పోలవరంపై నలిగిపోతున్న ఏపీ .. కేంద్రం కొర్రీలే కాదు తెలంగాణా అభ్యంతరాలు కూడా .. నేటి భేటీపై ఉత్కంఠ
ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ సర్కార్ నలిగిపోతోంది. ఒక పక్క కేంద్రం పోలవరం నిధులకు కొర్రీలు పెడుతుంటే, మరో పక్క తెలంగాణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచడంతో భద్రాద్రి జిల్లాకు ముంపు ముప్పు పొంచి ఉందంటూ అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. అసలే పోలవరం ప్రాజెక్టు నిధులు విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సామరస్యంగా వెళ్లాలా, పోరాటం చెయ్యాలా ? ఎలా అయితే నిధులను రాబట్టుకోగలుగుతామని తర్జనభర్జనలో ఉన్న ఏపీ సర్కార్ కు తెలంగాణా కూడా తలనొప్పిగా తయారైంది.

పోలవరం నిధులకు కోత పెడుతున్న కేంద్రం
ఈ రోజు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆఫీసులో రెండు తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు కేంద్ర జల శక్తి శాఖ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో సమావేశం కానుండటం ఆసక్తికరంగా మారింది. పోలవరం ప్రాజెక్టు విషయంపై కేంద్ర రోజుకో కొత్త విషయాలను తెరమీదికి తీసుకువస్తుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 2013 - 2014 నాటి అంచనా వ్యయాన్ని మాత్రమే ఇస్తామని ప్రకటించిన కేంద్రం, పునరావాసం తో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

పోలవరం విషయంలో దిక్కు తోచని స్థితిలో ఏపీ
ఆ తర్వాత తాగునీటి అవసరాలకు, విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కూడా నిధులు కేటాయించమని, ఒకవేళ ఇప్పటివరకు ఇచ్చిన నిధుల్లో తాగునీటి అవసరాలకు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఏమైనా ఖర్చు చేస్తే, వాటిని భవిష్యత్ నిధుల నుండి మినహాయించాలని కేంద్ర ఆదేశించింది. దీంతో పోలవరం ప్రాజెక్టు విషయంలో దిక్కుతోచని స్థితిలో ఏపీ సర్కార్ పడిపోయింది.
ఇదే సమయంలో ఈరోజు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆఫీసులో కేంద్ర జల శక్తి శాఖ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు.

పోలవరం ప్రాజెక్టుతో భద్రాద్రి జిల్లాలో ముంపు..తెలంగాణా అభ్యంతరం
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాద్రి జిల్లాలోని 100 గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని కేంద్రానికి లేఖ రాసింది. 2013 - 2014 అంచనాల మేరకు 36 లక్షల క్యూసెక్కుల బ్యాక్ వాటర్ ఉంటే సుమారు 72 గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదముందన్న తెలంగాణ, పోలవరం నీటి నిలువ 50 లక్షల క్యూసెక్కుల పెంచడంతో వందకు పైగా గ్రామాలు మునిగిపోతాయని పేర్కొంది. అంతే కాదు పలు కేంద్ర ప్రభుత్వ కంపెనీలు కూడా మునిగిపోతాయని తెలంగాణ ఇరిగేషన్ శాఖ కేంద్రానికి లేఖ రాసిన లేఖలో పేర్కొంది.

నలిగిపోతున్న ఏపీ ... సమావేశంలో ఏం తేలుస్తారో ?
పోలవరం నిర్మాణంపై అటు తెలంగాణ అభ్యంతరాలపై , ఇటు కేంద్రం నిధుల విషయంలో పెడుతున్న కోర్రీలపై ప్రశ్నించడం కోసం ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. ఈరోజు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆఫీసులో జరుగుతున్న సమావేశానికి తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్ కుమార్, ఏపీ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదిత్యనాథ్ దాస్, కేంద్ర జల శక్తి శాఖ జాయింట్ సెక్రెటరీ జగన్మోహన్ గుప్తా , కేంద్ర జల శక్తి శాఖ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై పలు అంశాలను చర్చించనున్నారు . దీంతో ఈ సమావేశంపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి నెలకొంది.