ఏపీలో ఆ జిల్లాల్లో అధిక ఎండ తీవ్రత- జాగ్రత్తలు తప్పవ్
Temperature in AP: ఏపీలో రోజురోజుకూ ఎండ తీవ్రత అధికమౌతోంది. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. రికార్డుస్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది. 40 డిగ్రీల ఎండ కాయడం సాధారణమైపోయింది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతోంది.

ఈ ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి. వేడి గాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో వేడిగాలులు, ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి. మే నెలలో ఎండ తీవ్రత 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
శనివారం బాపట్ల జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని రావిపాడులో అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. నంద్యాల, కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇదే స్థాయిలో పగటి ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 119 ప్రాంతాల్లో ఎండ తీవ్రత 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
అదే రోజున వేర్వేరు జిల్లాల్లో 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 68 మండలాల్లో వడగాలులు వీచినట్లు విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వడగాలుల తీవ్రత నేడు కూడా కొనసాగుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 67 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొన్నారు.
నేడు వడగాలుల తీవ్రత అత్యధికంగా ఉండే జిల్లాల్లో విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. విజయనగరం- 11, పార్వతీపురం మన్యం- 10, శ్రీకాకుళం- 7 మండలాల్లో వీటి తీవ్రత అత్యధికంగా ఉంటుంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని రోణంకి కూర్మనాథ్ విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications