pawan kalyan janasena alliance bjp loss janasena party AP ap bandh oppose support silent పవన్ కళ్యాణ్ జనసేన కూటమి బిజెపి నష్టం జనసేన పార్టీ ఏపీ ఏపీ బంద్ మద్దతు Visakhapatnam Steel Plant politics
విశాఖ స్టీల్ ప్లాంట్ ఆందోళనలపై నోరెత్తని పవన్ కళ్యాణ్ .. బీజేపీతో పొత్తు జనసేనకు నష్టమేనా ?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలనే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనలు మిన్ను ముడుతున్న విషయం తెలిసిందే. ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏపీ బంద్ కొనసాగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు కార్మికుల పక్షాన నిలిచి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం బంద్ కు మద్దతు తెలిపినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బంద్ విషయంలో నోరెత్తలేదు. కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తమ వైఖరిని కూడా స్పష్టం చేయలేదు.

బీజేపీతో పొత్తుతో ఆచి తూచి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకు సాగుతున్న జనసేన పార్టీకి, బీజేపీతో పొత్తు లాభించకపోగా, పార్టీకి నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏ సమస్య ఉన్నా తన గొంతు వినిపించేవాడు . బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్ ఆచి తూచి మాట్లాడాల్సి వస్తుంది . బీజేపీతో పొత్తు పెట్టుకున్న కర్మానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్మికులకు అండగా తమ స్టాండ్ ను ప్రకటించ లేకపోయారు .

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మౌనంగా ఉన్న జనసేనాని
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఢిల్లీ దాకా వెళ్లి కేంద్ర పెద్దలను విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని కోరిన పవన్ కళ్యాణ్ , వైయస్ జగన్మోహన్ రెడ్డి కి తెలిసే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. ఇక ఆ తర్వాత నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక్క ప్రకటన కూడా చేయలేదు.
తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతున్నా బంద్ పై మాట్లాడే పరిస్థితి, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దు అని తమ స్టాండ్ ను వినిపించే పరిస్థితి కనిపించలేదు. అందుకు కారణం జనసేన కు బీజేపీతో ఉన్న పొత్తు .

బీజేపీతో పొత్తు వల్ల జనసేనకు ఇబ్బందులు .. అప్పట్లో రాజధాని విషయంలో
మరోపక్క బిజెపి నేతలు సైతం కేంద్ర పెద్దల నిర్ణయంతో ఒకింత అసహనంతో ఉన్న పరిస్థితుల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు, కేంద్రంతో మాట్లాడి రాజధాని తరలింపు ఆపడానికి ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత కేంద్రానికి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేసినప్పటికీ, మూడు రాజధానులు విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కేంద్ర తేల్చిచెప్పింది. అప్పుడే పవన్ కళ్యాణ్ మాట కేంద్ర పెద్దల వద్ద చెల్లలేదనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోచర్చ జరిగింది .

ఢిల్లీ వెళ్లి విజ్ఞప్తి చేసినా చెల్లని పవన్ మాట .. రాష్ట్రంలో జనసేన కొంప ముంచుతున్న పొత్తు
ఇక ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కూడా హడావిడిగా ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ కేంద్ర పెద్దలను కలిసిన తర్వాత చేసిన ప్రకటన మినహాయించి ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క పవన్ కళ్యాణ్ కు మాత్రమే కాకుండా, జనసేన పార్టీకి కూడా ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో సైతం జనసేన, బీజేపీ పార్టీలపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.