ఏపీలోనూ... గ్రామాల్లో అక్రమ లే అవుట్లపై ఉక్కుపాదం .. కఠిన చర్యలకు ఆదేశం
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు అక్రమ లేఅవుట్లు పై ఉక్కు పాదం మోపడానికి రెడీ అయ్యాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం తీసుకువచ్చి భూముల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంటే, మరోపక్క ఏపీలో సైతం వ్యవసాయ భూములపై సర్వే కొనసాగుతోంది. అంతేకాదు నిబంధనలకు విరుద్ధంగా గ్రామాలలో అక్రమ లేఅవుట్లు వేసిన వారిపై ఉక్కుపాదం మోపేందుకు కూడా రంగం సిద్ధమవుతోంది.
వరద బాధితులకు జగన్ సర్కార్ బాసట: ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీకి ఆదేశం

అక్రమ లే అవుట్లకు నోటీసులు జారీ చెయ్యాలని ఆదేశం
అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తున్న వారు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ లేఅవుట్లు చేస్తున్నవారిపై కొరడా ఝుళిపించనుంది . నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి ఫీజు చెల్లించకుండా, అసలు అనుమతులు తీసుకోకుండా అక్రమ లే అవుట్ వేస్తున్న వారికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.
ఈ మేరకు
పంచాయతీరాజ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాఖా మంత్రి బొత్సా సత్యాన్నారాయణ సమీక్ష నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు .

నగరాల సమీపంలోనే అక్రమ లే అవుట్లు ... మంత్రుల దృష్టికి తీసుకువచ్చిన అధికారులు
గ్రామ పంచాయితీలు , అర్బన్ అధారిటీ పరిధిలో అక్రమ లే అవుట్లపై సర్వే నిర్వహించి అనధికార లే అవుట్లకు నోటీసులు జారీ చెయ్యాలని సూచించారు. గ్రామ పంచాయితీల పరిధిలో 2015 లెక్కల ప్రకారం 6049అక్రమ లే అవుట్లు ఉన్నట్టు మంత్రుల దృష్టికి అధికారులు తీసుకువచ్చారు . అందులో నగరాలకు సమీపంలోనే ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. ముఖ్యంగా విజయవాడ , గుంటూరు , విశాఖ , రాజమండ్రి , తిరుపతి వంటి పెద్ద నగరాలకు సమీపంలోనే గ్రామాల్లో అక్రమ లే అవుట్లు ఉన్నట్టు పేర్కొన్నారు . వాటి విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుందని మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళారు అధికారులు .

రెగ్యులరైజేషన్ స్కీమ్ తీసుకురావటానికి ఆలోచిస్తున్న సర్కార్
పట్టణ ప్రాంతాల్లోలా గ్రామ పంచాయితీల్లో కూడా అక్రమ లే అవుట్ ల రెగ్యులరైజేషన్ స్కీమ్ తీసుకురావటానికి కూడా చర్చ జరిగింది . పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఉండే పంచాయితీల లేఅవుట్ల కు వసూలు చేసే ఫీజులలో కొంత మొత్తాన్ని పంచాయతీలకు ఇవ్వాలనే అంశంపై కూడా మంత్రుల సమావేశంలో చర్చ జరిగింది . దీనిపై అధికారులు చర్చించి నిర్ణయం తీసుకోవాలని మంత్రులు వారికి సూచించారు. అనధికార లే అవుట్ లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని ఆదేశించారు.