వేడెక్కిన విశాఖ: అంగన్వాడీ వర్కర్లను ఇలా ఎత్తుకెళ్లారు (పిక్చర్స్)
విశాఖపట్నం: అంగన్వాడీ వర్కర్ల ఆందోళనతో విశాఖపట్నం శుక్రవారంనాడు వేడెక్కింది. పెరిగిన జీతాల జీవోను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ వర్కర్లు శుక్రవారం రోడ్డెక్కారు. సమస్య తీరన పక్షంలో పోరాటాల నిర్మిస్తామంటూ హెచ్చరించిన అంగన్వాడీ వర్కర్లు విశాఖ నగరంలో డాబాగార్డెన్స్ సరస్వతి పార్కు నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు.
ప్రదర్శన జగదాంబ జంక్షన్, కేజిహెచ్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుంది. జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చిన అంగన్వాడీ వర్కర్లు శుక్రవారం ఉదయానికే నగరానికి చేరుకున్నారు. వీరంతా ఒకేచోటకు చేరుకుని ప్రదర్శన జరపడంతో అనేకచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంగన్వాడీ వర్కర్ల భారీ ప్రదర్శన కలెక్టరేట్‌కు చేరుకుంది.
కలెక్టరేట్ వద్ద రోడ్డుపైనే బైఠాయించిన అంగన్వాడీ వర్కర్లతో ఈ ప్రదేశం నిండింది. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ముందుగానే మొహరించిన పోలీసు బలగాలు కలెక్టరేట్ గేట్లను మూసివేయడం, కంచెను అమర్చడం, స్టాపర్లను అడ్డుగా ఉంచడం, తాళ్ళతో అడ్డుకోవడంతో ఆందోళనకారుల్లో ఏ ఒక్కరూ లోపలకు వెళ్ళేందుకు అవకాశం లేకుండా పోయింది.

రోడ్డుపై బైఠాయించారు...
కలెక్టరేట్‌లోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో ఆగ్రహించిన వర్కర్లు రోడ్డుపైనే బైఠాయించారు. దాంతో వీరందర్ని చెదరగొట్టే ప్రయత్నం చేసిన పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య వాదనలు నెలకొనడంతో ఒక్కసారిగా ఈప్రాంతం వేడేక్కింది.

నేతల ప్రసంగాలు..
కొద్దిసేపు ముఖ్య నేతలు ప్రసంగాలు, నినాదాలతో హోరెత్తిన తరువాత పోలీసు అధికారులు, సిబ్బంది, మహిళా కానిస్టేబుళ్లు రంగంలోకి దిగి చేతికందని వారిని అందినట్టుగానే వ్యాన్‌లోకి ఎక్కించిన పోలీసులు వీరందర్ని ఆయా పోలీసుస్టేషన్లకు తరలించారు.

భారీగా అరెస్టులు
ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వెంకటలక్ష్మి, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.కోటీశ్వరరావు తదితరులను అరెస్టు చేశారు.

వారితో పాటు..
నాయకులతో పాటు నిరసన తెలియజేసిన, అక్కడ నుంచి కదలించేందుకు భీష్మించిన మరికొంతమందిని అరెస్టులు చేశారు.

నలుమూలల నుంచీ..
అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మినీవర్కర్లతో వందలాది మంది వర్కర్లు జిల్లా నలుమూలల నుంచి తరలిరావడంతో ఈ ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

పోరాటం ఆగదు: సిఐటియు
పెరిగిన జీతాల జివో విడుదలయ్యే వరకు పోరాటం ఆగదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్.నరసింగరావు హెచ్చరించారు.

ఉక్కుపాదం మోపింది...
చంద్రబాబు ప్రభుత్వం మరోసారి ఉక్కుపాదం మోపిందని, ప్రకటించిన జీతాల జీవో విదుదల కోసం కలెక్టరేట్ల వద్ద శాంతియుతంగా నిరవధిక నిరాహారదీక్షలు చేస్తుంటే పోలీసు బలగాలు ప్రయోగించి దీక్షలను భగ్నం చేయించిందని నరసింగరావు అన్నారు.

కదలిక లేదు..
మండలాల్లో నిరాహారదీక్షలు చేసిన, కలెక్టరేట్ల వద్ద దీక్షలు చేపట్టినా ప్రభుత్వంలో కదలికరాలేదని నరసింగరావు చెప్పారు. చేసిదిలేక కలెక్టరేట్ ముట్టడికి దిగారని చెప్పారు.

ఇక నిరాహారదీక్షలు
వచ్చే నెల 3వ తేదీన విజయవాడలో నిరవధిక నిరాహారదీక్షలు, డిసెంబర్ 7న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నరసింగరావు తెలిపారు.

ట్రాఫిక్ మళ్ళింపు
నాలుగు వైపుల అంగన్వాడీ వర్కర్లతో నిండిన కలెక్టరేట్ మీదుగా వెళ్ళే వాహనాలను ఇతర దారులకు మళ్లించారు.

వాహనాలు ఇలా..
కెజిహెచ్ నుంచి జిల్లాప్రజాపరిషత్ కార్యాలయం మీదుగా సిటీ సర్వీసులు, వాహనాలు రాకపోకలు జరిగాయి. కలెక్టరేట్ లోపలకి వెళ్ళే సందర్శకులకు సైతం ఎప్పటి మాదిరి ఇబ్బందులు తప్పలేదు.

వెనక నుంచి లోనికి సిబ్బంది..
కలెక్టరేట్ వెనుకభాగానున్న పాఠశాల విద్యార్ధులు లోపల నుంచి బయపడేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. పిల్లల తల్లిదండ్రులు పోలీసులతో వాదనకు దిగినా ఫలితంలేకపోయింది.