చిరంజీవిపైనే కుట్రలు, పోతే నా ప్రాణాలు పోతాయి.. అందుకే మళ్లీ వచ్చా: పవన్

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం తన విశాఖపట్నం పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను యోగా మార్గాన్నే వదిలేశానని, ఇక తనకు పదవులు ఎందుకని వ్యాఖ్యానించారు. తన సోదరుడు చిరంజీవి కుటుంబంపై రాజకీయ కుట్ర జరిగిందన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ అధికార పార్టీని ఏకిపారేస్తున్నారు.
ఎన్నికలకు ముందు చంద్రబాబు కీలక నిర్ణయం, వారికి షాకిస్తారా?
ఏదో ఆశించి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజల కోసమే వచ్చానని చెప్పారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు తనను కలిసినప్పుడు ఇదే విషయాన్ని చెప్పానని అన్నారు. తనకు ఏం కావాలో చెప్పాలని వారు అడిగారని, కానీ తనకు ఏదీ వద్దని వారితో అన్నానని తెలిపారు. ప్రజలకు మంచి జరిగితే చాలనని చెప్పానని గుర్తు చేసుకున్నారు.
చిరంజీవి తర్వాత జగన్ సాహసం!: న్యూజిలాండ్‌లో బంగీ జంప్ (వీడియో)

రిస్క్ నాది, పోతే నా ప్రాణాలు పోతాయి
విశాఖపట్నంకు చెందిన పలువురు నాయకులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. తాను చాలా ఆలోచించి రాజకీయాలలోకి వచ్చానని చెప్పారు. రిస్క్ నాది అని, పోతే తన ప్రాణాలు పోతాయని, తాను రాజకీయాల్లోకి వచ్చినందుకు ఏ కోరికలు పెట్టుకోలేదని చెప్పారు.

ఆ ముక్తి ఎందుకు అనిపించింది
తాను భగవన్మార్గాన్ని వదిలి వచ్చినవాడినని పవన్ చెప్పారు. యోగమార్గాన్ని వదిలి వచ్చిన వాడినని తెలిపారు. ముక్తి లభించవచ్చును కానీ, ప్రజలు ఇబ్బందులతో ఏడుస్తుంటే, ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటే అలాంటి ఆ ముక్తి ఎందుకు అనిపించిందని వ్యాఖ్యానించారు. అలాంటి ముక్తి తనకు అవసరం లేదనిపించిందన్నారు. పదవులు కూడా అవసరం లేదన్నారు.

చిరంజీవి పైనే కుట్రలు, వారి సంగతేమిటని ఆలోచించా
తన సోదరుడు చిరంజీవి కుటుంబంపై కూడా రాజకీయ కుట్ర జరిగిందని పవన్ వ్యాఖ్యానించారు. ఆ సమయంలోను ఇవే ఆలోచనలు వచ్చాయని జనసేనాని అన్నారు. అలాంటి పెద్దస్థాయి వ్యక్తి పైన కుట్రలు జరుగుతుంటే సామాన్యుల సంగతి ఏమిటని నన్ను నేను ప్రశ్నించుకున్నానని చెప్పారు. అలాంటి సమయంలో రాజకీయాలపై విసుగు వచ్చిందన్నారు.

అందుకే మళ్లీ రాజకీయాల్లోకి వచ్చా
యోగమార్గంలో దేవుడిని చేరడం వల్ల సమస్యలు తీరవని తనకు అనిపించిందని పవన్ అన్నారు. తనకు ఒక్కడికి ముక్తి వస్తే సరిపోదని భావించానని, అందరూ ఆకలితో బాధపడుతుంటే, ఎందరో ఏడుస్తుంటే నాకు అలాంటి ముక్తి అవసరం లేదనిపించిందని, అందుకే మళ్లీ రాజకీయ బాట పట్టానని చెప్పారు.