జగన్ రెడ్డి! కాపులపై కపటప్రేమ ఎందుకు? రిజర్వేషన్లకు అప్పుడే మంగళం: పవన్ కళ్యాణ్
అమరావతి: 'కాపు రిజర్వేషన్.. రాజకీయ స్వార్థపరుల గుప్పెట్లో నలిగిపోతున్న కోట్లాది మంది కోరిక. ఈ కోరికను ఓట్ల సాధనకు వేదికగా, ఎండమావిగా మార్చేశాయి అవకాశవాద రాజకీయ శక్తులు' అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారును ఉద్దేశించి ధ్వజమెత్తారు.

అప్పుడు తొలిసారి కాపుల రిజర్వేషన్లకు మంగళం..
బ్రిటిష్ వారి పరిపాలనలోనే వెనుకబడిన కులాలుగా ఉన్న కాపుల్ని 1956లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి బి.సి.జాబితా నుంచి తొలగించి తొలిసారి కాపుల రిజర్వేషన్లకు మంగళం పాడేశారు. ఆ తరువాత అణగారిన వర్గాలనుంచి వచ్చి సర్వజనుల కష్టసుఖాలు తెలిసిన శ్రీ దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టి 1961లో కాపులకు తిరిగి రిజర్వేషన్లను ప్రదానం చేస్తే ఆ తరవాత కాలంలో ముఖ్యమంత్రి అయిన శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కాపుల రిజర్వేషన్లను మరోసారి తొలగించివేశారన్నారు పవన్.

కాపులపై 56ఏళ్లుగా కాపులపై కపట ప్రేమే..
అప్పటి నుంచి అంటే గత 56 ఏళ్లుగా కాపుల పట్ల కపట ప్రేమను నటిస్తూ ఓట్లు దండుకుని అధికారంలోకి రావడం పదవీ లాలసపరులకు రాజకీయ క్రీడగా మారిపోయింది. ప్రస్తుతం రిజర్వేషన్లు అందుకుంటున్న వర్గాలవారి ప్రయోజనాలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా రాజ్యాంగపరంగా ఉన్న అవకాశాలను ఉపయోగించి మాకు రిజర్వేషన్ అందే విధంగా తమను వెనుకబడిన జాబితాలో చేర్చమని కాపులు అడిగినప్పుడల్లా ముందుంచి సై.. అంటూ వెనక నుంచి నై.. అంటూ పరోక్షంగా ఇతర వర్గాలను రెచ్చగొడుతూ కాపుల నోట్లో మట్టి గొడుతున్నారు. కాపులు ఆర్ధికంగా బలపడడం ఇష్టం లేని కొన్ని వర్గాల వారు కాపులకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుపడుతున్నారు. కుటిల రాజకీయాలతో పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు జనసేనాని.

టీడీపీ, వైసీపీలవి కబుర్లే..
కాపులను బి.సి. జాబితాలో చేర్చుతామని ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసి, అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న తరువాత వారు చేసిన అరకొర ప్రయత్నాలపై కాపు పెద్దలు ఎవరూ సంతృప్తిగా లేరు. లక్ష్యాన్ని సాధించే రీతిలో వారి ప్రయత్నాలు లేకపోవడమే అందుకు కారణం. 2014 ఎన్నికల సమయంలో అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వై.ఎస్.ఆర్.సి.పి.కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని కబుర్లు చెప్పారు. కాపుల స్థితి గతులను అంచనావేయడానికి మంజునాథ కమిషన్ ను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాపులు వెనకబడిన జాబితాలోకి చేర్చడానికి అర్హులేనని 2017 లో మంజునాథ కమిషన్ చెప్పిన తరువాత కాపులను బి.సి.జాబితాలోని "ఎఫ్" కేటగిరిలో చేర్చి, అయిదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభ, శాసనమండలిలో ఒక బిల్లును ఆమోదించారు. ఈ రిజర్వేషన్లు కేవలం విద్య, ఉద్యోగాలకు మాత్రమే. తదుపరి అనుమతి కోసం బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఈ విషయాన్నే కాపు పెద్దలు, మేధావులు తప్పు పడుతున్నారు. ఇది పార్లమెంట్లో అనుమతి పొంది చట్టంగా మారడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కేంద్రం దేశమంతటిని దృష్టిలో పెట్టుకునే ఆలోచన చేస్తుంది. దీంతో కాలాతీతం అయిపోతుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. .

చంద్రబాబు అటకెక్కించారు..
మహారాష్ట్రలో మరాఠా కులస్తులకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం ఆమోదించి అమలుకు ఆదేశాలు జారీచేసింది. అయితే దీనిని 12 శాతానికి తగ్గిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఆమోదం తెలిపింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని గట్టి సంకల్పం ఉండి వుంటే మహారాష్ట్ర చేసిన విధంగా చేసేవారని, కానీ అయన ఆలా చేయకుండా కేంద్రానికి పంపి కాపుల కోరికను పరోక్షంగా అటక ఎక్కించేసారని కాపులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జగన్ రెడ్డి కాపుల రిజర్వేషన్లను తుంగలో తొక్కారు..
దేశవ్యాప్తంగా రిజర్వేషన్ డిమాండ్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన అగ్రవర్ణాలవారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా చట్టం చేసింది. రాష్ట్రాల విచక్షణాధికారం వుపయోగించి అర్హులయిన కులాలకు ఈ పది శాతాన్ని కేటాయించుకోవచ్చు.
ఈ పరిస్థితిలో కాపులకు ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవడానికి ఈ.బి.సి.కోటా లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లను చంద్రబాబు గారు ప్రభుత్వం కేటాయించింది. ఆపై ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందడంతో జగన్ రెడ్డి పగ్గాలు చేపట్టారు. వచ్చిందే తడవుగా కాపులకు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లను తుంగలో తొక్కారు. ఇటువంటి కేటాయింపులు కోర్టులలో నిలబడవు అని సెలవిచ్చారు. అసలు రాష్ట్రంలో ఆర్ధికంగా వెనుకబడిన అగ్రవర్ణాలవారికి రిజర్వేషన్లు అమలు చేయకుండా భీష్మించారని పవన్ మండిపడ్డారు.

జగన్ రెడ్డిది కాపులపై మొసలి కన్నీరే..
2014 ఎన్నికల సమయం నుంచి పాదయాత్ర వరకు కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని జపం చేసిన జగన్, యాత్ర మధ్యలో తమ ఎన్నికల వ్యూహాకర్తల బోధనతో కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేదిలేదని ప్రకటించేశారు. కాపుల ఉద్దరణ అని గొంతు చించుకున్న వై.సి.పి.లోని కొందరు నాయకులు వేరేదారి లేక జగన్ రెడ్డి గారి దారిలోనే పయనిస్తూ కాపుల సంక్షేమమే ధ్యేయమని ఇప్పటికీ మొసలి కన్నీరు కారుస్తున్నారు. కాపుల నాయకులు నాతోనూ, జనసేన పార్టీలోని ఇతర నాయకులతో మాట్లాడుతున్నారు. అర్ధ శతాబ్దానికి పైగా కోరుతున్న తమ రిజర్వేషన్ గురించి దృష్టి సారించి, ప్రజా వేదికలపై మాట్లాడమని అడుగుతున్నారు. జనసేన ఎన్నికల ప్రణాళికలో అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్స్ కల్పిస్తామని మాట ఇచ్చిన సంగతిని నేను వారికి గుర్తు చేశాను. కాపులపై ప్రేమతో 13 నెలల్లో రూ.4770 కోట్లను ఖర్చు చేశామని చెబుతున్న శ్రీ జగన్ రెడ్డి గారు కాపులు కోరుతున్న రిజర్వేషన్లను ఎందుకు పునరుద్ధరించడం లేదు? "మమ్మల్ని ఎవరు ఉద్దరించనక్కరలేదు. మా ఆత్మాభిమానం దెబ్బ తినేలా ఎవరూ జాలి చూపనక్కరలేదు. మాకు గతంలో ఉన్న రిజర్వేషన్ హక్కుని పునరుద్ధరించమని అడుగుతున్నాము" అని అంటున్న కాపులకు ఏమని సమాధానం చెబుతారు? ప్రస్తుతం రిజర్వేషన్లు అమలవుతున్న ఎస్.సి., ఎస్.టి., బి.సి.లకు ఎటువంటి నష్టం కలగకుండా కాపులకు రిజర్వేషన్ హక్కు పునరుద్ధరించాలని జనసేన డిమాండ్ చేస్తోందన్నారు పవన్ కళ్యాణ్.