'చంద్రబాబు కొత్త సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో': రా.. రమ్మని పవన్‌కు నేతల ఆహ్వానం
అనంతపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం పర్యటనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అనంత వెంకట్రామి రెడ్డి విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహంలో భాగంగానే ఆయన పర్యటిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన సోమవారం మాట్లాడారు.

సత్యసాయి జిల్లా కోసం డిమాండ్, ఫ్యాన్స్ హంగామా-అపశృతి: 'పవన్! హోదాపై మాట్లాడవేం'
చంద్రబాబు తీస్తున్న కొత్త సినిమా అనంతపురంలో ప్రారంభమయిందని ఎద్దేవా చేశారు. కొత్త సినిమాకు పవన్ కళ్యాణ్ హీరో అన్నారు. జగన్ యాత్ర గురించి మాట్లాడుతూ.. ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రజాసంకల్ప యాత్ర చేపట్టారన్నారు. జగన్ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా అనంతపురంలో సోమవారం వాక్ విత్ జగనన్న నిర్వహించారు.

గాలికి వదిలేశారు
రెండో రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి గడియార స్తంభం కూడలి, ఎన్టీఆర్, శ్రీకంఠం కూడలి, రాజు రోడ్డు మీదుగా వైయస్సార్ విగ్రహం వరకు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామి రెడ్డి మాట్లాడారు. అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేశారన్నారు. ఆత్మహత్యలు ఆపడానికి నేనున్నాననే భరోసా కల్పించేందుకే జగన్ పాదయాత్ర చేపట్టారన్నారు. రాష్ట్ర ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడం లేదన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో బరిలో జనసేన
అనంతపురంలో సోమవారం పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాదయాత్ర ముగిసింది. మూడో రోజు ధర్మవరం, బాలకృష్ణ ఇలాకా హిందూపురం నియోజకవర్గాల్లో పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన బరిలో నిలుస్తుందనీ, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ధర్మవరంలో చేనేత సదస్సులో, హిందూపురంలో జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ ప్రసంగించారు. ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీ, వైసీపీ స్పష్టమైన వైఖరి ప్రకటించాలన్నారు.

పెద్దలతో మాట్లాడుతా
రాజధాని విషయంలో రాయలసీమకు సరైన ప్రాధాన్యం కల్పించడం లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. సీమ ప్రజల ఇబ్బందులు తనకు తెలుసనీ, ప్రభుత్వాలు వీరికి న్యాయం చేయాలన్నారు. రాయలసీమకు అండగా, కోనసీమకు బాసటగా నిలుస్తానన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు ఒత్తిడి తేవాలని హిందూపురంలో లాయర్లు పవన్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ విషయమై పెద్దలతో మాట్లాడుతానని వారికి హామీ ఇచ్చారు.

నా గొంతు నుంచి రక్తం వచ్చేంతగా
గత పది రోజులుగా మాట్లాడి మాట్లాడి తన గొంతు తడి ఆరిపోయిందని పవన్ ధర్మవరం చేనేత కార్మికుల సమావేశంలో అన్నారు. తన గొంతు నుంచి రక్తం వచ్చేంతగా దగ్గుతున్నానని చెప్పారు. జనసేన పార్టీ చేనేత కార్మికులకు అండగా ఉంటుందని, తాను మనస్ఫూర్తిగా, చిత్తశుద్ధిగా ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసమే తొలి దశ పర్యటన చేసినట్లు చెప్పారు.

ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీల ఆహ్వానం
ధర్మవరానికి చేనేత బ్రాండ్ ను తెచ్చే బాధ్యత తనదేనని, నేతన్న కన్నీరు తుడిచి, వారికి అండగా ఉంటానని పవన్ చెప్పారు. విదేశాల్లో వృత్తి కళాకారులకు ప్రాధాన్యత ఎంతో ఉందని, విదేశాల నుంచి డిజైన్లు తెచ్చి, వాటిని ఇక్కడ నేయాలని సూచించారు. తన పర్యటనకు ప్రజల నుంచి ఎంతో స్పందన వచ్చిందని, చాలామంది ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు తమ ఇంటికి రావాలని ఆహ్వానించారని, సమయాభావం వల్ల వెళ్లలేకపోయానని అన్నారు. కాగా, మాట్లాడుతున్న సమయంలో పవన్ పలుమార్లు దగ్గారు. కార్యకర్తలు మంచినీళ్లు అందించారు.