భయపెట్టడం కాదు: ప్రభుత్వాలకు పవన్ కళ్యాణ్, మీడియాకు థ్యాంక్స్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి సామాజిక మాధ్యమం ద్వారా ప్రభుత్వాలకు హితవు పలికారు. అభివృద్ధి పేరుతో సామాన్యుడిని భయపెట్టకూడదని ఆయన ట్విట్టర్‌లో శనివారం పేర్కొన్నారు. అభివృద్ధి అంటే సామాన్యుడిని భాగస్వామిని చేయడమన్నారు. అతనిని భయపెట్టడం కాదని పేర్కొన్నారు.
ప్రాజెక్టులు ప్రారంభించడంలో ఉన్న ఉత్సాహం, పునరావాసం కల్పించడంలో ఏ ప్రభుత్వం చూపలేదన్నారు. మానవీయ కోణంతో కూడిన అభివృద్ధి కావాలన్నదే జనసేన ఆకాంక్ష అన్నారు.
నాటి హీరాకుడ్ నుండి నేటి పోలవరం వరకు... అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల సామాన్యులు, ఆదివాసీలు నిర్వాసితులుగా మిగిలిపోయారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు ప్రారంభించడంలో ఉన్న ఉత్సాహం పునరావాసం కల్పించడంలో ఏ ప్రభుత్వమూ చూపలేదన్నారు.

మానవీయ కోణంతో కూడిన అభివృద్ధే జనసేన కోరుకుంటుందని చెప్పారు. ఊళ్ల కోసం రోడ్లు వేయడం చూశాం కానీ, రోడ్ల కోసం ఊళ్లు తీసెయ్యడం చూడలేదంటూ... హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన ఓ పేద నిర్వాసితుడు చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.
జనసేన పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలకు, అభిమానులకు.. ఇలా ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణాత్మక విమర్శలతో తమ పార్టీకి మీడియా అన్ని విధాలా సహకరించినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
కాగా, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత.. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ - టీడీపీకి కూటమికి మద్దతిచ్చారు. ఈ రెండు పార్టీలు విజయం సాధించిన అనంతరం... ఆయన మళ్లీ సినిమాల్లో బిజీగా మారారు. ఇటీవలే ఏపీలో రాజధాని, ఏపీకి ప్రత్యేక హోదా పైన బయటకు వచ్చారు.












Click it and Unblock the Notifications