ఓబులాపురం మైనింగ్ కల్లోలం.. మరోసారి వార్తలో అక్రమాల గనులు
ఓబులాపురం మైనింగ్ కంపెనీ మరోసారి వార్తల్లో నిలిచింది. అటవీ శాఖాధికారి కల్లోల్ బిశ్వాస్‌ను విధులు నిర్వహించకుండా అడ్డుకున్న కేసులో కంపెనీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డికి మూడు సంవత్సరాల జైలుశిక్ష విధించారు. అనంతపురం జిల్లాలోని రాయదుర్గం కోర్టు ఈ శిక్ష విధించింది.
కోర్టు ఆదేశాలతో బిశ్వాస్ 2008లో ఓబుళాపురంలో గనుల తవ్వకం ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లారు. అయితే ఆయన తన విధులు నిర్వహించకుండా శ్రీనివాసరెడ్డితోపాటు అక్కడి ఉద్యోగులు కూడా అడ్డుకోవడంతో దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఓబులాపురం మైనింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయనే విషయం 2009లో బయటపడింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటకలోను ఈ అంశం రాజకీయంగా తీవ్ర దురమారాన్ని రేకెత్తించింది. గనుల్లో అక్రమ తవ్వకాలవల్ల వేలకోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి.
ఈ గనులకు సంబంధించి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్న గాలి జనార్దన్‌రెడ్డితోపాటు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోని పలువురు ఐఏఎస్ అధికారులపై సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులను 2017లో సీబీఐ కోర్టు కొట్టేసింది. మొత్తం 72 కేసులు నమోదవగా కోర్టు ఎక్కువ శాతం కేసులను కొట్టేసింది. మరికొన్ని కేసుల్లో అసలు విచారణే ప్రారంభమవలేదు. ఈ మైనింగ్ కేసులో ప్రధాన సాక్షులను భయపెట్టారనే ఆరోపణలు ఏపీ, కర్ణాటకను కుదిపేశాయి.