ఏపీ, తెలంగాణకు ఘోర అవమానం -హోదా లేదన్న కేంద్రంపై రామ్మోహన్ ఫైర్ -జతకలిసిన వైసీపీ
పునర్విభజన హామీల్లో అతి ప్రధానమైన 'ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా' అంశంపై మంగళవారం లోక్ సభలో వాడీ వేడి చర్చ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకూ ఎన్నేన్నో వాగ్ధానాలున్న పునర్విభజన చట్టాన్ని ఏ మేరకు అమలు చేశారో చెప్పాలంటూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగి ప్రశ్నకు కేంద్రం అనూహ్య సమాధానాలిచ్చింది. ఏపీకి హోదా ఇవ్వబోమమని మరోసారి కుండబద్దలు కొట్టిన కేంద్రం.. మిగతా సమస్యలను రెండు తెలుగు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని చేతులెత్తేసింది. కేంద్రం తీరుపై వైసీపీ ఎంపీలు సైతం నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే..
న్యాయం దక్కట్లేదు -ఆ రెండే కారణాలు -డబ్బు లేకుండా చేయగలరా? -జస్టిస్ ఎన్వీ రమణ అనూహ్య వ్యాఖ్యలు

నిప్పులు చెరిగిన రామ్మోహన్..
.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం లోక్ సభలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఏపీ పునర్విభజన చట్టంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రాన్ని నిలదీశారు. గతంలో తాను అడిగి ప్రశ్నకు కేంద్ర హోం శాఖ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం అసంపూర్తిగా ఉందన్న రాహ్మోహన్.. ఏపీ ప్రత్యేక హోదాకు తెలంగాణ కూడా మద్దతిస్తుండటం, ఆ చట్టంలో రెండు తెలుగు రాష్ట్రాలకూ ముడిపడిన అంశాలున్నందున మొత్తం 9 కోట్ల మంది ప్రజలు ఆశగా ఎదురు చూస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం అత్యంత నిర్లక్ష్య పూరితంగా, అవగాహనా రాహిత్యంతో, తెలుగు ప్రజలను అవమానించే విధంగా అరకొర సమాధానాలు చెప్పడం తగదని మండిపడ్డారు.

ఏపీకి ఇంకా ఎన్ని అన్యాయాలు?
ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ఇచ్చిన సమాధానం అత్యంత దారుణంగా ఉందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఏపీకి రైల్వే జోన్ విషయంలోను, ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలోనూ, పోలవరం నిధుల విషయంలోను, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలోనూ ఇలా ప్రతి సందర్భంలోనూ అన్యాయం జరుగుతోందని, ఆంధ్రుల హక్కుల్ని దెబ్బతీస్తూ, సెంటిమెంట్‌ను పట్టించుకోకుండా కేంద్రం మొండిగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అన్ని పార్టీలు అంగీకరించాయని రామ్మోహన్నాయుడు గుర్తుచేసారు. పునర్విభజన చట్టం ఎంతవరకు అమలైందో తేల్చిచెప్పాలని టీడీపీ ఎంపీ డిమాండ్ చేయగా...

ప్రత్యేక హోదా ఇవ్వబోము..
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మరోసారి సమాధానం ఇచ్చారు. లిఖిత పూర్వకంగా ఇచ్చిన వివరణలోనే అన్ని అంశాలు ఉన్నాయని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని మంత్రి పేర్కొన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని పాత పాటే పాడారు. 14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు ప్రత్యేక హోదా కుదరదని మంత్రి పునరుద్ఘాటించారు. పునర్విభజన చట్టంలోని అనేక అంశాలు అమల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. అంతేకాదు..

రాష్ట్రాలే పరిష్కరించుకోవాలి..
ఏపీ ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పిన కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్.. పునర్విభజన చట్టంలో ఇతర అంశాలపైనా స్పందించారు. హోదా కాకుండా చట్టంలో చాలా అంశాలున్నాయని, వాటిని పరిష్కరించడానికి కేంద్రం తన వంతు ప్రయత్నం చేస్తున్నదని, ఇప్పటివరకు ఇరు రాష్ట్రాల అధికారులతో 24 సమీక్ష సమావేశాలు నిర్వహించామని తెలిపారు. ప్రాజెక్టులు, విద్యాసంస్థల నిర్మాణం సుదీర్ఘకాలం పడుతుందని, మరికొన్ని విభజన హామీలు వివిధ దశల్లో ఉన్నాయని, అయితే చాలా అంశాలనురెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పరిష్కరించుకోవాల్సినవనంటూ కేంద్రమంత్రి వ్యాఖ్యలు చేశారు. దీనిపై..

కేంద్రానికి వైసీపీ ఎంపీల డిమాండ్
ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్న అడగటం, దానికి సంతృప్తికర సమాధానం రాకపోయే సరికి సభలోనే కేంద్ర మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ వెంటనే మంత్రి నిత్యానందరాయ్ మాట్లాడుతూ హోదా ఇవ్వలేమని, ఇతర సమస్యలను రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని చెప్పడంతో ఏపీ ఎంపీలంతా భగ్గుమన్నారు. కేంద్రాన్ని నిలదీయడంలో వైసీపీ ఎంపీలు సైతం జతయ్యారు. ప్రత్యేక ప్యాకేజీతో సంబంధం లేకుండా ఏపీకి హోదా ఇవ్వాలని లోక్ సభలో వైసీపీ నేత మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు పూర్తి అయినా పునర్విభజన చట్టంలోని అనేక అంశాలు నెరవేరలేదని, దీనికి కారణాలేంటో కేంద్రం చెప్పాలని వైసీపీ ఎంపీ డిమాండ్ చేశారు.
షాక్: లోక్‌సభ లాబీలోనే బెదిరించాడు -ఎంపీ నవనీత్ కౌర్ సంచలనం -చిక్కుల్లో సేన ఎంపీ సావంత్ -మహా డ్రామా