టార్గెట్ జగన్, కెసిఆర్: పవన్ వద్దకు బాబు రాయబారం!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు అర్రులు చాస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో తప్ప ఏ రాజకీయ పార్టీతోనైనా కలిసేందుకు సిద్దమని పవన్.. తన జనసేన పార్టీ ఆవిర్భావం సమయంలో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ బిజెపి, టిడిపితో సర్దుబాటు చేసుకునే దిశలో అడుగులు వేస్తున్నారు. ఈ రెండు పార్టీలతో ఒక ఒప్పందం కుదుర్చుకుని పరిమిత స్థానాల్లో జనసేన అభ్యర్థులను బరిలో నిలిపే అవకాశాలున్నాయి.
జనసేన పార్టీ వల్ల తమ విజయావకాశాలకు ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటికీ, సినీ గ్లామర్, సామాజిక కోణంలో ఓట్లు చీలిపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో బిజెపి, టిడిపి పవన్‌కు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో బిజెపి కన్నా టిడిపియే ఎక్కువ ఆసక్తి చూపుతోందంటున్నారు. పవన్‌ను తన వైపు తిప్పుకునేందుకు టిడిపి నాయకత్వం బిజెపి సాయం కోరుతోందట.

ఎన్నికల్లో పోటీ చేసే విషయమై పవన్ ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆయన మద్దతు పొందేందుకు టిడిపి పావులు కదుపుతోందట. టిడిపి అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు కొందరు సినీ ప్రముఖులు, పార్టీ సీనియర్ నేతలు పవన్‌తో ప్రాథమికంగా చర్చలు జరిపారని తెలుస్తోంది. ఈ చర్చలకు తుది రూపం ఇచ్చేందుకు పవన్, బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ మధ్య భేటీ ఏర్పాటు చేసేందుకు టిడిపి నేతలు యత్నిస్తున్నారు.
ఢిల్లీలో బుధవారం జరిగే బిజెపి ఎన్నికల సంఘం సమావేశానికి ఆ పార్టీ నేతలు మోడీ, రాజ్‌నాథ్ హాజరవుతున్నారు. టిడిపి దూతల ద్వారా కాకుండా, రాష్ట్రానికి చెందిన బిజెపి నేతలే పవన్‌ను ఇక్కడికి రప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓట్లు చీలిపోవడం తప్ప గెలిచే అవకాశాలు లేవని, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు లాభపడకుండా టిడిపి, బిజెపికి సహకరించాలని బిజెపి నేతలు పవన్‌కు సూచిస్తున్నారు.
సీమాంధ్రలో విశాఖ, కాకినాడ, నర్సాపురం, విజయవాడ, తిరుపతి, తెలంగాణలో సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, కరీంనగర్, వరంగల్ ఎంపీ స్థానాలపై బిజెపి దృష్టి సారించింది. తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అంతగా విజయావకాశాలు లేవని, ఈ నేపథ్యంలో టిడిపి, జనసేనలతో అవగాహన కుదిరితే తమకు విజయావకాశాలు మెరుగవుతాయని బిజెపి అంచనా వేస్తోంది. పవన్ కళ్యాణ్ బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా, పవన్ మద్దతుతో సీమాంధ్రలో జగన్ పార్టీని, తెలంగాణలో తెరాసను దెబ్బతీయవచ్చునని బిజెపి, టిడిపిలు భావిస్తున్నాయంటున్నారు.












Click it and Unblock the Notifications