చంద్రశేఖర్‌కు పవన్ కళ్యాణ్ పాదాభివందనం: ఎందుకంటే..?
అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు తనకు పెద్దల పట్ల ఉన్న గౌరవాన్ని తరచూ చాటుకుంటూనే ఉంటారు. తాజాగా, ఉద్దానం ప్రజల కిడ్నీ బాధలను రూపుమాపేందుకు తనవంతుగా కృషి చేస్తున్న సీనియర్ డాక్టర్ చంద్రశేఖర్‌కు పాదాభివందనం చేసి మరోసారి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు పవన్.

పాదాభివందనం
కిడ్నీ సమస్య పరిష్కారానికి తన వంతు సాయం చేయడానికి ముందుకొచ్చిన సీనియర్ డాక్టర్ చంద్రశేఖర్‌కు ఈ సందర్భంగా పవన్ పాదాభివందనం చేశారు. ఆయనకు కృతజ్ఢత తెలిపేందుకు ఆయన ఇలా చేశారు. ఈ సమయంలో అభిమానులు, ప్రజలు హర్షధ్వానాలు చేశారు. కాగా, హార్వర్డ్ నుంచి వచ్చిన మరో తెలుగు డాక్టర్ వెంకట్ సుబ్బిశెట్టి ఇక్కడి పరిశోధనలకు అండగా నిలుస్తున్నారని పవన్ ప్రశంసించారు.


వైద్యులతో...
ఉద్దానం కిడ్నీ సమస్యలపై అధ్యయనం చేయడానికి హార్వర్డ్ నుంచి వచ్చిన డాక్టర్ జోసెఫ్ వి బోన్‌వెంట్రే మాట్లాడుతూ.. అక్కడ నొప్పి నివారణ మందులు అధికంగా వినియోగించడం, తాగునీటిలో భార లోహాలు, మోతాదుకు మించిన ఎరువుల వినియోగం, జన్యుపరమైన లోపాలు తమ దృష్టికి వచ్చాయని వివరించారు.
ఎక్కువగా 20 ఏళ్లలోపు పిల్లలే కిడ్నీ వ్యాధులకు గురువుతున్నట్లు గమనించినట్లు, వివాహితులైన ఏడుగురు మహిళలను పరిశీలిస్తే.. ఆ ఏడుగురూ కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నట్లు తేలిందని జోసెఫ్ చెప్పారు. వాతావరణ కాలుష్యం కూడా కొంత కారణమని భావిస్తున్నామని, ఈ సమస్యలపై సేవా సంస్థలు దృష్టి సారించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యలకు పరిష్కారం చూపాలంటే అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కిడ్నీ రీసెర్చ్ అండ్ కేర్ సెంటర్ ఒకటి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని డాక్టర్ జోసెఫ్ తెలిపారు. బయో బ్యాంకింగ్, కిడ్నీ మార్పిడి వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు.

పవన్ అభినందన
కాగా, కిడ్నీ సమస్యతో బాధ పడుతూ, తల్లిదండ్రులు చనిపోగా అనాథలైన ఇద్దరు బాలలను జనసేన సభ్యులు దత్తత తీసుకున్నారని తెలిసి వారిని పవన్‌కల్యాణ్ అభినందించారు.

సీఎం కార్యాలయానికి పవన్
ఉద్దానం కిడ్నీ సమస్యపై సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సోమవారం భేటీ కానున్న విషయం తెలిసిందే. ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధిగ్రస్ధుల సమస్యలపై చర్చించే నిమిత్తం.. ఉదయం పదిన్నర గంటలకు సచివాలయంలోని సీఎం కార్యాలయానికి వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలిసి పవన్ వచ్చారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఈ సమస్య పరిశీలనకు వచ్చిన వైద్య నిపుణులు, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఇతర వైద్యులు కూడా ఈ భేటీలో పాల్గొంటారు.