అమరావతి రైతుల సంకల్పం ముందు జగన్ రెడ్డి కుట్రలు పటాపంచలు: పంచుమర్తి అనురాధ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు, సి ఆర్ డి ఏ విషయంలో హై కోర్టు ఇచ్చిన తీర్పుతో అమరావతి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులు హైకోర్టు న్యాయమూర్తులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కిలోమీటర్ల మేర హైకోర్టుకు వెళ్లే మార్గంలో బారులు తీరిన రైతులు న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. 800కు పైగా రోజులుగా రాజధాని అమరావతి ప్రాంత రైతులు రాజధానిగా అమరావతి నగరాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకున్నా తమ పోరాట పంథాను విడువకుండా ఆందోళనను కొనసాగించారు.
చరిత్రహీనులుగా వైసీపీనేతలు; జగన్ మూడు ముక్కలాటకి హైకోర్టుతీర్పు చెంపపెట్టు: చంద్రబాబు, లోకేష్

చంద్రబాబు చేపట్టిన అమరావతి యాగానికి న్యాయదేవత ఊపిరి పోసింది: పంచుమర్తి
తాజాగా హైకోర్టు రాజధాని అమరావతి నగరాన్ని అభివృద్ధి చేయాలని, రాజధాని అమరావతి ప్రాంత రైతులకు ప్లాట్లను అభివృద్ధి పరిచి మూడు నెలల్లోగా అందించాలని ఆదేశాలు జారీ చేయడంతో అమరావతి రైతుల సంతోషం వెల్లివిరుస్తుంది. ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు సైతం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అని వెల్లడించారు. తాజాగా టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన అమరావతి యాగానికి న్యాయదేవత ఊపిరి పోసిందని పేర్కొన్నారు.

అమరావతి రైతుల సంకల్పం ముందు జగన్ రెడ్డి కుట్రలు పటాపంచలయ్యాయి
శుక్రవారం మీడియాతో మాట్లాడిన అనురాధ అమరావతికి మరణం లేదని హైకోర్టు తీర్పుతో స్పష్టమైందని వెల్లడించారు. రాజధాని అమరావతి రైతుల సంకల్పం ముందు జగన్ రెడ్డి కుట్రలు పటాపంచలయ్యాయి అని పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. ఎప్పటికైనా అంతిమ విజయం న్యాయానిదే అని పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న సమయంలో రాజధాని అమరావతి ప్రాంతంలో చావు డప్పులు మోగాయని, అమరావతి ప్రాంత రైతులు ఎందరో అమరావతి రాజధాని కాదన్న ఆవేదనలో ప్రాణాలు పోగొట్టుకున్నారని పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు.

జగన్ ను నమ్మి ఒక్కరైనా సెంటు భూమి ఇచ్చినా.. రాజకీయాల నుండి తప్పుకుంటా
వైసీపీ ప్రభుత్వం 189 మంది రైతులను పొట్టనబెట్టుకుందని పంచుమర్తి అనురాధ విమర్శలు గుప్పించారు. నాడు చంద్రబాబు నాయుడుని నమ్మి రైతులు 33 వేల ఎకరాలను రాజధాని నగరం కోసం ఎలాంటి సంశయం లేకుండా ఇచ్చారని పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. జగన్ ను నమ్మి ఒకరైన సెంటు భూమి ఇచ్చినా, రూపాయి ఇచ్చినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్ వైఖరి మార్చుకోవాలని, రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు.

సేవ్ ఆంధ్రప్రదేశ్ బిల్డ్ అమరావతి నినాదంతో అమరావతి జేఏసీ
ఇక ఇదే సమయంలో అమరావతి రైతు జేఏసీ తమ నినాదంలో మార్పును చేయాలని నిర్ణయించింది. ఇకనుండి సేవ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో కాకుండా సేవ్ ఆంధ్రప్రదేశ్ బిల్డ్ అమరావతి నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది. నేడు మందడం శిబిరంలో రైతులను పలు పార్టీ నేతలు కలవనున్నారు. రాజధాని ఉద్యమంలో పోరాడిన మహిళా రైతులకు టిడిపి నేత అనిత పసుపు కుంకుమలను అందజేయనున్నారు.