మోడీ నన్ను ప్రస్తావించలేదు.. అయినా ఫర్వాలేదు-మహానాడులో చంద్రబాబు కామెంట్స్
ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడులో పార్టీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీపై గతంలో ధర్మపోరాటం చేసి విఫలమైన తర్వాత మౌనంగా ఉంటున్న చంద్రబాబు ఇవాళ మరోసారి ప్రధాని పేరును మహానాడులో ప్రస్తావించారు. ప్రధాని మోడీ తాజాగా హైదరాబాద్ ఐఎస్బీ పర్యటనను చంద్రబాబు గుర్తుచేశారు.
ఉమ్మడి ఏపీలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)ని ఎట్టకేలకు హైదరాబాద్‌కు ఎలా తీసుకురాగలిగారో చంద్రబాబు ఇవాళ మరోసారి గుర్తు చేసుకున్నారు."ఐఎస్బి 20వ వార్షిక దినోత్సవ వేడుకల్లో ప్రధాని ప్రసంగించారు. ఇది నాకు ఎన్నో జ్ఞాపకాలను తెచ్చిపెట్టింది. ప్రధాని నా పేరు ప్రస్తావించలేదు. పర్వాలేదు. నా తెలుగు జాతి కోసం నేను అలా చేశాను, అది నాకు సంతృప్తినిస్తుంది" అని చంద్రబాబు చమత్కరించారు.

ఐఎస్బీ ఏర్పాటు కోసం థింక్ ట్యాంక్‌కు ఆహ్వానం పంపినప్పుడు, తమ జాబితాలో హైదరాబాద్‌తో బెంగళూరు, ముంబై, చెన్నైలను పరిశీలిస్తున్నామని చెప్పారని చంద్రబాబు తెలిపారు. ఈ సమయంలో "అల్పాహారం, కాఫీ కోసం రావాలని తాను వారిని ఫోన్లో అభ్యర్థించానన్నారు. విమానాశ్రయంలో వారిని రిసీవ్ చేసుకోవడానికి తన మంత్రులను పంపానన్నారు. అంతే కాకుండా వారికి వ్యక్తిగతంగా భోజనం వడ్డించానని కూడా చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఐఎస్బీ కోసం చాలా ప్రయత్నాలు చేశానన్నారు.
ఐఎస్బీ హైదరాబాద్‌కు అప్పటి ప్రధాని వాజ్‌పేయి వచ్చి శంకుస్థాపన చేశారని చంద్రబాబు గుర్తుచేశారు.ఇది చివరికి ఆభరణంగా మారిందని, అలాంటి వందల ఆభరణాలను తెలుగువారి కోసం టీడీపీ తీసుకొచ్చిందన్నారు. కరోనా వైరస్ మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో జీనోమ్ వ్యాలీ యావత్ దేశాన్ని ఆదుకుందని కూడా చంద్రబాబు తెలిపారు. టీడీపీ హయాంలో తీసుకొచ్చిన పథకాలు, పథకాలతో పొరుగు రాష్ట్ర ప్రజలు గొప్ప ప్రయోజనాలు పొందుతున్నారని ఆయన వెల్లడించారు.శారీరక శ్రమ నుంచి మైండ్ తో చేసే ఉద్యోగాల్లోకి మారడానికి తాను చేసిన ప్రయత్నాలను కూడా చంద్రబాబు గుర్తుచేసారు. అందుకే ఐటీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందని తెలిపారు.ఇప్పుడు తెలుగు అమ్మాయిలు విదేశాలకు వెళ్లి మగవారి కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు..