ganta srinivasa rao tdp ysrcp vijaya sai reddy visakhapatnam AP Municipal Elections 2021 AP Local Body Elections 2021 గంటా శ్రీనివాసరావు టీడీపీ వైసీపీ విజయసాయి రెడ్డి విశాఖపట్నం politics
విజయసాయి రెడ్డే చెప్పాలి: పార్టీ మార్పు, సీఎంకు ప్రతిపాదనలపై తేల్చేసిన గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా, విజయసాయి వ్యాఖ్యలపై గంటా స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాలను ఖండించారు.

ఇది వైసీపీ మైండ్ గేమ్..
2019 నుంచి ఇప్పటి వరకు సుమారు వందసార్లు తాను పార్టీలు మారుతానని పుకార్లు వచ్చాయని గంటా శ్రీనివాస్ చెప్పారు. విజయసాయి రెడ్డి ఏ లక్ష్యంతో ఈ వ్యాఖ్యలు చేశారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇది వైసీపీ మైండ్ గేమ్ లా ఉందనన్నారు.

ఆ విషయం విజయసాయిరెడ్డే చెప్పాలి..: గంటా
తాను అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఏపీ సీఎంకు ఎలాంటి ప్రతిపాదనలు పంపానో విజయసాయి రెడ్డే సమాధానం చెప్పాలన్నారు గంటా శ్రీనివాసరావు. గడిచిన రెండేళ్లుగా తన అనుచరుడు కాశీ ఎన్నో ఇబ్బందులు పడ్డారని, అందుకే పార్టీ మారరాని చెప్పారు.

పార్టీ మార్పుపై తేల్చేసిన గంటా శ్రీనివాసరావు
టీడీపీలోనే తాను కొనసాగుతానని, ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తున్నట్లు గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఒకవేళ తాను పార్టీ మారాల్సి వస్తే అందరితో ధైర్యంగా అన్ని విషయాలు మాట్లాడిన తర్వాతే నిర్ణయం ప్రకటిస్తానని ఆయన తేల్చి చెప్పారు. గత కొంత కాలంగా గంటా శ్రీనివాసరావు అధికార వైసీపీ లేదా బీజేపీలోకి చేరుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

టీడీపీలో కలకలం రేపిన విజయసాయి వ్యాఖ్యలు
కాగా, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథ్ బుధవారం విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ ఎన్నికలకు ముందు గంటా శ్రీనివాసరావు కూడా వైసీపీలో చేరే అవకాశం ఉందని చెప్పారు. గంటా శ్రీనివాసరావు గతంలో కొన్ని ప్రతిపాదనలు పంపించారని, వాటిని పార్టీ ఆమోదిస్తూ వైసీపీలో చేర్చుకుంటామని విజయసాయి తెలిపారు. వైసీపీ సర్కారు, జగన్ చేస్తున్న అభివృద్ధి చూసి గంటా శ్రీనివాసరావు ఆకర్షితుడయ్యారని తెలిపారు. అంతేగాక, టీడీపీ నుంచి మరిన్ని వలసలుంటాయన్నారు. ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపాయి. తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలోనే గంటా క్లారిటీ ఇవ్వడం గమనార్హం.