ఎన్టీఆర్ విగ్రహానికి కొడాలి నాని పాలాభిషేకం- గుడివాడలో ఏమైందంటే : రఘురామ పైనా..!!
ఏపీలో కొత్త జిల్లాల పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంతో ఏర్పడిన జిల్లాకు వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ పేరు ఖరారు చేసింది. ఇప్పుడు వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం ద్వారా టీడీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా.. ఎన్టీఆర్ విగ్రహాలకు వైసీపీ నేతలు పోటీ పడి పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. తాజాగా.. మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్ విగ్రహానికి తన నియోజకవర్గంలో పాలాభిషేకం చేసి జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు.

సీఎం జగన్కు పాదాభివందనం
చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా చేయలేదని.. జగన్ పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు ఎన్టీఆర్ పేరు ఖరారు చేయటాన్ని అభినందించారు. ఎన్టీఆర్ అభిమానిగా.. తనతో పాటుగా అభిమానులంతా ఈ నిర్ణయం పైన సంతోషంగా ఉన్నారని మంత్రి చెప్పుకొచ్చారు. అయితే కొందరు టీడీపీ నేతలు దీనిని కూడా రాజకీయం చేస్తున్నారు.
దీనినిబట్టి ఎన్టీఆర్పై వారు ఎంత ద్వేషంతో ఉన్నారో ఇప్పుడే అర్థమవుతోంది. ప్రతిపక్షం ఎప్పుడూ కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. అయితే చంద్రబాబు మాత్రం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఇక, గుడివాడలో క్యేసినో నిర్వహించారంటూ టీడీపీ నేతలు ఎంత అసత్య ప్రచారం చేసినా..వాస్తవం ఏంటనేది గుడివాడోలని ప్రజలందరికీ తెలుసన్నారు.

వాళ్లు చంద్రబాబు పంపే ఛీర్ బాయిస్..
చంద్రబాబు పంపే ఛీర్ బాయిస్ మినహా... గుడివాడలో ఉండే టీడీపీ నేతలు సైతం స్పందించటం లేదని నాని ఎద్దేవా చేసారు. వాళ్లు 24 గంటలూ నాని అంటూ భజన చేసినా..తనకు ఎటువంటి నష్టం లేదని వ్యాఖ్యానించారు. వాళ్లు చేసేది ఏంటో తన కంటే సీఎం జగన్ కు బాగా తెలుసని చెప్పుకొచ్చారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు పైనా మంత్రి కొడాలి నాని స్పందించారు. ముందు అసలు రఘురామ తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలి కదా అని ప్రశ్నించారు. రఘురామ పోటీ చేసి ఏ పార్టీ నుంచి పోటీ చేసినా.. వైసీపీ నుంచి అభ్యర్ధి బరిలో ఉంటారని స్పష్టం చేసారు.

రఘురామ పైన మా వ్యూహం మాకు ఉంది...
ఎన్నికలు వస్తే ఎలా పోరాడాలో తమకు బాగా తెలుసన్నారు. ఇప్పటి వరకు నర్సాపురం గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తన పైన గుడివాడ డీఎస్పీ నుంచి అనేక స్థాయిలో ఫిర్యాదులు చేసారని చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడికి సైతం ఫిర్యాదు చేస్తామంటూ టీడీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీని మూసి వేసారని..ఇదే రకంగా వ్యవహరిస్తే ఏపీలోనూ పార్టీ మూసేసే పరిస్థితి వస్తుందని కొడాలి నాని వ్యాఖ్యానించారు.