దుర్గగుడి వెండిరథం సింహాలు మాయం ఘటన.. ప్రతిపక్షాలు ఫైర్, విచారణ కమిటీ వేస్తామన్న మంత్రి
అంతర్వేది లో రథం దగ్ధం ఘటన మరిచిపోకముందే మరో ప్రసిద్ధ అమ్మవారి దేవాలయంలో దారుణం జరిగింది .విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో, అమ్మవారి వెండి రథంలో మూడు సింహాలు చోరీకి గురయ్యాయి అన్న వార్త ప్రస్తుతం కలకలంగా మారింది. అయితే అలాంటిదేమీ జరగలేదని చెబుతున్నారు దుర్గ ఆలయ ఈవో సురేష్ బాబు. అయితే ఈ ఘటనపై విచారణకు కమిటీ వేస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు .
ఆర్టీసీ బస్సులపై తెలంగాణ కొత్త కొర్రీలు- విజయవాడ, కర్నూలు వరకే బస్సులు- రేపు మరో భేటీ..

ఘటనపై కమిటీ వేస్తాం .. ఎప్పుడు జరిగిందో తేలుస్తామన్న మంత్రి
విజయవాడ దుర్గ గుడి వెండి రథంలో మూడు సింహాలు మాయం ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. రథానికి భద్రత కల్పించే చర్యల్లో భాగంగా అధికారులు దానిపై కప్పిన టార్పాలిన్ ను తొలగించి చూసే సమయంలో దానిపై మూడు సింహాలు కనిపించలేదని, అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు రథాన్ని ఉపయోగించ లేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఘటన జరిగిందో, లేక ఇప్పుడు జరిగిందో విచారణలో తేలుతుందని పేర్కొన్న మంత్రి ఘటనపై కమిటీ వేస్తామని పేర్కొన్నారు.

సెక్యూరిటీ ఏజెన్సీ భద్రతాలోపంగా తేలితే చర్యలు
సెక్యూరిటీ ఏజెన్సీ కి దేవాలయ భద్రతను అప్పగించామని, సెక్యూరిటీ ఏజెన్సీ భద్రతా లోపం తేలితే దానిపై చర్యలు తీసుకుంటామని వెలంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. అంతర్వేది ఘటన తరువాత అన్ని దేవాలయాల్లోని భద్రత చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
మంత్రి వెల్లంపల్లి మాటలు గత ప్రభుత్వ హయాంలో మాయమై ఉండొచ్చు అన్న అనుమానం కలిగేలా ఉండటం గమనార్హం .

దుర్గమ్మ భక్తులలో కలకలంగా మారిన మూడు సింహాలు మాయం ఘటన
అమ్మవారి వెండి రధానికి ఉండవలసిన నాలుగు వెండి సింహాలలో ఒకటి మాత్రమే మిగిలి ఉండటం, ఇక ఆ విషయాన్ని ఇన్ని రోజుల పాటు బయటకు రాకుండా జాగ్రత్త పడటం ప్రస్తుతం ఏపీ లో చర్చనీయాంశంగా మారింది. హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని హిందూ సంఘాలు మండిపడుతున్న తరుణంలో ఈ వార్త వెలుగులోకి రావటం మరింత ఆగ్రహం తెప్పిస్తుంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం దుర్గమ్మ భక్తులలో పెద్ద కలకలంగా మారిన ఈ ఘటనపై దుర్గ గుడి ఈవో సురేష్ బాబు విచారణ తర్వాతే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు .రికార్డులు పరిశీలన కోసం మూడు రోజుల సమయం కావాలని ఈవో తెలిపారు. అయితే ప్రతిపక్ష పార్టీలు దీనిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. రికార్డుల పరిశీలన కు మూడు రోజుల సమయం దీనికంటూ ప్రశ్నిస్తున్నాయి. హిందూ సంఘాలు ఈ ఘటనపై మండిపడుతున్నాయి.

వెండి రథాన్ని చూపించాలని ప్రతిపక్షాల డిమాండ్ .. నేడు టీడీపీ , బీజేపీ , జనసేన నేతల పరిశీలన
భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి భక్తులకు , మీడియా ముందు రథాన్ని చూపించాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక దుర్గగుడిలో వెండి రధాన్ని బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు సందర్శించి జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను మరికాసేపట్లో తెలుసుకోనున్నారు.ప్రభుత్వ అసమర్ధత ఇలాంటి ఘటనలకు కారణం అని ఇప్పటికే మండిపడుతున్న ప్రతిపక్ష పార్టీలకు ఇప్పుడు మరో ఆయుధం దొరికినట్టు అయ్యింది.