'టి' సమైక్యంపై జగన్ లాజిక్, మంత్రిగా హామీ (పిక్చర్స్)
ఖమ్మం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో సురాజ్యం రానున్నదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అన్నారు. ఖమ్మంలో భారీ జన సందోహం మధ్య బుధవారం జరిగిన జనభేరి సభలో ఆయన మాట్లాడారు.
నాడు వైయస్ పేద ప్రజలకు అవసరమైన విద్య, వైద్యంపై దృష్టి సారించి వాటిని ప్రజలకు చేరువ చేశారని కానీ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రజా సమస్యలను విస్మరించి ప్రజల భావోద్వేగాలతో రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.
ఒక మనిషిని తప్పించేందుకు గాని, దొంగ కేసులు బనాయించేందుకు గాని, జైలు పాలు చేసేందుకు గాని వెనుకాడని నీచ రాజకీయ నేతలను తరిమికొట్టాలన్నారు. తాను సమైక్యమనే నినాదంతోనే ముందుకెళ్ళానని, సమైక్యమంటే తెలంగాణ కూడా ఉంటుందనే విషయాన్ని గమనించాలని లాజిక్ లాగారు.

వైయస్ జగన్
రాష్ట్రాన్ని విభజించి సీమాంధ్రకు కనీసం రాజధానిని కూడా కేటాయించలేదని, అక్కడి ప్రజల సమస్యలు, అవసరాలు తీర్చేందుకు అవసరమైతే ఇక్కడి ప్రజలు సహకరిస్తారని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

హాజరైన జనం
ముఖ్యమంత్రి అయ్యేందుకు దేవుడి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్మార్గపు రాజకీయాలు చేసిన నాయకుల వైఖరిని ఎండగట్టారు. తెలుగు మాట్లాడుతూ తెలుగుజాతిగా ఉన్న ప్రజల ప్రాంతాలను విడగొట్టినంతమాత్రాన మనసులు విడిపోలేదని, ప్రేమగానే ఉంటారని స్పష్టం చేశారు.

భారీ జనం
రెండు ప్రాంతాల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తుందని, మాట తప్పని, మడమ తిప్పని పార్టీగా ప్రజల మనసులో చిరస్థాయిగా ఉంటుందని స్పష్టం చేశారు.

అభివాదం
వైయస్ పాలన తర్వాత రాష్ట్రంలో ఒక్క పెన్షన్ గాని, రేషన్‌కార్డు గాని, ఇల్లు కాని ఇవ్వలేదని, 1240 రూపాయలకు గ్యాస్ మాత్రం అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పరిపాలించిన కాలంలో ఫలానా అభివృద్ధి చేశామని ప్రజల ముందుకు వెళ్ళేదమ్ము, ధైర్యం లేకనే రాష్ట్రాన్ని విడగొట్టి ఓట్లు అడుగుతున్నారని దుయ్యబట్టారు.

శంఖం ఊదుతూ
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటిగా ఉండి అతి పెద్ద బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కలిసి కట్టుగా ప్రజలను విడగొట్టి ఓట్లు అడుగుతున్నారని, వారికి తగిన విధంగా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

ఎంపీ అభ్యర్థిగా..
ఎన్నికల షెడ్యుల్డ్ విడుదల చేసిన రోజే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రంలోనే మొదటి పార్లమెంట్ అభ్యర్థిగా ఖమ్మం నియోజకవర్గానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని జగన్ ప్రకటించారు.

గెలిస్తే మంత్రిగా..
ఆయన గెలిచిన తర్వాత కేంద్ర మంత్రిని చేస్తానని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో జిల్లాలోకి ప్రవేశించిన జగన్ వంద కిలో మీటర్లకుపైగా ప్రయాణించి సాయంత్రం 7-30గంటల సమయంలో ఖమ్మం చేరుకున్నారు.

ముందస్తు అరెస్టులు
అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగన్ పర్యటనను అడ్డుకుంటామని చెప్పిన తెలంగాణవాదులు ఎక్కడా కన్పించలేదు. పోలీసులు పలువురిని ముందుగానే అదుపులోకి తీసుకున్నారు.

భారీగా ప్రజలు
భావోద్వేగాలతో రాజకీయాలు చేసి భూమినైతే విడగొట్టారు కానీ మనసుల్ని విడదీయలేరని వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజనను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. ఖమ్మంలో బుధవారం రాత్రి జరిగిన వైయస్సార్ జనభేరీ సభలో ఆయన ప్రసంగించారు.

ఓదార్పు
అన్యాయం జరిగితే తెలుగువారమంతా ఒక్కటవుతామని ఆయన అన్నారు. రెండు ప్రాంతాల్లో తమ పార్టీ ఉంటుందని, రెండు ప్రాంతాల్లో తమ పార్టీ రాజన్న రాజ్యాన్ని తెస్తుందని ఆయన అన్నారు. ఓటేయాలని అడిగే ధైర్యం కాంగ్రెసుకు ఉందా, చంద్రన్న రాజ్యం తెస్తానని చంద్రబాబు చెప్పగలరా, ఆ ధైర్యం లేకనే భావోద్వేగాలతో రాజకీయాలు చేసే స్థాయికి దిగజారారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications