జగన్ తిరుపతి ప్రసాదం తింటారా: జగన్ రెడ్డి..అని కాకుండా ఎలా పిలవాలి: పవన్ కళ్యాణ్ ఫైర్..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ముఖ్యమంత్రి జగన్ పైన ఫైర్ అయ్యారు. తాము విడిపోయి ఎవరికి వాళ్లుగా బతుకుతున్నామని.. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటానికి ఇంగిత జ్ఞానం ఉండాలని
ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను తెలుగు భాషను విస్మరిస్తే మట్టిలో కలిసిపోతారని ఆవేశంతో అనలేదని..ఉద్దేశ పూర్వంగానే అన్నానని స్పష్టం చేసారు. తన మాటలను తప్పు బడుతున్న మంత్రి బొత్సా ముందుగా తమ నేతకు ఎలా మాట్లాడాలో చెప్పాలని సూచించారు.
కేంద్ర విధానానికి విరుద్ధంగా జగన్ సర్కారు: 'కేజీ-పీజీ ఫ్రీ’ అంటూ పవన్ కళ్యాణ్
తామంతా ఒకే జాతి అన్న భావన తెలంగాణలో ఉందని.. ఆంధ్రాలో ఆ భావన లేదు, కులాలవారీగా విడిపోయారన్నారు. వైసీపీలో ఎంతో మంది మేధావులు ఉన్నారని.. తెలుగు భాషను చంపేస్తామంటే ఎలా ఊరుకుంటారని ప్రశ్నించారు. భాషా సంస్కృతులను కాపాడలేకపోతే మట్టికొట్టుకుపోతారన్నారు. ఇంగ్లీష్ రాలేదని డబ్బు సంపాదించకుండా ఉన్నారా అని పవన్ ప్రశ్నించారు. ఏ కులంలో పుట్టాలి..ఏ మతంలో పుట్టాలి అనేది మన చేతుల్లో లేదని..కానీ, ఎలా ప్రవర్తించాలనేది మన చేతుల్లో ఉంటుందన్నారు.

జగన్ రెడ్డి అని పిలవటంలో తప్పేంటి..
జగన్ రెడ్డి అని తాను పిలవటంలో తప్పేంటని పవన్ ప్రశ్నించారు. నేషనల్ మీడియా తో పాటుగా అనేక మంది జగన్ రెడ్డి అనే పిలుస్తున్నారని చెప్పుకొచ్చారు. 151 మంది ఎమ్మెల్యేలు చర్చించి జగన్ ను ఏమని పిలవాలో చెప్పాలని సూచించారు. తనను పవన్ నాయుడు అని పిలవటం పైన తనకు నవ్వు వస్తుందన్నారు. బొత్సా సత్యనారాయణ ను బొత్సా నాయుడు అని అనలేమంటూ వ్యాఖ్యానించారు. తనకు లేని పేర్లు తగిలించవద్దని కోరారు. పేరులో లేని పదాలను తనకు ఆపాదించటం మానుకోవాలని సూచించారు. విడిపోయిన వారి గురించి మాట్లాడటానికి ఇంగిత జ్ఞానం ఉండాలని ..అదే మీ ఇంగ్లీషులో చెప్పాలంటే కామన్ సెన్స్ ఉండాలని పవన్ వ్యాఖ్యానించారు.
తిరుపతి ప్రసాదం తింటారా..
జగన్ రెడ్డి క్రిష్టియన్ మతాన్ని విశ్వసిస్తారాని..అందులో దాచుకోవాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించారు. ఆయన తిరుపతి ప్రసాదం తింటారో లేదో తెలియదు కానీ.. అమిత్ షా కు ఇవ్వటానికి ఉపయోగపడుతుందని పవన్ కీలక వ్యాఖ్య చేసారు. తెలంగాణలో ఉన్నట్లు ఒకే జాతి అనే భావన ఏపీలో లేదని..ఇక్కడ కులాల వారీగా వ్యవహరిస్తున్నారని కామెంట్ చేసారు. అవినీతి రహిత రాజకీయం అంటే అందరూ నవ్వుతారని..అయినా మార్పు కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని పవన్ చెప్పుకొచ్చారు. తమ పార్టీ భాషను గౌరవిస్తుందని స్పష్టం చేసారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!