వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపికి ప్రత్యేక హోదా: జాతీయ స్థాయిలో మోడీకి చిక్కులు?

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం మరోసారి జాతీయ రాజకీయాలకు వేదికైంది. రెవెన్యూ లోటు, పరిశ్రమలు లేక వెనుకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పక్షం తెలుగుదేశం వ్యతిరేకత, దాని మిత్రపక్షం బీజేపీ శషబిషల మధ్య కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చేరువలో మిర్చి గాటుకు మారుపేరుగా పరిగణించే గుంటూరు వేదికగా జాతీయ రాజకీయ పార్టీలన్నీ సమర శంఖం పూరించాయి. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ జీవ నాడి అని, భావోద్వేగ పూరిత అంశం కానే కాదని నినదించారు. ఇది ఎన్నికల ప్రచార సంరంభం కానేకాదని తేల్చి చెప్పారు.

గమ్మత్తేమిటంటే మూడేళ్ల క్రితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మండిపడుతూ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం - బీజేపీ సంకీర్ణ కూటమికి మద్దతు పలికిన జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ కూడా 'ప్రత్యేక హోదా' సభకు మద్దతు పలికారు.

అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయినట్లు ట్వీట్ చేశారు. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం - బీజేపీ కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సారథ్యంలో విపక్షాలన్నీ కూటమిగా ఆంధ్రుల సంక్షేమమే ధ్యేయంగా ముందడుగు వేశాయి.

మోదీపై విపక్షాలు ఇలా

మోదీపై విపక్షాలు ఇలా

వచ్చేనెల 25వ తేదీన ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారసుడి ఎన్నిక కోసం కేంద్రంలో బీజేపీ నాయకుడు నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి ధీటుగా ఉమ్మడి అభ్యర్థిని నిలిపే లక్ష్యంతో సోనియాగాంధీ నిర్వహించిన విపక్షాల సమావేశం భావి రాజకీయ రణ రంగానికి భూమికగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. పార్లమెంట్ వేదికగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ అమలుకు మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతున్నదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. కలియుగ వైకుంఠంగా పరిగణించే తిరుపతి కొండ మీద శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షిగా తమకు అధికారం అప్పగిస్తే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రధాని మోదీని నిలదీశారు. హిందూ ధర్మాలు చెప్పే ప్రధాని మోదీ.. తన హామీ నిలుపుకోలేక పోవడానికి కారణాలేమిటో ఆంధ్రప్రదేశ్ వాసులకు వివరించాలని డిమాండ్ చేశారు.

 విపక్షాలపై చంద్రబాబు ఇలా

విపక్షాలపై చంద్రబాబు ఇలా

సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు ప్రత్యేక ప్యాకేజీ కల్పిస్తే తప్పేమిటని కేంద్రాన్ని నిలదీశారు. తెలుగుదేశం పార్టీదీ, తమది సైకిల్ గుర్తే కానీ, ఢిల్లీకి సైకిల్‌పై వెళ్లగలిగేది సమాజ్ వాదీలేనని స్పష్టం చేశారు. విపక్షాలను అనునిత్యం ఆడిపోసుకునే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కడిగి పారేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విపక్షాలకు భూమిక లేకుండా చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండి పడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీ అయినా ఎక్కడైనా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించొచ్చునన్న సంగతి ఏపీ సీఎం, కాకలు తీరిన రాజకీయ నాయకుడు చంద్రబాబుకు తెలియదని చెప్పలేం. కానీ తాను అధికారంలో ఉన్నప్పుడల్లా ఆదిపత్య రాజకీయాలే నెలవుగా ఆయన ముందుకు సాగారు.

తెలంగాణ ఏర్పాటుకు బాబు ఇలా లేఖ

తెలంగాణ ఏర్పాటుకు బాబు ఇలా లేఖ

ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి 1978లో రాజకీయంగా ముందుకు సాగిన చంద్రబాబు.. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటల్లుడి హోదాలో ఒక వెలుగు వెలిగారు. 1989 - 94 మధ్య కాలంలో విపక్షంలో ఉన్నప్పుడు నాటి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు వెన్నంటి ఉన్న బాబు.. 1994లో టీడీపీ అదికారంలోకి వచ్చిన తర్వాత తనదైన శైలిలో గ్రూప్ రాజకీయాలకు తెర తీశారు. నాటి నుంచి అవసరాలకు అనుగుణంగా రాజకీయ పొత్తులు సాగిస్తూ మనుగడ సాగించిన చంద్రబాబు 2008లో తెలంగాణ ఆవిర్భావానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి లేఖ ఇచ్చారు.

తద్వారా తెలంగాణలోనే 2009 ఎన్నికల్లో అత్యధికంగా లబ్ధి పొందారు. 2009 ఎన్నికల తర్వాత వైఎస్ మరణం.. అదే ఏడాది డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూల నిర్ణయాన్ని నాటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించడంతో చంద్రబాబు మండిపడ్డారు. కన్నడిగులు, తమిళులు కలిసి అతిపెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేందుకు పూనుకున్నారని ఎదురుదాడికి దిగారు.

ఇలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం

ఇలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు కోసం 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు చట్టం రూపకల్పన దశలోనూ అడుగడుగునా అడ్డుకోవడానికి ప్రయత్నించారు చంద్రబాబు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన మోదీ ద్వారా బీజేపీని విభజనను అడ్డుకోవడానికి శతవిధాల ప్రయత్నించారు ఈ తెలుగుదేశాధినేత. న్యాయంగా విభజన చేయాలని విపక్షాల నేతలందరినీ కోరినా పట్టించుకోలేదని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలను కోరానని ఏకరువు పెట్టారు. రాజ్యాంగ బద్ధంగా ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ నెరవేర్చేందుకు కేంద్రంలో నాటి అధికార కాంగ్రెస్, విపక్షం బీజేపీ సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినందుకే తెలంగాణ ఆవిర్భావం సుగమమైంది. న్యాయంగా విభజించాలన్న డిమాండ్ పేరిట ఆచరణలో తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడమే బాబు వ్యూహం. ఎన్నికలయ్యే వరకు విభజనను నిలువరిస్తే తర్వాత తనదైన శైలిలో అడ్డుకోవడంతోపాటు ఉద్యమాన్ని అణచేయవచ్చని అంతరార్థాల్లో దాగి ఉన్న నిజం. 2001లో అసెంబ్లీలో తెలంగాణ పదం వాడడాన్నే నిషేధించిన గొప్ప రాజనీతి గల రాజకీయ నాయకుడు చంద్రబాబు.

తెలంగాణ పట్ల ద్వేషాన్ని మరోమారు బయటపెట్టుకున్న బాబు

తెలంగాణ పట్ల ద్వేషాన్ని మరోమారు బయటపెట్టుకున్న బాబు

కానీ రాజ్యాంగ బద్ధంగా కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మద్దతునిచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ సహా విపక్ష పార్టీలన్నీ దేశ ద్రోహులేనని ముక్తాయింపునిచ్చిన చంద్రబాబు మూడు రోజుల క్రితం గురువారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవం నాడు విజయవాడలోని బెంజి సర్కిల్ కేంద్రంగా ‘నవ నిర్మాణ దీక్ష' పేరిట జరిగిన సభలో తెలంగాణ ఏర్పాటు పట్ల తనకు గల కుళ్లు, ద్వేషాన్ని బయట పెట్టుకున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుది. తెలంగాణలో వెలుగు చూసిన ‘ఓటుకు నోటు' కుంభకోణం సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనను పర్యవేక్షించేందుకు బెజవాడకు తరలిపోయిన నేపథ్యం చంద్రబాబుది. బెజవాడ సర్కిల్‌లో జరిగిన ఈ నవ నిర్మాణ సభకు జనం లేక వెలవెలబోయింది. దీనికి నిదర్శనం ఆంధ్రదేశమంతటా అధికార తెలుగుదేశం పార్టీకి నీరాజనాలు పలికే రెండు ప్రధాన దిన పత్రికల్లో ఒకటి తొలిరోజు నవ నిర్మాణ దీక్ష సాక్షిగా జరిగిన సభను తగిన ప్రాధాన్యం ఇవ్వక పోవడమే నిదర్శనమని విశ్లేషకులు చెప్తున్నారు.

పరోక్షంగా హోదాపై బాబు అంగీకారం ఇలా

పరోక్షంగా హోదాపై బాబు అంగీకారం ఇలా

దీంతో ఆంధ్రావని అంతటా అధికార తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న భ్రమలు తొలగిపోతున్నాయని అర్థమవుతున్నది. దీనికి తోడు ఆదివారం గుంటూరులో జరిగిన రాహుల్ సభకు ఆంధ్రప్రదేశ్ వాసులు హాజరు కావద్దని ప్రజలకు పిలుపునిచ్చిన ఘనత ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబుది. మూడేళ్ల క్రితం తెలుగు నేలపై విద్వేషాలు రగల్చడంలో ఒకింత విజయం సాధించారు బీజేపీ - టీడీపీ కూటమి నేతలు. అదే ఒరవడిని ఇక ముందు కూడా కొనసాగించాలన్న సంకల్పం వారిలోనూ ఇంకా కనిపిస్తున్నట్లు చంద్రబాబు మొదలు అధికార తెలుగుదేశం పార్టీ నేతల్లో కనిపిస్తున్నది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజకీయ చైతన్యానికి మారుపేరు. కానీ మాయ మాటలతో కల్లబొల్లి కబుర్లు చెప్పడంలోనూ, తనదైన శైలిలో అబద్దాలను వల్లెవేయడంలోనూ చంద్రబాబు శైలే వేరు. ప్రస్తుత కేంద్రమంత్రి - బీజేపీ సీనియర్ నేత ఎం వెంకయ్య నాయుడు డిమాండ్‌తోనే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని ముందుకు తెచ్చిందని గుర్తు చేయడం ద్వారా తాము, తమ మిత్రపక్షం ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నామని పరోక్షంగా అంగీకరించారు చంద్రబాబు.

తెలంగాణపై వారి వైఖరి ఇదీ

తెలంగాణపై వారి వైఖరి ఇదీ

నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు చెందిన కోస్తాంధ్ర, రాయలసీమ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రులు విభజన ప్రక్రియకు అడ్డుగోడల నిలువడానికే ప్రయత్నించారే తప్ప.. ఒకవేళ విభజన జరిగితే ఒక రాష్ట్రంగా తమ డిమాండ్లు ఇవీ అని కేంద్రం ముందు పెట్టడంలో విఫలమయ్యారు. పెప్పర్ స్ప్రేలతో సభ వాయిదాల ద్వారా పుణ్య కాలం గడిచిపోయేలా చేసిందే కోస్తాంధ్ర ఎంపీలు. అన్నింటికి మించి తెలంగాణ నుంచి వచ్చే నిధులన్నీ కోస్తాంధ్ర, రాయలసీమలకు, నియామకాలు దొడ్డిదారిన తమ సొంత వారికి కట్టబెట్టిన వారు.. ఈ వాస్తవాలు విస్మరించి ఈనాడు అధికారంలోకి చేతిలోకి వచ్చాక కల్లబొల్లి కబుర్లు చెప్పడం బాబు వంటి వారికే చెల్లునని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

బీజేపీ, టీడీపీలకు దూరమైన పవన్ కల్యాణ్

బీజేపీ, టీడీపీలకు దూరమైన పవన్ కల్యాణ్

మూడేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్వరం వినిపించి ఆంధ్రప్రదేశ్ వాసులందరినీ తెలుగుదేశం - బీజేపీ పక్షాన నడిపించడంలో ముందు ఉన్న జన సేన అదినేత పవన్ కల్యాణ్ సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో క్రమంగా దూరం జరిగారు. కేంద్రంలోని బీజేపీ సైతం అధికారం అండతో తాము చేసేదే సరైనదన్న అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నిస్తున్నది. అమరావతి వేదికగా భూసేకరణ మొదలు ప్రత్యేక హోదా వరకు వివిధ అంశాలపై తెలుగుదేశం పార్టీ, బీజేపీ అనుసరించిన విధానాలపై ట్విట్టర్ వేదికగా, బహిరంగ సభల్లోనూ నినదించడం ద్వారా ఏపీ వాసులను తనకు అనుకూలంగా తిప్పుకోవడంలో పవన్ కల్యాణ్ విజయం సాధించారు. తెలుగుదేశం, బీజేపీలకు వ్యతిరేకంగా నినదిస్తున్న కొద్దీ ఆ రెండు పార్టీల విమర్శలతో వాటికి పవన్ కల్యాణ్ దూరమయ్యారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పోరాటానికి.. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు మద్దతు పలుకడం ద్వారా పవర్ స్టార్ వ్యూహాత్మక వైఖరి అనుసరిస్తున్నారు.

పదేళ్ల ప్రత్యేక హోదాపై ఇలా కేంద్ర మంత్రి వెంకయ్య

పదేళ్ల ప్రత్యేక హోదాపై ఇలా కేంద్ర మంత్రి వెంకయ్య

రాష్ట్రానికి వెలుగు దివ్వెగా భావించే పోలవరం ప్రాజెక్టును నాడు జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. దీని నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించాల్సిన బాధ్యత కేంద్రానిదే. రాజకీయంగా లబ్ది పొందడమే లక్ష్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఇరు పక్షాలు పరస్పరం ఎత్తులు వేస్తున్నాయి. అలాగే ప్రత్యేక హోదా అంశంపై పరస్పర భిన్న రాజకీయ వ్యూహాలు అమలుజేస్తున్నాయి. మరోవైపు కేంద్రంలో స్వంత బలంపై అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ప్రధాని నరేంద్రమోదీ.. ఆయనకు అత్యంత సన్నిహితుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సొంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతం కావడానికి వ్యూహాలు అమలుజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పట్ల సన్నిహితుడిగా అంతా పరిగణించే కేంద్ర మంత్రి - బీజేపీ సీనియర్ నేత ఎం వెంకయ్య నాయుడు సైతం ప్రత్యేక హోదా మొదలు వివిధ అంశాలపైనా ప్రత్యేకించి రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీని నిందించడంలో ముందుంటారు. కానీ నాడు రాజ్యసభ వేదికగా పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని ఆయన డిమాండ్ చేసిన సంగతి యావత్ జాతి వీక్షించింది.

విపక్షాలపై విమర్శలతో ఇలా ప్రతికూలం

విపక్షాలపై విమర్శలతో ఇలా ప్రతికూలం

కానీ అధికారం తోడైన తర్వాత.. ఇటీవల యూపీలో చారిత్రక విజయం సాధించాక తిరుగులేదన్న ద్రుక్పథంతో బీజేపీ ముందుకు సాగుతోంది. అందుకే గుంటూరు వేదికగా రాహుల్ సారథ్యంలో ప్రత్యేక హోదా సాధనకు సభ జరుగుతూ ఉంటే హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ రాహుల్ వారసత్వ రాజకీయాన్ని ముందుకు తెచ్చారు. కాంగ్రెస్ పార్టీకి వారసత్వమే తప్ప జవ సత్వాలు లేవని ఎద్దేవా చేయడానికి ప్రయత్నించారు. కానీ విపక్షంలో ఉన్నప్పుడు వినిపించే వాదనలు, ఇచ్చే హామీలను అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయకపోతే పరిస్థితులు ప్రతికూలంగా మారతాయని తెలుసుకోకపోవడమే విపరిణామాలకు దారి తీస్తుందని గుర్తుంచుకోవాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

English summary
AP special status issue once again comes national agenda with congress 'AP Hodaa Barosha Sabha' in Guntur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X