జగన్ను సీఎంగా తప్పించాలని సుప్రీంలో పిల్- పదవీ దుర్వినియోగంపై జ్యుడిషియల్ విచారణ కూడా
సుప్రీం జడ్జి జస్టిస్ ఎన్వీ రమణకు వ్యతిరేకంగా ఏపీ సీఎం జగన్ ఫిర్యాదు చేసిన వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఏపీ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి ప్రయత్నించారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డేకు ఫిర్యాదు చేసిన వ్యవహారంలో సీఎం జగన్ను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఇవాళ మరో పిల్ దాఖలైంది.
సుప్రీం జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా జగన్ ఫిర్యాదు ఉందని, దీనిపై స్పందించి తక్షణం ఆయన్ను సీఎం పదవి నుంచి తప్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ పిల్ దాఖలు చేశారు. స్వయానా మనీలాండరింగ్, అవినీతి వంటి తీవ్రమైన ఆరోపణలపై 30 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న జగన్ .. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి అయిన రమణకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడమేంటని వారు తమ వాజ్యంలో ప్రశ్నించారు.

సుప్రీం జడ్డిపై బహిరంగంగా తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా సీఎంగా తన పదవిని దుర్వినియోగం చేస్తూ తన కేసుల్లో వ్యక్తిగత ప్రయోజనం పొందేందుకు జగన్ ఈ ఫిర్యాదు చేశారని పిటిషన్లో వారు ఆరోపించారు. జగన్ అత్యున్నత న్యాయస్ధానంలో న్యాయమూర్తిపై ఆరోపణలు చేయడం ద్వారా న్యాయవ్యవస్ధ ప్రతిష్టను ప్రజల్లో దిగజార్చేందుకు ప్రయత్నించారని పిటిషనర్లు అయిన న్యాయవాదులు పేర్కొన్నారు. కాబట్టి జగన్ను తక్షణం సీఎంగా తొలగించడంతో పాటు సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో జ్యుడిషియల్ విచారణ లేదా సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని వారు సుప్రీంకోర్టును కోరారు.