భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ఆన్లైన్.. లాక్ డౌన్ తో అన్ని పూజలు ఆన్లైన్ లోనే !!
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఆలయాల మీద పడింది. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు కరోనా వైరస్ నేపధ్యంలో భక్తుల సందర్శనను నిలిపివేసి కేవలం నిత్య పూజలు కొనసాగిస్తున్నాయి ఇక కరోనా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో దాదాపు నెలరోజులుగా భక్తులు ఆలయాలకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అందుకే భక్తుల సౌకర్యార్ధం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని ఆన్ లైన్ పూజలు నిర్వహించటానికి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.

కరోనా కాలంలో గుడికి వెళ్ళటానికి ప్రత్యామ్నాయంగా ఆన్లైన్ పూజలు
కరోనా కాలంలో గుడికి వెళ్లి పూజలు చేయించుకోలేక పోతున్నాం అని దిగులు చెందుతున్న వాళ్ళ కోసం ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చాయి ప్రభుత్వాలు . దేవున్ని నేరుగా ఆలయానికి వెళ్లి చూడకపోయినప్పటికీ ఆన్ లైన్ లో అర్చనలు, పూజలు చేయించే అవకాశం కల్పిస్తుంది. తెలంగాణా దేవాదాయ శాఖ లాక్డౌన్ దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ పూజలకు శ్రీకారం చుట్టింది . తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలలో దేవాదాయ శాఖ ఆన్లైన్ పూజలు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.

తెలంగాణా ప్రముఖ ఆలయాలలో ఆన్లైన్ ఆర్జిత సేవలు
ఆన్ లైన్ పూజలు నిర్వహించే ఆలయాల జాబితాలో ఉన్న ప్రధాన ఆలయాలు చూస్తే యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ,వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, కొండగట్టు హనుమాన్ దేవాలయం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం, బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలు ఉన్నాయి.

ఆన్ లైన్ లో రుసుమును చెల్లించి, గోత్రనామాలను పంపితే పూజలు
ఇక ఈ ఆలయాల్లో పూజలు చేయించడానికి భక్తులు ఆన్ లైన్ లో రుసుమును చెల్లించి, గోత్రనామాలను పంపించాలి. వారి పేరిట ఆలయ అర్చకులు పూజలు నిర్వహిస్తారు. ఆలయంలో సాధారణ అర్చన, పూజలకు ఒక రేటు, సుదర్శన హోమానికి చేయించడానికి ఇంకో రేటు .. ఏది ఏమైనా రుసుమును వెబ్సైట్లో చెల్లించి పూజలు చేయించుకోవచ్చని ఆలయ అధికారులు చెప్తున్నారు. ఇక ఏపీలోనూ ఇప్పటికే ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇంటి నుంచే ఆన్లైన్లో దర్శన సమయాన్ని బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది ఏపీ సర్కార్ . రాష్ట్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఆలయాలను గుర్తించి, అక్కడ ఈ సదుపాయాన్ని కల్పించింది.

కాణిపాకం ఆలయంలో ఆన్ లైన్ లో పూజలు చేస్తున్న అర్చకులు
ప్రస్తుత కరోనా సమయంలో కొనసాగుతున్న లాక్ డౌన్ నేపధ్యంలో ఆన్ లైన్ సేవలు వినియోగించుకోవచ్చని చెప్తుంది . ఆన్ లైన్ లో పూజల బుకింగ్ చేసుకోవచ్చని దేవాదాయ శాఖ స్పష్టం చేసింది. ఇక కరోనా సమయంలో స్వామీ వారిని దర్శించుకోవాలనుకునే వారికి కాణిపాకం దేవస్థానం ఆన్ లైన్ లో పూజలు నిర్వహిస్తుంది . కాణిపాకం ఆలయంలో భక్తులు పరోక్షంగా పూజలు, మొక్కులు స్వామివారి సేవలు నిర్వహించుకునేలా అవకాశం ఇవ్వనుంది.కరోనా మహమ్మారి రాక ముందు వరకు ప్రత్యక్షంగా సేవలో పాల్గొన్న భక్తులు పరోక్షంగా వారి పేర్లతో పూజలు, హోమాలు నిర్వహించుకునే అవకాశం కల్పించింది.

భగవంతుడికీ భక్తుడికీ అనుసంధానంగా ఆన్ లైన్ పూజలు
మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో దేవుళ్ళు ఆన్ లైన్ లో భక్తులను కరుణించనున్నారు. దేవాలయాలకు వెళ్ళటం లేదని దిగులు పడే భక్తులకు ఆన్ లైన్ లో దర్శన భాగ్యం కల్పించనున్నారు. వారి పేర్ల మీద పూజలు నిర్వహించనున్నారు . కరోనా వైరస్ తో లాక్ డౌన్ కొనసాగుతున్న భగవంతుడికీ భక్తుడికీ అనుసంధానమైనది ఆన్ లైన్ . ఇంకేం పూజలు, పునస్కారాలతో లాక్ డౌన్ ఆన్ లైన్ లో పూజలతో గడిపెయ్యండి.