మతం పేరుతో రాజకీయాలా..? సోము వీర్రాజుపై పయ్యావుల కేశవ్ ఫైర్.. బీజేపీ విధానమా..?
సలాం కుటుంబం ఆత్మహత్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా వీర్రాజు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. వేధింపులకు గురయిన కుటుంబం గురించి మతం రంగు పులమడం సరికాదన్నారు.

రెచ్చగొడుతున్నారని కామెంట్..
సలాం ఫ్యామిలీ బలవన్మరణం కేసులో ముస్లింలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. ఇదీ కేవలం ఓట్ల కోసం మాత్రమే చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు సీఐ, హెడ్ కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేయడాన్ని వీర్రాజు తప్పుపట్టారు. వీర్రాజ్ కామెంట్స్‌పై కేశవ్ స్పందించారు. వీర్రాజు వ్యాఖ్యలు బాధ్యతారహిత్యం అని పేర్కొన్నారు. వేధింపులకు గురయిన కుటుంబంలో మతాన్ని చూస్తారా అని అడిగారు. బాధితుల రక్తపు మరకలపై రాజకీయ కోణాన్ని ప్రజలు సమర్థించరని స్పష్టంచేశారు.

గతంలో ఎన్నడూ చూడలేదు..
మతం పేరుతో కామెంట్స్ చేసి సోము వీర్రాజు స్థాయిని మరింత దిగజార్చుకున్నారని పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాష్ట్రంలో ఇలాంటి రాజకీయ పోకడలు గతంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు. అయితే వీర్రాజు వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాలని పయ్యావుల డిమాండ్ చేశారు. ఇవీ ఆయన వ్యక్తిగత కామెంట్స్ లేదంటే బీజేపీ విధానమో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ఏం జరిగిందంటే..
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ అరెస్ట్ చేశారు. దొంగతనం కేసుకు సంబంధించి పోలీసులు వేధించారని అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు పోలీసుల తీరును వివరిస్తూ సెల్పీ వీడియో షూట్ చేశాడు. కుటుంబం సామూహిక ఆత్మహత్య తర్వాత వీడియో పోలీసులకు లభించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరలయ్యింది. కేసుతో సంబంధం ఉన్న సీఐ, హెడ్ కానిస్టేబుల్‌ను విధుల నుంచి తప్పించారు. సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ను కోర్టులో హాజరుపరచగా నంద్యాల జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు వారం రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.