జగన్ లేఖపై ఏపీ హైకోర్టు ఫస్ట్ రియాక్షన్ - అన్నీ బయటపడ్డాక గ్యాగ్ ఆర్డర్లతో పనేముందని వ్యాఖ్య..
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మరికొందరు హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి తమ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సీఎం జగన్ సుప్రీం ఛీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖ కలకలం రేపుతూనే ఉంది. ఇప్పటికే ఈ లేఖపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పాటు పలు న్యాయవాద సంఘాలు, అసోసియేషన్లు మండిపడుతుండగా... తాజాగా ఏపీ హైకోర్టు కూడా తొలిసారి దీనిపై పరోక్షంగా స్పందించింది. అమరావతి భూముల అక్రమాలకు సంబంధించి దాఖలైన మరో పిటిషన్‌లో అనుబంధ ఉత్తర్వులు ఇచ్చే విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరో చర్చకు తావిచ్చాయి. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

జగన్ లేఖపై హైకోర్టు పరోక్ష స్పందన..
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ వ్యవహారశైలిపై ఏపీ సీఎం జగన్ రాసిన లేఖపై హైకోర్టు పరోక్షంగా స్పందించింది. ఈ లేఖలో పేర్కొన్న విషయాలు బయటికి రావడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. లేఖ రాయడాన్ని తప్పుబట్టకపోయినా లేఖలో అంశాలను ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం బయటపెట్టడంపై వ్యాఖ్యలు చేసింది. లేఖలో అన్ని అంశాలు బయటికి రావడంతో గతంలో అమరావతి భూముల వ్యవహారంలో ఏసీబీ ఎఫ్‌ఐఆర్ బయటికి రాకుండా ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ వృధా అయిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి సలహాదారు ప్రెస్‌మీట్‌తో పాటు ఆయన రాసిన లేఖ, ఇతర అంశాలు బయటికొచ్చేశాయని హైకోర్టు అభిప్రాయపడింది.

కొత్తగా ఉత్తర్వుల అవసరం లేదు..
అమరావతి భూముల వ్యవహారంలో ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌పై వార్తలు ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా హైకోర్టు గతంలో గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. దీనిపై తెలంగాణకు చెందిన మమతారాణి అనే న్యాయవాది అనుబంధ పిటిషన్ వేశారు. ఎఫ్ఐఆర్‌లో అంశాలు తమకు తెలుసుకునే హక్కు ఉందంటూ తనను కూడా ఈ కేసులో ప్రతివాదిగా ఇంప్లీడ్ చేయాలని హైకోర్టును ఆభ్యర్ధించారు. దీనిపై స్పందించిన హైకోర్టు మమతారాణి పిటిషన్‌పై ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇప్పటికే ముఖ్యమంత్రి సలహాదారు ప్రెస్‌మీట్‌తో అన్ని వివరాలు బయటికొచ్చాక ఇక గ్యాగ్ ఆర్డర్ పై తమ ఉత్తర్వులు నిష్పలం అయ్యాయని తెలిపింది. అందుకే కొత్తగా మరో ఉత్తర్వు అవసరం లేదని స్పష్టం చేసింది.

ఎఫ్‌ఐఆర్ బయట పెట్టలేదన్న ప్రభుత్వం..
అమరావతి భూముల వ్యవహారంలో మాజీ ఏజీ దమ్మాలపాటి, ఇతరుల పాత్రపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అంశాలు బయటికి రాలేదని, ముఖ్యమంత్రి సలహాదారు కేవలం ఛీఫ్ జస్టిస్‌కు సీఎం జగన్ రాసిన లేఖను మాత్రమే బయటపెట్టారన్నారు. ఇందులో అమరావతి భూముల ఎఫ్‌ఐఆర్ వివరాలు లేవన్నారు. కానీ కోర్టు ఈ వాదనతో సంతృప్తి చెందలేదు. మరోవైపు ఇదే కేసులో తన పాత్రపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ వివరాలు సోషల్ మీడియాలో వచ్చేశాయని, వాటిపై పోస్టులు తొలగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని మాజీ ఏజీ దమ్మాలపాటి తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. అత్యవసర విచారణ కావాలనుకుంటే హైకోర్టు రిజిస్ట్రీని కోరాలని తెలిపారు.