జగన్ సీబీఐ దత్తపుత్రుడా ? వైసీపీ చర్లపల్లి షటిల్ టీమ్-అనంతలో పవన్ ఘాటు కౌంటర్
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల ఓట్లు చీలిపోనివ్వనంటూ వ్యాఖ్యానించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఆయన్ను చంద్రబాబు దత్తపుత్రుడంటూ విమర్శలకు దిగుతున్నారు. వీటిపై ఇవాళ అనంతపురంలో పవన్ ఘాటు కౌంటర్ ఇచ్చారు.
తాను ప్రజల గురించి మాట్లాడుతుంటే వైసీపీ నేతలు వ్యక్తిగత దాడి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తాను విదేశాల్లో చదువుకుని రాలేదని, ప్రకాశం జిల్లా చీరాలలో చదువుకున్నానని గుర్తుచేశారు. వైసీపీ నేతలు మాట్లాడే భాష కంటే మంచి భాషే తనకు వచ్చన్నారు. అనంతపురం జిల్లా నుంచి వైసీపీ నేతల్ని హెచ్చరిస్తున్నా అంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తనను సీబీఎన్ (చంద్రబాబు)కు దత్తపుత్రుడంటున్నారని, మీరు సీబీఐకి దత్తపుత్తులంటూ జగన్ కు చురకలు అంటించారు. అలాగే జనసేనను టీడీపీ బీ టీమ్ అంటున్నారని, అంటే మిమ్మల్ని చర్లపల్లి జైలు షటిల్ టీమ్ అనాల్సి వస్తుందంటూ వైసీపీకి కౌంటర్ ఇచ్చారు. మీరు ఆర్దిక నేరాలు చేసి జైల్లో కూర్చున్నవారంటూ సీఎం జగన్ సహా వైసీపీ నేతలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. తమకు నీతులు చెప్పే హక్కు వైసీపీ నేతలకు లేదన్నారు.
చనిపోయిన కౌలు రైతు కుటుంబానికి 7 లక్షలు ఇవ్వాల్సిందేనని పవన్ డిమాండ్ చేశారు. అన్ని జిల్లాలు తిరిగిచనిపోయిన ప్రతీ కౌలు రైతు కుటుంబానికి తాము లక్ష రూపాయలు ఇస్తామన్నారు. అలాగే జిల్లాల వారీగా సంక్షేమ నిధి ఏర్పాటు చేసి సగం తాను ఇచ్చేలా, మిగతాది జిల్లాల్లో జనసేన నేతలు ఇచ్చేలా చేస్తామని పవన్ వెల్లడించారు. ఈ నిధి నుంచి చనిపోయిన కౌలు రైతు కుటుంబాల్లో పిల్లల విద్యకు సాయం చేస్తామన్నారు. తాము లేని సమస్యను సృష్టించబోమని, ఉన్న సమస్య పరిష్కరించాలని మాత్రమే కోరుతున్నామని వైసీపీ సర్కార్ కు పవన్ తెలిపారు. వైసీపీ చెప్పిన ధరల స్ధిరీకరణ నిధి ఏమైపోయిందో తెలియడం లేదన్నారు.