మంత్రి నాని "మెగా" ట్విస్ట్ - సీఎంతో లంచ్ మీట్ లో ఇదీ జరిగింది : చిరంజీవి నెక్స్ట్ స్టెప్..!!
ఏపీలో సినిమా టిక్కెట్ల వ్యవహారం త్వరలో కొలిక్కి రాబోతోందనే సమయంలో కొత్త ట్విస్టు. కొంత కాలంగా ఏపీలో ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్లుగా కొనసాగిన కోల్డ్ వార్ కు తాత్కాలిక విరామం దొరికింది. మెగాస్టార్ చిరంజీవి అమరావతి వచ్చి సీఎం జగన్ తో సమావేశమమయ్యారు. త్వరోలనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేసారు. తనను ఒక్కరినే సీఎం ఆహ్వానించారని... ఆయన సూచన మేరకే తాను వచ్చానంటూ చిరంజీవి తన పర్యటన సమయంలో పదే పదే చెప్పారు. అదే సమయంలో సీఎం జగన్ - భారతి దంపతుల ఆతిథ్యం బాగుందంటూ ప్రశంసించారు.

చిరంజీవి మీటింగ్ తో ఆశగా..
సినిమా పరిశ్రమలోని సమస్యల ను తాను వివరించానని.. సీఎం అన్నీ నోట్ చేసుకున్నారంటూ మెగాస్టార్ వివరించారు. ప్రస్తుతం కమిటీ అధ్యయనం చేస్తోందని..కమిటీ నివేదిక వచ్చిన తరువాత మరోసారి తనను పిలిచి..ఆ తరువాత జీవో జారీ చేస్తామని హామీ ఇచ్చారంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. తాను సైతం సినీ పరిశ్రమలోని అన్ని విభాగాలకు చెందిన పెద్దలతో చర్చించి..సీఎంతో జరిగిన భేటీ వివరాలను వెల్లడిస్తానని చెప్పారు.
మూడు లేదా నాలుగు వారాల్లోనే సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేసారు. దీనికి కొనసాగింపుగా హీరో నాగార్జున సైతం సీఎంతో జరిగిన చర్చల వివరాలను చిరంజీవి చెప్పారని.. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయంటూ చెప్పుకొచ్చారు.

కుశల ప్రశ్నలు వేసుకున్నారంతే
ఇక, సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయవద్దని చిరంజీవి కోరారు. దీంతో, దాదాపుగా టిక్కెట్ల వ్యవహారం పైన వ్యాఖ్యలు - వివాదాలకు తాత్కాలిక విరామం లభించింది. అయితే, కేబినెట్ భేటీ తరువాత మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలతొ మరోసారి ఈ అంశం చర్చకు వచ్చింది. సినిమా టిక్కెట్ల వ్యవహారం పైన కేబినెట్ లో చర్చకు వచ్చే అంశం కాదని చెబుతూనే... చిరంజీవి సీఎంతో చర్చలు సానుకూలంగా జరిగాయంటూ చెప్పారనే దాని పైన స్పందించారు.
చిరంజీవి ఏదో భోజనానికి వచ్చారు.. వారిద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు.. సంప్రదింపులు సచివాలయంలోనే జరుగుతాయి గానీ, ఇంట్లోనా... ఇదేమైనా చంద్రబాబు ప్రభుత్వమా అంటూ బదులిచ్చారు.

లేటెస్ట్ ట్విస్టుతో ఏం జరగబోతోంది..
దీంతో..ఒక్క సారిగా మంత్రి వ్యాఖ్యలతో సీఎం జగన్ - చిరంజీవి భేటీలో అసలు ఏం జరిగిందనే చర్చకు ఆస్కారం ఏర్పడింది. చిరంజీవి చెప్పిన అంశాలకు.. మంత్రి చేసిన వ్యాఖ్యలకు పొంతన లేకుండా పోయిందనే అభిప్రాయం ఏర్పడుతోంది. సీఎం జగన్ - చిరంజీవి సమావేశం ఒన్ టు ఒన్ లంచ్ మీటింగ్ గా జరిగింది. ఆ సమావేశం తరువాత చిరంజీవి మీడియా సమావేశంలో తామిద్దరి మధ్య ఏం చర్చలు జరిగాయనే అంశాలను వివరించారు.

సీఎం జగన్ - మెగాస్టార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి
తదుపరి చర్చలు..చర్యల పైన సానుకూలంగా ఉంటాయంటూ ధీమా వ్యక్తం చేసారు. అయితే, ఇప్పుడు మంత్రి చేసిన వ్యాఖ్యలతో ఆ చర్చ కొత్త టర్న్ తీసుకుంది. అసలు సినీ ఇండస్ట్రీ - ఏపీ ప్రభుత్వం మధ్య సమస్యల పరిష్కారంలో ఇప్పుడు ఏం జరగబోతోంది.. చిరంజీవి చెప్పిన విధంగానే పరిష్కారం లభిస్తుందా .. లేక, మరి కొంత కాలం ఈ వివాదం కొనసాగుతుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు చిరంజీవి ఏం చేయబోతున్నారు.. ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.