దయచేసి అపార్ధం చేసుకోవద్దు.!సహాయ చర్యలకు విఘాతం కలిగించొద్దనే వెళ్లలేదన్న సీఎం జగన్.!
అమరావతి/హైదరాబాద్: వరదల వల్ల జనం కకావికలమవుతుంటే సీఎం జగన్ వర్క్ ఫ్రం హోం అంటూ జనసేన, తుపాను ప్రభావిత ప్రాంతాలకన్నా విందులు వినోదాలు జగన్ కు ముఖ్యమని ప్రతిపక్ష పార్టీ, వరదలొచ్చి అంతా కొట్టుకుపోతుంటే ఏరియల్ సర్వే చేస్తే సరిపోతుందా అని బీజేపి చేసిన విమర్శలకు సీఎం జగన్ నేడు సమాధానం చెప్పారు. తనపై ఆరోపణలు గుప్పించిన ప్రతిపక్షపార్టీలన్నీటికీ ఏక వ్యాఖ్య సమాధానం ఇచ్చారు జగన్. దాంతో వరద ప్రాంతాల్లో సీఎం పర్యటించడం లేదు అనే అంశానికి తెరపడ్డట్టైందనే చర్చ జరుగుతోంది.

ప్రతిపక్షాల విమర్శలకు సీఎం జగన్ చెక్.. వరద సహాయ చర్యలపై సీఎం వివరణ
రాయలసీమ, నెల్లూరు జిల్లాలో వరద బీభత్సం సృష్టించినా, కొన్ని వేల మంది నిరాశ్రయులైనా పరామర్శించలేదని వస్తున్న విమర్శలకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రిగా అక్కడ పర్యటనకు వెళ్తే సహాయ కార్యక్రమాలకు ఆటంకాలు కలుగుతాయనే వెళ్లలేదని సీఎం స్పష్టం చేశారు. తాను వెళ్లడం వల్ల అధికారులంతా తన వెంటే తిరుగుతారని దీని వల్ల సహాయం ఆగిపోతుందన్నారు.ఈ విషయంపై తాను ఉన్నతాధికారులతో మాట్లాడితే ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఎప్పుడూ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించలేదన్న అంశాన్ని ఇక్కడ జగన్ గుర్తు చేశారు.

ఇంట్లో ఖాలీగా కూర్చోలేదు.. యంత్రాంగంతో సమీక్షలు చేస్తూనే ఉన్నానన్న జగన్..
కాగా వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆయా జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందర్నీ సహాయచర్యల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. అలాగే రోజూ సమీక్షలు నిర్వమిస్తూ యంత్రాంగానికి ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేస్తున్నట్టు జగన్ స్పష్టం చేసారు. ఏరియల్ సర్వే కూడా చేశానని, సహాయ కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత ఖచ్చితంగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి, బాదితుల సమస్యలతో పాటు అధికారులు చేసిన సహాయ కార్యక్రమాల గురించి ఆరా తీస్తానని వివరించారు. కడప తన సొంత జిల్లా అని ప్రేమ కాస్త ఎక్కువే ఉంటుందని జగన్ స్పష్టం చేశారు.
పరిస్ధితులు అదుపులోకి వచ్చాక తప్పక పర్యటిస్తా.. స్పష్టం చేసిన సీఎం..
వరద బాధిత ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన ప్రతిపక్ష నేత చంద్రబాబు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, గాల్లో వచ్చారు, గాల్లోనే పోతారని మాట్లాడారని, ఆయన సంస్కారానికి హాట్సాఫ్ అన్నారు జగన్. తాము శరవేగంగా సహాయ కార్యక్రమాలు అందించామని, చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా మానవత్వం చూపించారా అని ప్రశ్నించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు శరవేగంగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చామన్నారు. వెయ్యి కాదు, రెండు వేలు కాదు ఏకంగా 90వేల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామన్నారు. పశువులు నష్టపోయిన వారికి కూడా నష్టపరిహారం ఇచ్చామని జగన్ ప్రకటించారు. అన్ని వర్గాలకూ నష్టపోయిన వారికి పరిహారం అందించామన్నారు ముఖ్యమంత్రి.

అర్థం చేసుకోండి. తప్పుడు ప్రచారం మానుకోవాలన్న ఏపీ సీఎం
అసాధారణ రీతిలో వచ్చిన వాన, వరదల వల్ల ఉపద్రవం వచ్చిందని జగన్ ఆవేదన వ్యక్తం చేసారు. ఎక్కడా మానవ తప్పిదం లేదన్నారు. ముందస్తుగానే ఆయా గ్రామాల ప్రజలందరిని అప్రమత్తం చేశారన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తగిన రీతిలో స్పందించలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు జగన్. ఓ పత్రికలో ఈ మేరకు వచ్చిన ఓ వార్తను సీఎం అసెంబ్లీలో చూపించారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి రిజర్వాయర్ను యుద్ధ ప్రాతిపదికన పునరుద్దరిస్తామని, భవిష్యత్లో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తామని, దయచేసి అపార్ధం చేసుకోవద్దని సీఎం జగన్ తెలిపారు.