గృహప్రవేశానికి అడ్డంకులు: ఏపీ ఖజానా కోసం 'ఆక్యుపెన్సీ సర్టిఫికెట్' గోల
అమరావతి: ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీ ప్రభుత్వం ఆదాయ అన్వేషణ కోసం వెతుకున్న సమయంలో ఓ సరికొత్త మార్గం కనిపించింది. ఏపీలో కొత్తగా ఇల్లు కట్టుకున్నారా? మంచి ముహూర్తం చూసుకుని గృహప్రవేశం చేయాలనుకుంటున్నారా?
అయితే ఒక్క క్షణం ఆగండి. రేయింబవళ్లు కష్టపడి మీరు సంపాదించిన సొమ్ముతో కట్టుకున్న ఇంట్లోకి వెళ్లాలంటే ఇకపై ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ఇంట్లో గృహ ప్రవేశానికి ముందు పంచాయితీ, మునిసిపల్, కార్పొరేషన్ అధికారుల నుంచి 'ఆక్యుపెన్సీ సర్టిఫికెట్' తీసుకోవాలి.
లేకుంటే భారీ జరిమానా చెల్లించాలి. గతంలోనే ఈ నిబంధన అమలులో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ నిబంధనే ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించనుంది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా ఎవరైతే ఇళ్లలో చేరారో వారి నుంచి భారీగా జరిమానాలు వసూలు చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది.

దీంతో అధికారులు ఈ వైపుగా అడుగులు వేస్తున్నారు. ఈ జరిమానా నుంచి తప్పించుకోవాలంటే, ఇంటి నిర్మాణం పూర్తయిన వెంటనే, సంబంధిత ఉద్యోగులకు సమాచారమిస్తే, వారే ఇంటి వద్దకు వచ్చి అన్ని అనుమతులు పాటించారా? ప్లాన్ ప్రకారమే ఇల్లు కట్టారా? అన్న విషయాలు పరిశీలించి సర్టిఫికెట్ ఇవ్వాలా? వద్దా? అని నిర్ణయం తీసుకుంటారు.
ఆ తర్వాత మాత్రమే ఇంటి యజమాని, ఆ ఇంట్లోకి వెళ్లి నివాసం ఉండే అర్హత పొందుతాడు. ఇకపై ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు సకాలంలో జారీ అయ్యేలా చూస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ, ఈ సర్టిఫికెట్ల జారీకి సామాన్యులు ఎంత మొత్తంలో ముట్టజెప్పాలో అనే ఆలోచనలో పడ్డారు.












Click it and Unblock the Notifications