త్వరలో ఉల్లి ధరకు రెక్కలు- వర్షాలతో పంటలకు భారీ నష్టం- తెలుగు రాష్ట్రాలపై ప్రభావం..
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలు అన్నదాతలకు ఆనందం కలిగిస్తున్నా పలు చోట్ల పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. భారీ వర్షాల ప్రభావంతో ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని నివేదికలు వస్తున్నాయి. దీంతో మరోసారి తెలుగు రాష్టాల్లో ఉల్లి ధరలు మంటపుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. గతేడాది ఇదే సమయంలో ఉల్లి ధరలు భారీగా పెరిగి వినియోగదారులకు చుక్కలు చూపించాయి. దీంతో మరోసారి అలాంటి పరిస్ధితి తలెత్తుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర వంటి మార్కెట్లలో ఉల్లి కొరత కనిపిస్తోంది.

భారీ వర్షాలకు ఉల్లికి నష్టం..
దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఉల్లి పంటలు మరోసారి దెబ్బతిన్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సాధారణం కంటే 25 శాతం ఎక్కువగా వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఆశించిన దాని కంటే ఎక్కువగా వర్షం కురవడంతో సున్నితమైన ఉల్లి పంటపై తీవ్ర ప్రభావం పడుతోంది. వర్షాలతో పంట పాడవ్వడం, పండించిన పంట సరిగా నిల్వ చేసుకోలేకపోవడం వంటి సమస్యలు తలెత్తున్నట్లు తెలుస్తోంది. దీని ప్రబావం దేశవ్యాప్తంగా రిటైల్, హోల్‌సేల్ మార్కెట్లపై పడుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడే కాకున్నా వచ్చే నెల నుంచి ఉల్లి సెగ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.

ఉల్లి ధరలకు రెక్కలు...
ఏపీ, కర్నాటకలో ఖరీఫ్ సీజన్ ఆరంభంలో పండించే ఉల్లిపాయలు జూలై నుంచి సెప్టెంబర్ వరకూ దేశవ్యాప్తంగా రవాణా అవుతాయి. ఈ ఏడాది కురిసిన భారీవర్షాల కారణంగా ఈ పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. స్ధానికంగా నిల్వ చేసుకునే అవకాశాలూ లేకుండా పోయాయి. గుజరాత్, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల వల్ల అక్కడి మార్కెట్లకూ ఉల్లి రాక తగ్గిపోతోంది. దీంతో సహజంగానే ఉల్లి కొరత మొదలైనట్లు కనిపిస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో హోల్ సేల్, రిటైల్ ధరలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే పలు చోట్ల రిటైల్, హోల్‌సేల్ మార్కెట్లో ఉల్లి కొరత కనిపిస్తోందని, వచ్చే నెల నాటికి ఉల్లి కొరత ప్రభావం ధరల మంట రూపంలో వినియోగదారులపై పడుతుందనే అంచనాలున్నాయి.

క్రమంగా పెరుగుతున్న ధరలు...
ముంబై, కోల్‌కతా రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర ఇప్పటికే రూ.50కి చేరింది. ఢిల్లీలో ఉల్లి ధర రూ.60కి చేరుకుంది. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన నాసిక్‌లో ఆగస్టు 28న కిలో ఉల్లి ధర రూ.12 ఉంటే ఈ నెల 8వ తేదీ నాటికి అది కాస్తా రూ.29కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రస్తుతం రూ.25 నుంచి రూ.30 పలుకుతోంది. ఇది ఈ నెలాఖరులోపే రూ.50 రూపాయలకు చేరుకునే అవకాశమున్నట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. వచ్చే నెల చివరి కల్లా ఇది రూ.100కు చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు. నవంబర్ కు కానీ కొత్త పంట వచ్చే అవకాశం లేదు. దీంతో ఉల్లి ధరలు క్రమంగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. గతేడాది కూడా భారీగా పెరిగిన ఉల్లిధర ఓ దశలో రూ.160 నుంచి రూ.180 వరకూ పలికింది. ఈసారి అలాంటి పరిస్ధితి వస్తుందా అంటే ఇప్పుడే కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి.