ఏపీలో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం- నోటిఫికేషన్ విడుదల, జూన్ 10న పోలింగ్
ఏపీలో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్ధానాలకు ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే విడుదలైన షెడ్యూల్ ప్రకారం ఇవాళ అధికారులు లాంంఛనంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనట్లయింది. ఎమ్మెల్యేల కోటాలో జరిగే ఈ నాలుగు సీట్ల ఎన్నికలు ఏకపక్షం కానున్నాయి.
ఏపీలో నాలుగు రాజ్యసభసీట్లకు ఎన్నికలు నిర్వహిచేందుకు వీలుగా అధికారులు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 31 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. అభ్యర్ధులు నామినేషన్ పేపర్లను రిటర్నింగ్ అధికారిగా ఉన్న అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ పీవీ సుబ్బారెడ్డికి సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్ధులు రాలేకపోతే వారి స్ధానంలో నామినేషన్ల ప్రతిపాదకులను పంపవచ్చు. ఇలా అందిన నామినేషన్లను జూన్ 1న పరిశీలిస్తారు.

జూన్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు వీలుంటుంది. ఆ తర్వాత జూన్ 10న ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితుల్లో అసెంబ్లీలో సంపూర్ణ మెజారిటీతో ఉన్న అధికార పార్టీ వైసీపీకి ఈ నాలుగు సీట్లు లభించే అవకాశాలున్నాయి. దీంతో ఇప్పటికే వైసీపీ అధిష్టానం తమ నలుగురు అభ్యర్ధుల పేర్లను కూడా ప్రకటించింది. విజయసాయిరెడ్డి, బీదమస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలను ఈసారి వైసీపీ రాజ్యసభకు పంపుతోంది.