వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనంతపురం:చిరుతల దాడులతో...బెంబేలెత్తుతున్న జనం

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లా ఆలూరు పరిసరాల్లో చిరుతల సంచారం ఆనవాళ్లతో చుట్టుప్రక్కల ప్రాంతాల జనం భీతిల్లుపోతున్నారు. తాజాగా రెండు చిరుతలు ఓ జింకను చంపినట్లు తెలియడంతో స్థానికులు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయంతో వణికిపోతున్నారు.

అంతకుముందు కూడా చిరుతలు వివిధ జీవాలపై దాడి చేయడం, తాజాగా జింకపై రెండు చిరుతల దాడిని స్థానిక రైతులు ప్రత్యక్షంగా చూడటంతో గ్రామస్థులు ఇంటి నుంచి బైటకు రావాలంటే భయపడుతున్నారు. చిరుతల దాడి గురించి సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. చిరుతదాడిలో చనిపోయిన జింకను పోస్టుమార్టం చేయించి అనంతరం తగలబెట్టేశారు. వివరాల్లోకి వెళితే...

People Fear Of Cheetah Attacks In Ananthapur district

అనంతపురం జిల్లా కణేకల్లు మండలం ఆలూరు గ్రామం సమీపంలో బుధవారం ఉదయం యువరాజు అనే రైతు పొలంలో ఒక జింకను రెండు చిరుతలు వెంటాడి వేటాడి చంపి తిన్నాయి. ఈ చప్పుడుకు పక్క పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న రైతులు వై.నాగిరెడ్డి, రామాంజనేయులు అనే రైతులు పొలంలోకి చూడగా అక్కడ చిరుతలు జింకను చంపి తింటుండటంతో భయంతో వణికిపోయారు. ఈ విషయం తోటి రైతుల ద్వారా స్థానికులకు తెలిసి జనం పెద్ద సంఖ్యలో పోగవడంతో ఆ అలికిడికి చిరుతలు పక్కనే ఉన్న దానిమ్మ తోటలోకి వెళ్లిపోయాయి.

అనంతరం రైతు నాగిరెడ్డి ఈ సమాచారాన్ని ఫారెస్ట్, పోలీసుశాఖ అధికారులకు తెలియచేయగా కళ్యాణదుర్గం ఫారెస్ట్‌ సిబ్బందితో పాటు కణేకల్లు పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొన్నారు. చిరుతల దాడిలో చనిపోయిన జింకను పరిశీలించారు. వెటర్నరి డాక్టర్‌ నాగబాబు ఆ జింకకు పోస్టుమార్టం నిర్వహించగా అనంతరం దాన్ని తగులబెట్టేశారు. దాడి చేసిన రెండు చిరుతల్లో ఒకటి పెద్దగా మరోటి చిన్నగా ఉండటంతో అవి తల్లిబిడ్డలై ఉండొచ్చని ఫారెస్ట్‌ అధికారులు భావిస్తున్నారు.

చిరుతల దాడిని ప్రత్యక్షంగా చూసిన రైతులతో పాటు వారి ద్వారా ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఇక ఇంట్లో నుంచి బైటకురావడానికే భయపడుతున్నారు. ఇక చిరుతలు వేటాడిన ప్రాంతంలోకి పొలం పనులు ఉన్నా ఎవరూ వెళ్లడం లేదు. అవి అక్కడే పొదల్లో ఉండి ఉండొచ్చని ఏక్షణంలోనైనా బైటకు రావచ్చని ఆందోళన చెందుతున్నారు. రాత్రి పూట ఇళ్ల వద్దకు వస్తాయోమోనని భీతిల్లుతున్నారు.

పైగా ఇటీవలే ఈ గ్రామానికి సమీపంలోని మరో గ్రామం పెనకలపాడులో ఏనుగులు బీభత్సం సృష్టించి ఓ వ్యక్తిని చంపిన ఘటన జరగడం, ఆనందరావుపేటలో పెద్దసుంకన్న గొర్రెల మందపై చిరుతపులి దాడి చేసిందని గొర్రెల పెంపకందారులు తెలపడం, మరోవైపు చిన్నంపల్లిలో మరో చిరుతపులి దాడిలో గేదె దూడ మృతి చెందిన సంఘటన జరిగిందని తెలియడంతో చిరుతలు జనావాసాల్లోకి కూడా వచ్చేస్తున్నాయని జనం వణికిపోతున్నారు.
చిరుతల కదలికలను రాత్రంతా గమనించి ఫారెస్ట్‌కు వెళ్లేదాకా డ్రైవ్‌ చేస్తామని ఫారెస్ట్‌రేంజ్‌ ఆఫీసర్‌ రాంసింగ్‌ తెలిపారు.

అయితే చిరుతల సంచారంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ రాంసింగ్, డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ శ్రీపతినాయుడు ధైర్యం చెబుతున్నారు. రెండు లేదా మూడు రోజుల్లోగా చిరుతలు వాటి సొంత స్థలాలకు తిరిగివెళ్లే అవకాశముందని ఈలోపు రాత్రిపూట రైతులెవరూ పొలాల వద్దకు వెళ్లరాదని సూచించారు. ఒక వేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే గుంపులు, గుంపులుగా వెళ్లాలన్నారు. ఇళ్ల బయట, ఆరుబయట ఎవరూ పడుకోరాదన్నారు. చిరుతల సంచారంపై డీఎఫ్‌ఓకు సమాచారమిచ్చామని అవసరాన్ని బట్టి రెస్క్యూ టీమ్‌ను కూడా రంగంలో దింపుతామని చెప్పారు. చిరుతల కదలికలను రాత్రంతా గమనిస్తూ ఫారెస్ట్‌కు వెళ్లేదాకా డ్రైవ్‌ చేస్తామని ఫారెస్ట్‌రేంజ్‌ ఆఫీసర్‌ రాంసింగ్‌ హామీ ఇచ్చారు.

English summary
Estimates of four animals were died and severely injured after being attacked by a Cheetahs, in Ananthapur district. Since this incident, locals have shown grave concern and fear for their safety.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X