వారిని తిట్టవచ్చు కానీ, నా కొడుకు బాధపెడితే, జగన్ని అడుగుతా: పవన్ కళ్యాణ్
విశాఖ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం హార్వార్డ్ విశ్వవిద్యాలయం నిపుణులతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఉద్ధానం సమస్యను తాను రాజకీయం చేయదల్చుకోలేదని చెప్పారు.
ఉద్ధానం కిడ్నీ సమస్యకు కారణాలివీ!
నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యతో ఎంతో కాలంగా వేధిస్తోందని, దాని పట్ల చిత్తశుద్ధితో స్పందిస్తే విమర్శలు చేశారని గుర్తు చేశారు. ప్రజల కోసం పనిచేయడానికి ఎవరు నాతో కలిసి వచ్చినా ఆహ్వానిస్తానని చెప్పారు. తన ప్రయత్నం రాజకీయాల కోసం కాదన్నారు.

నేను వారిని తిట్టవచ్చు
ఉద్ధానం సమస్యను రాజకీయం చేయదల్చుకోలేదని పవన్ చెప్పారు. అందుకే గత ప్రభుత్వాల వల్ల ఇది జరిగిందని చెప్పవచ్చునని, స్థానిక నాయకులను తిట్టవచ్చునని చెప్పారు. కానీ తాను ప్రజల కోసం పని చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. తనకు ఉన్న చిత్తశుద్ధిని ఎవరు శంకించినా సరికాదన్నారు.

ఎవరూ పోరాడటం లేదు, నేను వచ్చా
ప్రాంతీయం కోసం పోరాటం చేసేవారు, కులం కోసం పోరాటం చేసేవారు, జాతి కోసం పోరాటం చేసేవారు ఉన్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. మానవత్వం మంటకలుస్తుందని తాను పోరాటం చేస్తున్నానని చెప్పారు. మానవత్వం కోసం పోరాటం చేయాలనే తపన ఎవరికీ లేకపోవడమే తన బాధ అన్నారు. ఎంత పెద్ద ప్రయాణం అయినా చిన్న అడుగుతోనే ప్రారంభమవుతుందని చెప్పారు.

తొలి అడుగు పడింది
ఉద్ధానం సమస్య పరిష్కారానికి తొలి అడుగు పడిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. కులం, మతం కోసం కాదని.. తాను మానవత్వం కోసం పోరాడే వ్యక్తిని అన్నారు. ఉద్ధానం వచ్చినందుకు హార్వార్డ్ నిపుణులకు, వైద్యులకు ధన్యవాదాలు అన్నారు. ఏ అంశాన్ని కూడా ఎవరూ రాజకీయం చేయవద్దన్నారు. సమస్య పరిష్కారం కోసం అవసరమైతే జగన్ మద్దతు కోరుతానని చెప్పారు.

నా కొడుక్కు బాధ వస్తే
నా కొడుక్కు బాద వస్తే ఏం చేస్తానని ఆలోచించే, తాను ఈ సమస్యపై పోరాటానికి ముందుకు వచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు. గత పాలకులు ఉద్ధానం సమస్యను పరిష్కరించలేదన్నారు. మీ (ప్రజల) సమస్య కోసం నేను ముందడుగు వేస్తానని చెప్పారు. ఎన్నో సమస్యలు పరిష్కరించినప్పుడు ఉద్ధానంను ఎందుకు పరిష్కరించలేమన్నారు.

నేను పోరాడుతా
ఉద్ధానం బాధితులకు న్యాయం చేసిన పక్షంలో అందరూ సంతోషిస్తారని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలకు మంచి జరుగుతుందన్నప్పుడు నేను పోరాడుతానని చెప్పారు. థ్యాంక్యూ, జైహింద్ అంటూ పవన్ తన ప్రసంగాన్ని ముగించారు.