పరిటాల రవికిచ్చిన ఆ మాట నేరవేర్చలేకపోయా ..ఉద్వేగంగా సునీత ..వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన టీడీపీ
నేడు టీడీపీ నేత అనంత రాజకీయాలను శాసించిన నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి వర్ధంతి సందర్భంగా అటు టీడీపీఅధినేత చంద్రబాబు, ముఖ్యనేతలతో పాటు పరిటాల కుటుంబం, అనుయాయులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తునారు . ఇక ఈ నేపధ్యంలో తన భర్త దివంగత పరిటాల రవి చివరి కోరికపై తెలుగు దేశం పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత మీడియా ముందు ఉద్వేగానికి లోనయ్యారు. రామగిరి మండలం వెంకటాపూర్ గ్రామంలోని రవి ఘాట్ వద్ద నివాళులు అర్పించిన పరిటాల సునీత అభిమానులు, కార్యకర్తలకు అన్నదానం చేశారు.
వైసీపీ ప్రభుత్వానికి పరిటాల శ్రీరామ్ ఓపెన్ ఛాలెంజ్..నిరూపించు చూస్తా అంటూ

కొడుకును ఎమ్మెల్యే చేస్తానన్న మాట నేరవేర్చలేకపోయానని సునీత ఉద్వేగం
మీడియాను ఉద్దేశించి మాట్లాడిన టిడిపి నాయకురాలు పరిటాల సునీత తన భర్త దివంగత పరిటాల రవి కోరికలన్నీ నెరవేర్చానని, అయితే గత వర్ధంతికి రవి ఘాట్ వద్ద పరిటాల శ్రీ రామ్‌ను ఎమ్మెల్యేగా చేస్తానని చెప్పానని , ఎమ్మెల్యేగా చూపిస్తానన్న మాట నేరవేర్చటంలో మాత్రం విఫలమయ్యానని ఉద్వేగానికి లోనయ్యారు. ఈ వర్ధంతి నాటికి పరిటాల శ్రీరామ్ ను ఎమ్మెల్యేగా చేస్తానని చెప్పానని కానీ అది నెరవేరలేదని చెప్పారు. అయినప్పటికీ పరిటాల రవి కోరిక నెరవేర్చడానికి తాను పోరాటం చేస్తానని సునీత పేర్కొన్నారు.

ఆయన ఆశయాల కోసమే పని చేస్తునానన్న సునీత
రవి మరణించిన నాటి నుండి ఆయన ఆశయ సాధనకే పని చేస్తున్నానని చెప్పారు .పరిటాల కుటుంబం ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడూ పనిచేస్తుందని ఆమె హామీ ఇచ్చారు. పరిటాల సునీత మరియు అతని కుమారుడు శ్రీ రామ్‌తో పాటు గ్రామస్తులు, అనుచరులు పరిటాల రవి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించి ఆయనను గుర్తు చేసుకున్నారు. ఇక మరోపక్క మాజీ మంత్రి పరిటాల రవి ఒక శక్తి అని కొనియాడారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు .

పరిటాల రవి వర్ధంతికి నివాళులు అర్పించిన చంద్రబాబు, టీడీపీ ముఖ్య నేతలు
ఒక వ్యవస్థను, పెత్తందారీ విధానాన్ని రవి తీవ్రంగా నిరసించాడని, టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు .ఎన్టీఆర్ భవన్లో పరిటాల రవి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా రవికి చంద్రబాబు తో పాటు టీడీపీ ముఖ్య నేతలు యనమల రామకృష్ణుడు, కనకమేడల రవీంద్ర కుమార్, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, జవహర్,అచ్చెన్నాయుడు, రామానాయుడు తదితరులు నివాళులర్పించారు.

ఫ్యూడల్ పాలనపై పోరాటమే పరిటాల రవికి అందించే నివాళి అన్న చంద్రబాబు
ఈ సందర్భంగా పరిటాల రవిని గుర్తు చేసుకున్న చంద్రబాబు ఉదాత్త ఆశయాల కోసం జీవితాంతం పోరాడాడని చెప్పుకొచ్చారు. ఇక పరిటాల స్పూర్తితో వైసీపీ హత్యా రాజకీయాలపై రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. చనిపోయి 15ఏళ్లయినా పేదల గుండెల్లో చిరంజీవిగా ఉన్నాడని చంద్రబాబు కొనియాడారు . ఫ్యూడల్ పాలనపై పోరాటమే పరిటాల రవికి అందించే నివాళి అని చంద్రబాబు చెప్పారు.