చంద్రబాబు కేబినెట్లో పని చేసిన హరిరామజోగయ్య చెప్పారన్నారు.

రంగాను చంద్రబాబు ఏవిధంగా నరికి చంపించారో పుస్తకం రాశారన్నారు. చంద్రబాబు దగ్గరుండి రంగాను చంపించారన్నారు. చంద్రబాబు మనుషులను ఎలా చంపించగలడో రంగా హత్య ఉదాహరణ అన్నారు.

టిడిపి సభ్యుడు తోట త్రిమూర్తులు మాట్లాడుతూ... రంగా హత్యను అడ్డుగా పెట్టుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు పైన నాడు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. అరాచకాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని జగన్ చూస్తున్నారన్నారు. జగన్ అవాస్తవాలు చూసి కాపులు మోసపోరన్నారు.

జగన్‌కు చాలా అహంకారం ఉంటుందని తోట త్రిమూర్తులు అన్నారు. ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబు అందరితో కలిసి వచ్చి కూర్చుంటారని, జగన్ మాత్రం అలా కాదన్నారు.

టార్గెట్ 8 మంది ఎమ్మెల్యేలు.. అందుకే అవిశ్వాస తీర్మానం పెట్టాం

జగన్ మాట్లాడుతూ.. తన పైన టిడిపి సభ్యులు 43వేల కోట్ల ఆరోపణలు చేస్తున్నారన్నారు. అయితే తాను చంద్రబాబుకు సవాల్ చేస్తున్నానని, మనస్సాక్షి ఉంటే అందులో పావులా భాగం ఇస్తే తాను సంతకం పెడతానని చెప్పారు. ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తున్నారన్నారు.

చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే, ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే తన పార్టీ నుంచి టిడిపిలో చేరిన 8 మందితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. వైసిపి నుంచి టిడిపిలో చేరిన 8 మందిని డిస్ క్వాలిఫై చేసేందుకే తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టామన్నారు.

టిడిపిలో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడకు రాకపోయినా, చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేయకపోయినా డిస్ క్వాలిఫై చేయాలని కోరుతామన్నారు. అందుకే అవిశ్వాస తీర్మానం పెట్టామన్నారు.

యనమల మాట్లాడుతూ... మా ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే (టిడిపిలో చేరిన వైసిపి ఎమ్మెల్యేలు) అవిశ్వాసం పెట్టామని జగన్ వాస్తవాన్ని అంగీకరించారని, ఇది సంతోషకరమన్నారు. తద్వారా మీ పార్టీ ఎమ్మెల్యేలకే మీకు విశ్వాసం లేదని తేల్చారన్నారు.

జగన్ మాట్లాడుతూ... మంత్రులు వాస్తవాలను వక్రీకరిస్తున్నారన్నారు. మా ఎమ్మెల్యేలను మేం కాపాడుకోవడానికి మేం విప్ జారీ చేస్తున్నామని చెప్పడం విడ్డూరమన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కాదని, టిడిపిలో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చేయించేందుకు అవిశ్వాసం పెట్టామన్నారు. ఉప ఎన్నికలకు వెళ్తే ప్రజలు, దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడో తెలుస్తుందన్నారు.

చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు

చంద్రబాబు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు రుణమాఫీ హామీ ఇవ్వడంతో రైతులు అప్పులు కట్టలేదని, దీంతో ఇప్పుడు వారు అపరాధ రుసుము కూడా కట్టవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని చెప్పారని, కానీ ఉద్యోగాలు మాత్రం రాలేదన్నారు. డ్వాక్రా సంఘాలను కూడా మోసం చేశారన్నారు.

జగన్ మాట్లాడుతూ... ప్రతి ఇంటికి ఉపాధి లేదా ఉద్యోగం ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పారన్నారు. ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని, కానీ ఏదీ నెరవేరలేదన్నారు. చంద్రబాబు సీఎం కావడంతో కరువు వచ్చిందని ఎద్దేవా చేశారు. అప్పులు తీర్చలేక రైతులు బంగారం అమ్ముకుంటున్నారన్నారు.

ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పైన చంద్రబాబు ప్లేటు మార్చారన్నారు. గోపాల మిత్రను తొలగించారన్నారు. ఆశా వర్కర్లకు ఎనిమిది నెలలుగా జీతాలు రాకుంటే, వారు విజయవాడలో ధర్నా చేస్తే, వారికి ఆ అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. అంగన్వాడీలకు ఇప్పటి వరకు జీతాలు పెంచలేదన్నారు. వారిని కొట్టించారన్నారు.

హాస్టళ్లను, స్కూళ్లను తగ్గిస్తున్నారన్నారు. చంద్రబాబు రైతులను ఆదుకోవడం లేదన్నారు. డిఎస్సీ పరీక్షలు రాసి 188 నెలల నుంచి ఉద్యోగార్థులు ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్రం విడిపోయే నాటికి లక్షా 42వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీకా ఉన్నాయని చెప్పారు.

యనమల మాట్లాడుతూ... జగన్ ఆ స్పీచ్ ఇప్పుడు రాసుకున్నారా, గతంలో రాసుకున్నారా చెప్పాలన్నారు. ఆయన రెండేళ్లుగా ఇదే చదువుతున్నారని ఎద్దేవా చేశారు.

జగన్ మాట్లాడుతూ.. తన పైన వ్యంగ్యాస్త్తాలు అందరూ చూస్తున్నారన్నారు. కానీ చంద్రబాబు ఎన్నికలప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వీఆర్ఏలపై ఉక్కుపాదం మోపి అణగదొక్కుతున్నారన్నారు. అంగన్వాడీలకు జీతాలు పెంచలేదన్నారు. పూరి గుడిసె కనిపించదని చెప్పారు.. కానీ ఏం చేశారన్నారు.

మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... ప్రతిపక్ష నేత జగన్ మొదటి అసెంబ్లీలో మాట్లాడిన క్యాసెట్లు ఇప్పుడు ఇస్తే ఆయన మళ్లీ మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాకుండా జగన్ అన్నీ అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. పింఛన్ విషయంలో జగన్ అసత్యాలు చెబుతున్నారన్నారు.

ఇళ్ల గురించి జగన్‌కు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. రాష్ట్రంలో ఒక్క పూరి గుడిసె కనిపించకుండా చేసేందుకు మేం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 15 లక్షల ఇళ్లను వారి పార్టీ వాళ్లు దోచుకున్నారన్నారు. కానీ మేం పేదవారి గురించి ఆలోచిస్తున్నామన్నారు.

ఈ దేశ పౌరుడు.. మొదట దేశం గురించి, ఆ తర్వాత రాష్ట్రం గురించి, ఆ తర్వాత గ్రామం గురించి ఆలోచించాలన్నారు. కానీ జగన్ మాత్రం స్వార్థం గురించి ఆలోచిస్తాడని మండిపడ్డారు. ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి కొన్నామని చెప్పడం విడ్డూరమని అచ్చెన్నాయుడు అన్నారు.

తమకు సరిపోయే సభ్యులు ఉన్నారని, తమకు కొనాల్సిన అవసరం లేదన్నారు. రాజ్ భవన్ సాక్షిగా జగన్ ప్రభుత్వాన్ని పడగొడతానని హెచ్చరించారని, 23 మంది టిడిపి ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని చెప్పాడని, దీనిని జీర్ణించుకోలేక ఆ ఎమ్మెల్యేలు తమ వైపుకు వచ్చారన్నారు.

రాజకీయాలు ఎవరికీ శాశ్వతం కాదని, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఆలోచించాలన్నారు. ఇలాంటి ప్రతిపక్ష నేత ఏపీకి దొరకడం మన దౌర్భాగ్యమన్నారు. రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ఎవరైనా తప్పులు చేస్తారని, జగన్ కూడా తప్పులు చేశాడని, ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకొని మంచి సలహాలు ఇవ్వాలన్నారు.

మంత్రి కిమిడి మృణాళిని మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళల విషయంలో జగన్ అవాస్తవాలు చెప్పారన్నారు. ఈ సందర్భంగా పింఛన్లు, డ్వాక్రా మహిళల రుణాలు తదితర అంశాలపై మృణాళిని లెక్కలతో సహా వివరాలు వెల్లడించారు.

English summary
No Confidence Motion: YS Jagan blames Chandrababu for Ranga murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X